దీదీ సారధ్యంలో కొత్త ఫ్రంట్ ?

Sharing is Caring...

తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ నేతృత్వంలో మరో ఫ్రంట్ ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ వైఫల్యం దరిమిలా జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయం అవసరాన్ని అన్ని పార్టీలు గుర్తిస్తున్నాయి. కాంగ్రెస్ అయితే ఇపుడున్న పరిస్థితుల్లో ఫ్రంట్ కు నాయకత్వం వహించే అవకాశాలు లేవు. మమతా ఇప్పటికే ఆ దిశగా ఆడుగులు వేశారు.  కాబట్టి ఆమె కొత్త ఫ్రంట్ కు నాయకత్వం వహించ వచ్చని  రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఐదు రాష్ట్రాలకు ఎన్నికల జరుగుతున్న సమయంలోనే  దీదీ దాదాపు 15 పార్టీలకు మోడీ పై కలసి పోరాడే విషయం పై లేఖలు రాశారు. ఆ పార్టీలలో కాంగ్రెస్, ఎన్సీపీ, డీఎంకే, శివసేన,  జీఎం ఏం, ఆప్,  బీజేడీ,  వైసీపీ , తెరాస , సమాజ్వాదీ, నేషనల్ కాంగ్రెస్, పీడీపీ వంటి పార్టీలున్నాయి. వీటిలో శివసేన వంటి కొన్నిపార్టీలు మమతకు మద్దతు పలికాయి.  వైసీపీ .. తెరాస మాత్రం పైకి స్పందించలేదు. సీఎం గా ప్రమాణం చేసాక మమతా మరోమారు అందరిని కలిసే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు.

నిన్నటి ఎన్నికల అనుభవాల నేపథ్యంలో మమతా ఇక చురుగ్గా అడుగులు వేయవచ్చని చెబుతున్నారు.ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ తో తాడో పేడో తేల్చుకోవాలని మమత భావిస్తున్నట్టు నిన్నటి ఆమె మాటలు స్పష్టం చేశాయి. ఇక యూపీఏ కూటమి కి నాయకత్వం వహిస్తున్న సోనియా గాంధీ అనారోగ్యం కారణంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం లేదు. ఏదో మొక్కుబడిగా ప్రకటనలు చేస్తున్నారు కానీ రాజకీయాల్లో అంత చురుగ్గా లేరు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లేని పార్టీ గానే కొనసాగుతున్నది. పార్టీ కే అధ్యక్షుడిని నియమించుకోలేక .. రాహుల్ ని ఒప్పించలేక సోనియా ఇబ్బంది పడుతున్నారు. నిన్నటి 5 రాష్ట్రాల ఎన్నికల్లో రాహుల్ ఎంత ప్రచారం చేసినప్పటికీ కాంగ్రెస్ ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించలేక పోయింది. ఈ క్రమం లో కాంగ్రెస్ జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయంగా మారే అవకాశాలు తక్కువే. ఇపుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ కూడా కొత్త ఫ్రంట్ లో ఒక భాగస్వామిగా చేరే అవకాశాలున్నట్టు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

వాస్తవానికి 2019 లోకసభ ఎన్నికల సమయం లోనే మమత కొత్త ఫ్రంట్ ఏర్పాటు విషయమై ఎన్సీపీ అధినేత శరద్ పవార్  తో చర్చలు జరిపారు. సైద్ధాంతికంగా కలసి వచ్చే పార్టీలను ఏక తాటి పైకి తీసుకురావడానికి ఫ్రంట్ లో కీలక పాత్ర పోషించాలని కోరారు. మమతా తన ప్రయత్నాల్లో ఉండగానే అప్పటి ఏపీ సీఎం చంద్రబాబు చొరవ తీసుకుని తానే అందరితో మాట్లాడి యూపీఏ ఫ్రంట్ నే మళ్ళీ తెరపైకి తెచ్చారు. మోడీ కి వ్యతిరేకంగా పోరాటం చేసే ప్రయత్నాలు చేశారు. కానీ అవేవి ఫలించలేదు. ఏపీ లో చంద్రబాబే ఓడిపోయిన దరిమిలా అక్కడితో ఆ ప్రయత్నాలకు తెరపడింది.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!