ఎపిస్టీన్ ఫైల్స్ కేసులో కీలక పాత్రధారి ఈమేనా ?

Sharing is Caring...

Key player in sex trafficking…………….

ఎపిస్టీన్ ఫైల్స్ కేసులో నిందితురాలు, జెఫ్రీ ఎపిస్టీన్ సహచరురాలు గిస్లేన్ మాక్స్‌వెల్ ప్రస్తుతం అమెరికాలోని ఫెడరల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు.ఎపిస్టీన్ ఫైల్స్ కేసు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఈ కేసుకి సంబంధించి కీలకమైన అంశాలు అన్నీ బయటపడుతున్నాయి.   

గిస్లేన్ మాక్స్‌వెల్ ఈ కేసులో కీలక పాత్రధారి.ఎందరో అమ్మాయిలను మాయ మాటలతో నమ్మించి’ లిటిల్ సెయింట్ జేమ్స్’ (Little St. James)  దీవికి తరలించింది. అక్కడ వారిని ఖరీదైన మనుష్యుల కామ దాహం తీర్చడానికి వినియోగించింది. జెఫ్రీ ఎపిస్టీన్ తో కలసి ఆమె ఈ నేరాలకు పాల్పడింది.

బాధితుల ఫిర్యాదుల మేరకు 2005 నుండే ఫ్లోరిడాలోని పామ్ బీచ్ పోలీసులు ఈ కేసు దర్యాప్తు ప్రారంభించారు. 2008లో ఒక రాజీ ఒప్పందం (Plea Deal) ద్వారా ఎపిస్టీన్ తప్పించుకున్నప్పటికీ, బాధితులు వెనక్కి తగ్గలేదు.

2018లో మయామి హెరాల్డ్ (Miami Herald) పత్రిక “Perversion of Justice” పేరుతో చేసిన ఇన్వెస్టిగేటివ్ రిపోర్టింగ్ ఈ కేసును మళ్లీ తెరపైకి తెచ్చింది. సుమారు 80 మందికి పైగా మహిళలు తమకు జరిగిన అన్యాయం గురించి గళమెత్తారు.

బాధితులైన వర్జీనియా గిఫ్రే వంటి వారు అందించిన సాక్ష్యాలు, FBI జరిపిన సోదాల్లో లభించిన కీలక పత్రాలు ఎపిస్టీన్ , గిస్లేన్ మాక్స్‌వెల్‌లను అరెస్ట్ చేయడానికి బలమైన ఆధారాలుగా మారాయి.ఎపిస్టీన్ మరణించిన దాదాపు ఏడాది తర్వాత, జూలై 2, 2020న ఈమెను అరెస్ట్ చేశారు. న్యూ హాంప్‌షైర్‌లోని బ్రాడ్‌ఫోర్డ్‌లో ఒక భవనంలో ఆమె దాక్కుని ఉండగా FBI అధికారులు కనిపెట్టారు.

ఆమె తన ఫోన్ నుండి తన తరపు న్యాయవాదికి, సోదరికి, భర్తకు చేసిన కాల్స్ ఆధారంగా GPS డేటాను ట్రాక్ చేసి ఆమె ఉన్న చోటును గుర్తించారు.అరెస్ట్ సమయంలో ఆమె అధికారుల నుండి తప్పించుకోవడానికి లోపలి గదిలోకి పారిపోవడానికి ప్రయత్నించారు. మైనర్ల అక్రమ రవాణాకు సంబంధించిన కేసుల్లో దోషిగా తేలిన ఆమెకు 20 ఏళ్ల జైలు శిక్ష పడింది.

1990వ దశకం ప్రారంభంలో గిస్లేన్ న్యూయార్క్ వెళ్ళినప్పుడు జెఫ్రీ ఎపిస్టీన్‌తో పరిచయం ఏర్పడింది. మొదట్లో వీరి మధ్య ప్రేమాయణం కూడా సాగింది.తరువాత ఆమె అతనికి ప్రధాన సహచరురాలిగా మారింది. ఎపిస్టీన్ కోసం బాలికలను , తక్కువ వయస్సు గల యువతులను ప్రలోభపెట్టి తీసుకు వచ్చి, వారిని వ్యభిచార కూపంలోకి నెట్టేది.

గిస్లేన్ మాక్స్‌వెల్ జెఫ్రీ ఎపిస్టీన్‌తో సంబంధం ద్వారా భారీగా ఆర్థిక లబ్ది పొందింది. ఈ విషయాలన్నీ దర్యాప్తులో వెలుగు చూశాయి. 1999 – 2007 మధ్య కాలంలో ఎపిస్టీన్ ఖాతాల నుండి మాక్స్‌వెల్ బ్యాంక్ ఖాతాలకు సుమారు $30.7 మిలియన్లు (సుమారు ₹250 కోట్లు) బదిలీ అయినట్లు కోర్టు రికార్డులు వెల్లడించాయి.

తన తండ్రి మరణం తర్వాత ఆర్థికంగా దెబ్బతిన్నమాక్స్‌వెల్, ఎపిస్టీన్ సహాయంతో మళ్లీ అత్యంత విలాసవంతమైన జీవితాన్ని గడిపింది. ఎపిస్టీన్‌కు చెందిన ప్రైవేట్ జెట్‌లు, విలాసవంతమైన భవనాలు,ద్వీపాలలో ఆమెకు  ప్రవేశం ఉండేది.

న్యూయార్క్‌లో ఆమె నివసించిన ఒక ఖరీదైన మేన్షన్‌ను ఎపిస్టీనే కొనిచ్చినట్లు బాధితులు సాక్ష్యం ఇచ్చారు. తరువాత ఆ ఇంటిని ఆమె $15 మిలియన్లకు విక్రయించింది. ఎపిస్టీన్ దీవిని నిర్వహించినందుకు ఆమెకు ఏడాదికి $250,000 వరకు జీతం అందేది. అంతేకాకుండా, $60,000 విలువైన నెక్లెస్ వంటి ఖరీదైన బహుమతులను పొందారు.

ఎపిస్టీన్ తన వీలునామాలో మాక్స్‌వెల్ కోసం $10 మిలియన్లను కేటాయించినట్లు ఇటీవల బయటపడిన పత్రాల ద్వారా తెలిసింది.మొత్తానికి, ఎపిస్టీన్ అరాచకాలకు సహకరించి  తద్వారా ఆమె తన విలాసవంతమైన జీవనానికి అవసరమైన సొమ్మును సంపాదించింది.

పక్కా సాక్ష్యాలు ఉన్నప్పటికీ గిస్లేన్ మాక్స్‌వెల్ తాను నేరం చేసినట్లు అంగీకరించలేదు.కోర్టు విచారణ సమయంలో తనపై వచ్చిన లైంగిక అక్రమ రవాణా (sex trafficking) ఆరోపణలను ఆమె తోసిపుచ్చారు. తాను నిర్దోషినని వాదించారు.జ్యూరీ తనను దోషిగా నిర్ధారించి 20 ఏళ్ల శిక్ష వేసినప్పటికీ, ఆమె ఆ తీర్పును సవాలు చేస్తూ పై కోర్టులలో అప్పీల్ చేస్తూనే ఉన్నారు.

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!