ఒకరు చిక్కడు .. మరొకరు దొరకడు !!

Sharing is Caring...

 Most Wanted Criminals …………

చోటా షకీల్ దావూద్ ఇబ్రహీం కి నమ్మకమైన అనుచరుడు. ఇప్పటికీ దావూద్ ఇబ్రహీం నేతృత్వంలోని ‘డి-కంపెనీ’లో ముఖ్య కార్యనిర్వహణ అధికారి (CEO) గా వ్యవహరిస్తున్నాడు. అంతర్జాతీయంగా విస్తరించి ఉన్న ఈ ముఠా రోజువారీ నేరపూరిత కార్యకలాపాలను, ముఖ్యంగా డ్రగ్స్ స్మగ్లింగ్, ఆయుధాల సరఫరా, హవాలా లావాదేవీలను ఇతనే పర్యవేక్షిస్తున్నాడు.

ఇప్పటికీ ముంబైలోని బిల్డర్లు, వ్యాపారవేత్తలను బెదిరించి డబ్బు వసూలు చేయడంలో షకీల్ పేరు వినిపిస్తోంది.ఇటీవల కూడా ముంబైకి చెందిన ఒక బిల్డర్‌కు షకీల్ పేరుతో బెదిరింపు లేఖ,  తూటా (bullet) అందినట్లు వార్తలు వచ్చాయి.

దావూద్ ఇబ్రహీం ఆరోగ్యం లేదా భద్రతకు సంబంధించి ఏవైనా వదంతులు వచ్చినప్పుడు, షకీల్ వాటిని ఖండిస్తూ మీడియాకు లేదా ఇతర వర్గాలకు సమాచారం ఇస్తుంటాడు. 2023 చివరలో దావూద్ విషప్రయోగానికి గురయ్యాడని వార్తలు వచ్చినప్పుడు, “భాయ్ (దావూద్) 1000% ఫిట్‌గా ఉన్నాడు” అని షకీల్ స్పష్టం చేశాడు. ప్రస్తుతం షకీల్ కూడా కరాచీలోనే ఉంటున్నాడు.  

పాకిస్థాన్ గూఢచారి సంస్థ ISI మద్దతుతో భారతదేశంలోకి నకిలీ కరెన్సీని పంపడం, ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చడం వంటి పనుల్లో ఇతను కీలకంగా ఉన్నాడని జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) తన ఛార్జీషీటులో ప్రస్తావించింది. 2017లో షకీల్ మరణించాడని కొన్నివార్తలు వచ్చాయి, కానీ నిఘా వర్గాలు అతని తాజా కార్యకలాపాలు అతను ఇంకా బతికే ఉన్నాడని సూచిస్తున్నాయి.

ఒకప్పుడు చోటా షకీల్ ముంబైలోని నాగ్పాడా, డోంగ్రీ ప్రాంతాల్లోఒక ట్రావెల్ ఏజెన్సీ నడిపేవాడు. అప్పట్లో దావూద్ గ్యాంగ్ సభ్యులకు విదేశీ ప్రయాణాల కోసం టికెట్లు, పాస్‌పోర్టులు ఏర్పాటు చేస్తూ వారి నమ్మకాన్ని గెలుచుకున్నాడు.తర్వాత కాలంలో దావూద్ కి పరిచయం అయ్యాడు. మొదట్లో దావూద్ గ్యాంగ్‌లో చోటా రాజన్ నంబర్ 2 స్థానంలో ఉండేవాడు.

అయితే షకీల్ తన తెలివితేటలతో, పక్కా ప్లానింగ్‌తో తక్కువ కాలంలోనే దావూద్‌కు దగ్గరయ్యాడు. ఇది రాజన్, షకీల్ మధ్య ఆధిపత్య పోరుకు దారితీసింది.1993 ముంబై బాంబు పేలుళ్ల తర్వాత దావూద్ భారత్ వదిలి వెళ్ళిపోయాడు. ఆ సమయంలో ముంబైలో గ్యాంగ్ కార్యకలాపాలను, ముఖ్యంగా ఆయుధాల సరఫరాను షకీల్ చాలా చాకచక్యంగా నిర్వహించాడు. దావూద్‌పై నమ్మకంతో ప్రాణాలకు తెగించి పనిచేశాడు.

