వాహిని వారి “పెద్ద మనుషులు” వీరే !

Sharing is Caring...

Sensation at the time……………………………. 

వాహిని వారి “పెద్దమనుషులు” అందరిని ఆకట్టుకునే సినిమా. 1954 లో ప్రముఖ దర్శకుడు కె. వి.రెడ్డి తీసిన సినిమా ఇది. తర్వాత కాలంలో ఇదే కథను అటు తిప్పి .. ఇటు తిప్పి తమదైన శైలిలో ఎందరో దర్శకులు .. రచయితలు సినిమాలు తీశారు. హెన్రిక్ ఇబ్సన్ రాసిన  “ది పిల్లర్స్ ఆఫ్ సొసైటీ “అనే నాటకం ఈ చిత్రానికి మూలం. ప్రముఖ రచయిత డి.వి.నరసరాజు.. కేవీ రెడ్డి కలసి కథను రూపొందించారు.

నరసరాజు డైలాగులు రాసారు. చిన్నపట్టణం లోని కొంతమంది పెద్దల రాజకీయాలను అద్భుతంగా తెర కెక్కించారు. రాజకీయం చాటున పెద్దమనుషుల దోపిడీ ఎలా సాగుతుంది ? దోపిడీ ని ఎదుర్కొనే వారిని ఎలా అడ్డు తొలగించుకుంటారు అన్నదే కథాంశం. కొంచెం పెద్ద సినిమా అయినా ఆసాంతం ఆసక్తికరంగా ఉంటుంది. దర్శకుడు కె.వి.రెడ్డి కి  ఇది ఐదో సినిమా. 

అంతకుముందు భక్త పోతన (1943) యోగివేమన (1947) గుణసుందరి కథ (1949)పాతాళభైరవి (1951)చిత్రాలు తీశారు. అవన్నీ హిట్ సినిమాలే. అయిదవ సినిమాగా సాంఘిక చిత్రం తీద్దామని ‘పెద్దమనుషులు’ తీశారు. ‘ది పిల్లర్స్ ఆఫ్ సొసైటీ’  లో రెండు పాత్రలు తీసుకున్నారు. మొదట ఈ సినిమాకు పింగళి రచయిత అనుకున్నారు. అయితే విజయా ప్రొడక్షన్స్ లో పింగళి అప్పటికి ఉద్యోగి గా చేస్తున్నారు. నాగిరెడ్డి బయటి సినిమాలకు పనిచేసేందుకు అనుమతి ఇవ్వలేదు. దీంతో నరసరాజును కేవీరెడ్డి రచయిత గా కుదుర్చుకున్నారు.

ఇద్దరు కలసి కథ తయారు చేశారు. సమాజంలో ఉన్న కుళ్ళు ను వ్యంగ్య ధోరణిలో ప్రజలకు తెలియజెప్పాలని భావించారు. అందుకు అనుగుణంగానే నరసరాజు  స్క్రిప్ట్ సిద్ధం చేశారు. పెద్దమనుషులు లో కీలకపాత్ర  చైర్మన్‌ది. ఆ పాత్రని ముందు ఎస్వీరంగారావు చేత వేయించాలని కేవీ రెడ్డి అనుకున్నారట. అయితే ఆ ఆలోచన వర్కౌట్ కాలేదు. ఆ పాత్రను గౌరీనాథ శాస్త్రి పోషించారు. ఆయన హావభావాలు కూడా ఎస్వీఆర్ తరహాలోనే ఉంటాయి.

ఈ సినిమాలో ప్రత్యేకంగా హీరో అంటూ ఎవరూ లేరు. రేలంగి పోషించిన తిక్క శంకరయ్య పాత్ర అందరిని ఆకట్టుకుంటుంది. తాను పోషించిన అన్ని పాత్రలలో ఈ తిక్క శంకరయ్య పాత్ర ది బెస్ట్ అని అప్పట్లోనే రేలంగి  చెప్పారు. ఈ పాత్రను కూడా తర్వాత రోజుల్లో స్వల్ప మార్పులతో మన రచయితలు సినిమాలలో వాడుకున్నారు. ఇటీవల ఒక సినిమాలో వచ్చిన “దిగు దిగు నాగ” పాట కు మూలమైన పాట ఇందులో ఉంది. సినిమాలో అన్ని పాటలు బాగుంటాయి. కొసరాజు తనదైన శైలిలో రాసిన  ‘నందామయా గురుడ నందామయా’, ‘శివ శివ మూర్తివి గణనాథా’, ‘పట్నమెళ్ళగలవా’ అన్న మూడు పాటలు ప్రజాదరణ పొందాయి.

ఈ సినిమాలో ఉన్న నటులు చాలామందికి తెలియదు. రేలంగి ,శ్రీ రంజని .. చదలవాడ వంటి నటులు మాత్రమే కొంత మందికి తెల్సు. ఈ సినిమా 2వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఉత్తమ తెలుగు చలన చిత్రంగా రాష్ట్రపతి నుంచి రజత పతకం పొందింది. అప్పట్లో ఈ సినిమా పెద్ద సంచలనం. రాజకీయ నేతల వ్యవహార శైలిపై సూటిగా వదిలిన బాణం. సినిమా పబ్లిసిటీ కూడా వెరైటీ గా చేశారు.

పెద్ద గా పేరున్ననటులు లేకపోయినా హిట్ అయిన సినిమా ఇది. కేవలం కథా బలంతో కేవీ రెడ్డి హిట్ కొట్టారు. ఇక ఈ సినిమా తీస్తున్నప్పుడు కేవీ రెడ్డి కి విజయా నాగిరెడ్డి కి మనస్పర్థలు ఏర్పడ్డాయి. మధ్య వర్తుల జోక్యంతో అవి తొలగి పోయాయని అంటారు. ఆ తరువాత  కొన్నాళ్ళకు ‘మాయాబజార్’ వారి సారధ్యంలో వచ్చింది. యూట్యూబ్ లో ఈ సినిమా ఉంది. ప్రింట్ కూడా బాగుంది. ఆసక్తి ఉన్నవాళ్లు చూడవచ్చు. 

——-KNM

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!