సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన “అతడు ” ఆయన కెరీర్ లో బెస్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు. సినిమా విడుదలై 18 ఏళ్ళు అవుతున్నప్పటికీ .. ఇపుడు చూసినా ఫ్రెష్ ఫీలింగ్ కలుగుతుంది. ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టని సినిమా ఇది.
ఈ సినిమాను 20/30 సార్లు చూసిన అభిమానులు కూడా ఉన్నారు. కథను అనుకున్న రీతిలో తెరకెక్కించడానికి దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చాలా శ్రమ పడ్డారు. ఆ శ్రమకు తగిన ఫలితం లభించింది.
హాలీవుడ్ స్టైల్ యాక్షన్ ఎపిసోడ్స్ తో క్రైమ్ థ్రిల్లర్ లా కనిపించే ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. అందుకే ఈ సినిమాకు రిపీటెడ్ ఆడియన్స్ ఎక్కువ. ఈ సినిమా కథ మొత్తం ఎనభై శాతం పాశర్లపూడి అనే గ్రామంలో జరుగుతోంది.
అందుకోసం పెద్ద ఇల్లు కావాలి. నిర్మాత మురళీ మోహన్ హైదరాబాద్ శివార్లలోని తమ సొంత స్థలంలో సెట్టింగ్ వేసి అక్కడే షూటింగ్ చేశారు. ఈ సినిమా క్లైమాక్స్ ఫైట్ సన్నివేశాలు తీయడానికి దాదాపు ఇరవై రోజులు పట్టింది. క్లైమాక్స్ దృశ్యాలు అందరినీ ఆకట్టుకునే విధంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ అద్భుతంగా షూట్ చేశారు.
ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్ సరి కొత్తగా హలీవుడ్ తరహాలో క్లైమాక్స్ ఫైట్స్ తీశారు. కొన్ని మోషన్ షాట్స్ తెర మీద చూస్తుంటే ఎలా తీసారా ?అనిపిస్తుంది. అలాగే మహేష్ పక్క నుంచి బుల్లెట్ దూసుకుపోవడం …. దానితో సమానంగా మహేష్ పరుగెత్తడం వంటి సీన్స్ సినిమాలో చూస్తుంటే థ్రిల్ ఫీలవుతాం. గుహన్ తన ప్రతిభనంతా చూపి యాక్షన్ ఎపిసోడ్స్ ను మార్వలెస్ గా చిత్రీకరించాడు.
ఇక సినిమా మొత్తం మీద మహేష్ బాబుకు అయిదారు పేజీల డైలాగులు మాత్రమే ఉంటాయి. మహేష్ రెండు గంటల్లో డబ్బింగ్ చెప్పేయడం విశేషం. ఈ సినిమాలో మహేష్ కొత్త లుక్ ప్రేక్షకులకు బాగా నచ్చింది. మహేష్ డైలాగులు చెప్పే విధానం కొత్తగా అనిపిస్తుంది.
అభిమానులను అందుకే బాగా కనెక్ట్ చేసింది. సినిమా సక్సెస్ కి ఇదొక కారణమని చెప్పుకోవాలి. మహేష్ త్రిష ల మధ్య టీజింగ్ సన్నివేశాలు అద్భుతం గా ఉంటాయి. ఇద్దరి జోడీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.
బ్రహ్మానందం పొట్టపై మహేష్ పంచ్ కొట్టే సన్నివేశం.. ఇతర కామెడీ సీన్స్ పొట్ట పగిలేలా నవ్విస్తాయి. కథలో అంతర్భాగంగా సహజంగా ఉంటాయవి. సినిమా చూస్తుంటే ఆ ఫామిలీ మధ్య మనం కూడా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. ఇందులో పాటలన్నీకూడా సూపర్ హిట్ అయ్యాయి. మణి శర్మ బాణీలు కూర్చిన ఈ పాటలు నిత్యం ఎక్కడో చోట వినిపిస్తుంటాయి. ప్రతి పాటను త్రివిక్రమ్ డిఫరెంట్ గా తీశారు.
సినిమాలో తనికెళ్ళ భరణి చెప్పినట్టు ….అతడు చూసిన తర్వాత ఎవడన్నా కసితో సినిమా తీస్తాడు, లేదా ప్రేమతో తీస్తాడు. వీడేంట్రా… ఇంత శ్రద్ధగా తీశాడు… ఏదో గోడ కడుతున్నట్టు! గులాబీ మొక్కకి అంటు కడుతున్నట్టు… చాలా జాగ్రత్తగా… పద్ధతిగా తీశాడు’అనుకుంటారు ప్రేక్షకులు.
అటు మహేష్ .. ఇటు త్రివిక్రమ్ నిజంగానే కసితో .. పద్దతిగా ఎవరి పని వారు చేశారు కాబట్టే సినిమా అందరిని ఆకట్టుకుంది.చిన్న పాత్రను కూడా శ్రద్ధగా తీర్చిదిద్దబట్టే సినిమా విజయవంతమైంది. హాట్ స్టార్ లో అతడు సినిమా ఉంది. చూడని వాళ్ళు చూడొచ్చు. చూసిన వారు మళ్ళీ చూడొచ్చు.
కొస మెరుపు ……
త్రివిక్రమ్ … ఈ సినిమాను పవన్ కళ్యాణ్ తో తీయాలనుకున్నారు .. కథ వినిపిస్తుంటే పవన్ నిద్రపోయారు. ఆయనకు కథ నచ్చలేదని త్రివిక్రమ్ బయటకొచ్చేశారు. మహేష్ బాబు కి చెప్పగానే “అతడు” థ్రిల్ ఫీలయ్యారు. ఒకే అన్నారు.
———–KNM