బాక్సాఫీస్ మొనగాడు !!

Sharing is Caring...

హీరో కృష్ణ .. దర్శకుడు కె రాఘవేంద్ర రావుల కాంబినేషన్ లో వచ్చిన సూపర్ డూపర్ హిట్ సినిమా .. ఊరికి మొనగాడు.అప్పట్లో అభిమానులు ఈ సినిమాను ‘బాక్సాఫీస్ మొనగాడు’ గా పిలుచుకునే వారు. మొదట్లో ఈ సినిమాపై పెద్దగా అంచనాలు లేవు.

అయితే సినిమాలో హీరో ఇంట్రడక్షన్ విభిన్నం గా ఉండటం .. కథనం… డైలాగులు.. ముఖ్యంగా కృష్ణ జయప్రద కాంబినేషన్ ప్రేక్షకులను అలరించాయి. పోటీగా ఇతర హీరోల సినిమాలు రిలీజ్ అయినప్పటికీ అవేవి జనాలకు ఎక్కలేదు. రాఘవేంద్రుడి మాయా జాలం వర్కౌట్ అయింది. కృష్ణ కు ఈ సినిమా భారీ హిట్. ఆయన ఇమేజ్ ను కూడా ఒక్కసారిగా పెంచేసింది.

సినిమాలో పాటలన్ని ఎపుడూ జనంలో నోట్లో నానేవే. “ఇదిగో తెల్లచీర …. అవిగో మల్లెపూలు ” పాట అయితే సినిమా హిట్ కావడానికి దోహదపడింది. మాస్ మసాలా గీతంగా చిరస్థాయిగా నిలిచి పోయింది. అప్పట్లో ఈ పాట చూసేందుకే వచ్చిన ప్రేక్షకులు కూడా ఉన్నారు. ఈ సినిమాకు అలా రిపీటెడ్ ఆడియన్స్ ఎక్కువ.

మామ రావు గోపాలరావు భరతం పట్టేందుకు ఆయన కూతురు జయప్రదతో కలసి అల్లుడు కృష్ణ నాటకమాడే సందర్భంగా వచ్చే పాట ఇది. మాస్ బాణీల మహారాజు చక్రవర్తి ట్యూన్ కి వేటూరి మాస్టారు రాసిన గీతమది.  నృత్యదర్శకుడు సలీం సింపుల్ స్టెప్స్ తో పాటను జనరంజకంగా మలిచారు. బాలు సుశీల పాడిన ఆ పాట ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్ గా రికార్డుల్లో కెక్కింది. 

బూజం బంతి బూజం బంతి,….అందాలజవ్వని పాటలు కూడా ప్రేక్షకుల ఆదరణ పొందాయి. కదలిరండి మనుషులైతే పాట చిత్రీకరణ అద్భుతంగా తీశారు. ఇక కథనం కొత్తగా ఉండటం .. ఆసక్తికరంగా తెరకెక్కించడంలో రాఘవేంద్రరావు తనదైన శైలిని ప్రదర్శించారు. రావుగోపాలరావు.. అల్లు రామలింగయ్య ల ట్రాక్ జనం కి బాగా నచ్చింది.

కామెడీ విలనిజాన్ని రచయిత సత్యానంద్ బాగా పండించారు. హీరో కృష్ణ సొంత సినిమాలే ఎక్కువగా హిట్ అవుతాయి .. బయటి నిర్మాతలవి హిట్ కావు అనే అపప్రధను ఈ సినిమా తుడిచి పెట్టేసింది. అడుసుమిల్లి గోపాలకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు.  

ఇక ఈ చిత్రం ప్రజాదరణ పొందగానే హీరో కృష్ణ దీన్ని హిందీలో నిర్మిస్తే అద్భుతంగా హిట్ అవుతుందని ఊహించారు. ఆలస్యం గాకుండా  హక్కులు తీసుకుని పద్మాలయ బ్యానర్ పై హిందీలో రీమేక్ చేసారు. జితేంద్ర శ్రీదేవి  జంటగా హిమ్మత్ వాలా పేరిట విడుదల అయింది.బాలీవుడ్ లో కృష్ణ  ఊహించినట్టే పెద్ద హిట్ అయింది. రికార్డు స్థాయిలో కలెక్షన్లు రాబట్టింది.

కథలో పెద్దగా మార్పులు చేయకుండా తెలుగు ఫార్ములానే హిందీలో అనుసరించారు. అది అక్కడి ప్రేక్షకులకు నచ్చింది. సౌత్ ప్రొడ్యూసర్స్ నార్త్ లో ఇంత పెద్ద హిట్ పిక్చర్ చేయడం ఏమిటా అని అక్కడి వాళ్లంతా ఆశ్చర్యపోయారు. రాఘవేంద్రరావుకు హిందీలో హిమ్మత్ వాలా మూడో సినిమా. శ్రేదేవి కెరీర్ ను మలుపు తిప్పిన సినిమా. ఆ విధంగా రెండు భాషల్లో ఊరికిమొనగాడు బాక్సాఫీస్ మొనగాడిగా చరిత్ర కెక్కాడు. 40 ఏళ్ళ క్రితం విడుదలైనప్పటికీ …  ఇప్పటికి సినిమా కొత్తగానే ఉంటుంది. 

————-KNM

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!