బాంబు పేలుళ్ల తర్వాత హిందూ-ముస్లిం గొడవల సాకుతో చోటా రాజన్ దావూద్ నుండి విడిపోయాడు. ఆ ఖాళీని షకీల్ భర్తీ చేశాడు. అప్పటి నుండి దావూద్ ఇబ్రహీం వ్యక్తిగత విషయాల నుండి అంతర్జాతీయ డీల్స్ వరకు అన్నింటినీ షకీల్ చేతిలోనే పెట్టాడు.

1993 ముంబై బాంబుపేలుళ్లు అప్పట్లో పెను సంచలనం సృష్టించాయి. దేశ చరిత్రలో అత్యంత భీకరమైన ఈ ఉగ్రవాద దాడిలో షకీల్ ఒక ప్రధాన కుట్రదారుడు. ఆయుధాలు,పేలుడు పదార్థాలను (RDX) అక్రమంగా దేశంలోకి తరలించడంలో,నిందితులకు పాకిస్థాన్‌లో శిక్షణ ఇప్పించడంలో ఇతను కీలక పాత్ర పోషించాడు.

ఆఫ్ఘనిస్తాన్, కొలంబియా సరఫరాదారులతో కలిసి అంతర్జాతీయ మాదకద్రవ్యాల అక్రమ రవాణా నిర్వహిస్తున్నట్లు అమెరికా ప్రభుత్వం గుర్తించింది. ఆఫ్రికాలో అక్రమ వజ్రాల గనులను కొనుగోలు చేసి, ఉక్రెయిన్ మాఫియాతో వజ్రాలను ఆయుధాల కోసం మార్పిడి (Barter) చేసేవాడని సమాచారం.

ముంబైలోని బాలీవుడ్ ప్రముఖులు, బిల్డర్లు , వ్యాపారవేత్తలను బెదిరించి భారీగా డబ్బు వసూలు చేయడంలో ఇతను సిద్ధహస్తుడు. దీని కోసం ఇతను ముంబైలో తన నెట్‌వర్క్‌ను, హవాలా మార్గాలను ఉపయోగిస్తాడు.
2000వ సంవత్సరంలో తన ప్రత్యర్థి చోటా రాజన్ పై బ్యాంకాక్‌లో జరిగిన హత్యాయత్నం వెనుక ప్రధాన సూత్రధారి షకీలే.

అలాగే అనేక మంది జర్నలిస్టులు, రాజకీయ నాయకులను లక్ష్యంగా చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
చోటా షకీల్ పై రెడ్ కార్నర్ నోటీసు కూడా జారీ చేశారు..ఒక తరుణంలో దావూద్ ఇబ్రహీం,చోటా షకీల్ మధ్య విభేదాలు వచ్చాయి. దావూద్ తమ్ముడు అనీస్ ఇబ్రహీం గ్యాంగ్ కార్యకలాపాల్లో ఎక్కువగా జోక్యం చేసుకోవడం వల్ల షకీల్‌కు, దావూద్‌కు మధ్య దూరం పెరిగింది.

షకీల్ అప్పట్లో కరాచీలోని తన నివాసాన్ని వదిలి గుర్తు తెలియని చోటుకు వెళ్లినట్లు వార్తలు వచ్చాయి. వీరిద్దరూ విడిపోతే ‘డి-కంపెనీ’ బలహీనపడుతుందని,ఉగ్రవాద కార్యకలాపాలు ఆగిపోతాయని ISI రంగంలోకి దిగి వీరి మధ్య రాజీ కుదిర్చింది.

డిసెంబర్ 2023లో దావూద్ పై  విష ప్రయోగం గురించి వార్తలు వచ్చినప్పుడు, చోటా షకీల్ స్వయంగా స్పందించారు.”భాయ్ 1000% ఫిట్‌గా ఉన్నారు” అని చెబుతూ, తాము ఇంకా కలిసి ఉన్నామని షకీల్ ధృవీకరించారు.పాక్ అండ ఉన్నంతవరకు వీరు ఎవరికి దొరకరు.   

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!