హుజురాబాద్ ఎన్నికల రాజకీయాలు రసవత్తరం గా మారబోతున్నాయి. త్వరలో ఇక్కడ జరగనున్న ఉపఎన్నిక పైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది. తెలంగాణా జన సమితి అధ్యక్షుడు కోదండరామ్ కాంగ్రెస్ పార్టీ మద్దతుతో బరిలోకి దిగుతున్నారు. తెరవెనుక ఈ మేరకు మంతనాలు జరుగుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఈ సారి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. తెరాస అభ్యర్థి ఎవరనేది ఇంకా ఖరారు కాలేదు.
ఇటీవలే పార్టీ లో చేరిన మాజీ తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు రమణ ను రంగంలోకి దించాలని సీఎం కేసీఆర్ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే ఎన్నికకు ముందు ఆయనను పార్టీ లోకి తీసుకొచ్చారని చెబుతున్నారు.రమణ కూడా బీసీ కావడంతో బీసీ పై బీసీ ని పోటీ లోకి దించుతారనే అంటున్నారు. రమణ గెలిస్తే ఎమ్మెల్యే లేదంటే రాబోయే కాలంలో ఎమ్మెల్సీ పదవి ఇస్తారని కూడా పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
ఇదిలా ఉంటే కాంగ్రెస్ తొలుత పొన్నం ప్రభాకర్ ను పోటీకి నిలపాలని భావించింది. అయితే పొన్నం కంటే కోదండరామ్ అయితే బాగుంటుందని రేవంత్ రెడ్డి ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. అటు టీజేఎస్ ఇటు కాంగ్రెస్ పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా కోదండరాం బరిలోకి దిగితే… తెలంగాణ ఉద్యమ నేతగా బీజేపీ, తెరాస అభ్యర్థుల ను ధీటుగా ఎదుర్కొంటారని భావిస్తున్నారు. అసలు ఈ ఆలోచన కొండా విశ్వేశ్వరరెడ్డి దని అంటున్నారు. ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు కోదండరాం ఓకే అన్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర కాంగ్రెస్ కి అభ్యంతరం లేదు కాబట్టి అధిష్టానం అనుమతి కోసం ఎదురు చూస్తున్నారు. కొత్తగా పీసీసీ పగ్గాలు చేపట్టిన రేవంత్ కి ఈ ఎన్నిక ప్రతిష్టాత్మకం కాబట్టి ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఎలాగైనా హుజురాబాద్ ను ‘చే’జిక్కించుకోవాలని ఎత్తుగడలు వేస్తున్నారు.
కోదండరాం సొంత ఊరు ఈ ప్రాంతం లోని వీణవంక మండలం ఎగురపల్లి. కోదండరాం తండ్రి ఇక్కడ నుంచి మంచిర్యాలకు వలస పోయారు. ఇక్కడ వారి బంధువులు కూడా ఉన్నారు. ఆ ప్రాంతం వారితో కోదండరాం కు పరిచయాలున్నాయి.
హుజారాబాద్ లో కాంగ్రెస్ మరీ అంత బలహీనంగా ఏమి లేదు. 2014లో కాంగ్రెస్ అభ్యర్థి సుదర్శన్ రెడ్డికి 38 వేల ఓట్లు వచ్చాయి. 2018 లో కౌశిక్ రెడ్డి పోటీ చేసినపుడు 61,121 ఓట్లు వచ్చేయి. అప్పట్లో కూటమి అభ్యర్థిగా అతగాడికి టీడీపీ ఓట్లు కూడా పడ్డాయి. 2014 లో ఈటల మెజారిటీ 57 వేలు కాగా దాన్ని 2018 నాటికి 47 వేలకు తగ్గించారు. మంచి అభ్యర్థి అయితే గెలిచే ఛాన్స్ కూడా ఉంటుందని కాంగ్రెస్ నేతల అంచనా.
ఈటల బరిలోకి దిగినా బీజేపీ కి అంత బలం ఇక్కడ లేదు. ఈటల సొంత బలం తోనే గెలవాలి. రమణ బరిలోకి దిగితే బీసీల ఓట్లు చీలే అవకాశం ఉంది. పైగా అధికార పార్టీ కాబట్టి అన్ని హంగులు సమకూరుతాయి. మొత్తం మీద త్రిముఖ పోటీ హోరాహోరీగానే జరుగనున్నది.
———–KNM