Dr.Vangala Ramakrishna ………………………
పరమేశ్వరునికి చేసే ప్రదోషకాల పూజలలో నందికేశునికి కూడా ముఖ్య పాత్ర వుంది. ప్రదోషకాలంలో శివుని అంశ నందీశ్వరుని రెండు కొమ్ముల మధ్య తాండవం చేస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఆ సమయంలో చేసే పూజలకు రెండింతల పుణ్యం లభిస్తుందని పెద్దలు చెబుతారు.
ఎడమచేతి బొటనవ్రేలిని ఎడమచేతి చూపుడు వ్రేలిని నంది కొమ్ముల మీద పెట్టి రెండు వేళ్ళ మధ్యలోంచి శివలింగమును దర్శించాలి. శివలింగానికి కవచం తొడిగి ఉంటే నేరుగా శివ దర్శనం చేయవచ్చు.ధర్మస్వరూపుడైన నంది కుల మతాలు పట్టించుకోకుండా అందరికీ అనుగ్రహించే ‘ధర్మదర్శన’ విధానం అందుబాటులోకి వచ్చి అన్ని ఆలయాలకూ విస్తరించి ఈనాటికీ పచ్చగా నిలిచి ఉంది.
పురాణాలు ప్రస్తావించిన నందులు 9 రకాలు. అవే ప్రథమ నంది, నాగ నంది, శివ నంది, కృష్ణ(విష్ణు)నంది, మహానంది, గరుడ నంది, గణేశ నంది, సోమ నంది, భాను నంది. ఈ నవనందులు ఆంధ్ర దేశంలో ని నందిమండలం’లో తపసు చేశాయి. నంది తపసు చేసిన ప్రతి చోట ఒక శివలింగం ఉంటుంది. పార్వతీమాత తన విద్యా రహస్యమంతటిని నందికి చెప్పింది. అమ్మవారి శ్రీవిద్య నందీశ్వరుడి ద్వారా వచ్చింది. అందుకే లలితా సహస్రనామంలో ‘నంది విద్యానటేశ్వరీ’ అనే నామం కనబడుతుంది.
నందులు స్థిరనంది, చరనంది అని రెండురకాలు. ‘స్థిరనంది’ అంటే కదలనిది. చరనంది అంటే కదిలేది. పూర్వం శివాలయాలలో ఈ రెండు రకాల నందులూ ఉండేవి. ఎవరికయినా ప్రసవం అవక బిడ్డ అడ్డం తిరిగితే వాళ్ళని తీసుకువెళ్ళడం కుదరకపోతే వాళ్ళను శివాలయానికి తీసుకువెళ్ళి చర నందిని తిప్పేవారు. ప్రసవం చాలా సులువుగా అయ్యేది. అలా శివుడు భూతనాథుడైతే నంది వైద్యనాథుడయ్యాడు.
ఆలయంలో శివదర్శనం చేసేటప్పుడు నందీశ్వరుడి ప్రక్కనుంచి వెళ్ళడం కానీ, నందికి శివుడికి మధ్యలో నిలవడం కానీ చేయకూడదు. నిరాడంబర జీవనుడైన నందీశ్వరుని మెడలో గరికమాలవేసి, మట్టి ప్రమిదలో నేతి దీపం వెలిగించి పూజిస్తే ఆనందభరితుడవుతాడు.
తడిపిన బియ్యంలో బెల్లం కలిపి ప్రసాదంగా నివేదిస్తే చాలు విశేష పుణ్యఫలాన్ని అనుగ్రహిస్తాడు.
అరటిపండు ముక్కలు నంది మూతికి రాయడం, కార్తీక దీపాలను నందీశ్వరుడి తోక కింద పెట్టడం వంటి పనులు చేయకూడదు. అవి మహా పాప కృత్యాలు. శివాలయం ఎదుటి నుంచి ఏ సమయంలో వెళ్ళినా దర్శనమిచ్చే మహానుభావుడు నంది. ఆలయం మూసి ఉన్నా భక్తులను అనుగ్రహించే భక్త వత్సలుడు నంది.
ప్రజామోదం అమితంగా పొందిన ఈ బసవని పేరుతో బసవ మతం ఏర్పడింది. నిరంతర శివ నామస్మరణ చేసే వారికి ముక్కంటి కంటి ముందు దేవుడని చాటడానికే ఈ బసవయ్య శివునికి ఎదురుగా కూర్చుని ఉంటాడు. స్థాణువుగా పూజలందుకుంటున్న శివుని స్థాణుయోగంతో నిరంతర శివదర్శనం చేసుకుంటూ ఉంటాడు.