బాలీవుడ్ నటి కంగనా వ్యవహారంలో శివసేన రాంగ్ స్టెప్ వేసింది . ఫలితంగా ఇపుడు రాజకీయ వర్గాల్లో కంగనా హాట్ టాపిక్ గా మారింది. త్వరలో ఆమె బీజేపీ లో చేరవచ్చనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. కంగనా నేరుగా మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే ను టార్గెట్ చేసి మాట్లాడటం .. ఆమెకు వై సెక్యూరిటీ కల్పించడం వంటి పరిణామాలు ఈ ఊహాగానాలకు ఊతమిస్తున్నాయి.
ఇక కంగనా భవనాన్ని కూల్చివేసేందుకు మునిసిపల్ కార్పొరేషన్ అత్యుత్సాహం చూపి చేతులు కాల్చుకుంది. గతంలో షారుఖ్ ఖాన్ , కపిల్ శర్మ తదితర నటుల ఇంటి విషయాల్లో బొంబాయి మునిసిపల్ కార్పొరేషన్ కొంత ఉదారత చూపింది. తగు సమయం ఇచ్చింది. కానీ కంగనా కార్యాలయం విషయంలో మాత్రం శరవేగంతో కూల్చివేతలకు దిగింది. దీన్ని బట్టే కార్పొరేషన్ అధికారులపై రాజకీయ ఒత్తిడి ఉందని తెల్సిపోతోంది.
హైకోర్టు జోక్యం చేసుకుని కంగనా భవన నిర్మాణం చట్ట విరుద్ధమో కాదో తర్వాత తేల్చుకోవచ్చని , ముందు కూల్చివేత వెంటనే ఆపివేయాలని ఆదేశించింది. ఈ వ్యవహారంలో తమకేమి సంబంధం లేదని శివసేన చెబుతున్నప్పటికీ తెర వెనుక ఆ పార్టీ నేతలే ఉన్నారనేది బహిరంగ రహస్యమే.
ఇదే విషయంలో ఎన్సీపీ అగ్రనేత శరద్ పవర్ కంగనా పట్ల దూకుడు వద్దని .. తొందరపాటు నిర్ణయాలు తగవని హెచ్చరించినట్టు చెబుతున్నారు. కొద్దిరోజులుగా కంగనా పై విమర్శలకు దిగి ఆమె కు అనవసర మైన పబ్లిసిటీ ఇచ్చారని పవార్ సీఎం ఉద్ధవ్ థాక్రే కి స్పష్టంగా చెప్పారని అంటున్నారు. కానీ థాక్రే ఆమాటలను చెవిన పెట్టలేదని … ఈ క్రమంలోనే పవార్ థాక్రే పట్ల అసంతృప్తిగా ఉన్నారనే కథనాలు ప్రచారంలోకి వస్తున్నాయి.
అదలా ఉంటే కంగనా ” ఈ రోజు నా ఇల్లు కూలింది . రేపు ఉద్దవ్ థాక్రే గర్వం కుప్ప కూలుతుంది” అంటూ ట్విట్టర్ లోపెట్టిన వీడియో సంచలనం సృష్టించింది. కంగనా మాటల్లో చాలా అర్ధాలు ఉన్నాయి . కర్రు కాల్చి వాత పెట్టినట్టుగా కంగనా మాట్లాడింది. అనవసరంగా కోరి కొరివితో తలగోక్కున్నట్టు అయింది. పైగా కోర్టు జోక్యం చేసుకోవడంతో శివ నేతలు మౌనంగా ఉండిపోయారు.
మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ సీఎం ఉద్ధవ్ థాక్రే సలహాదారుడికి ఫోన్ చేసి కంగనా వ్యవహారం .. కార్యాలయం కూల్చివేతపై ఆరా తీసినట్టు ప్రచారం జరుగుతోంది. ఇక కంగనా తీరు చూస్తుంటే మహారాష్ట్ర సర్కార్ ను వ్యతిరేకిస్తూ గట్టిగా నిలబడి పోరాడుతూ బీజేపీ కి ఒక ఆయుధంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. థాక్రే ను సవాల్ చేస్తున్న తీరును గమనిస్తే కంగనా వెనుక బీజేపీ ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ విషయమై పలు కథనాలు ప్రచారంలో ఉన్నాయి.
కంగనాను రాజ్యసభకు ఎంపిక చేస్తారని కూడా అంటున్నారు. మంచి నాయకుల కోసం అన్వేషిస్తోన్న బీజేపీ కి కంగనా ప్లస్ కావచ్చు.కాగా నిన్న కంగనా ఇంటికి కేంద్రమంత్రి రాందాస్ అథవాలే వెళ్లి కలవడం కూడా ప్రాధాన్యతను సంతరించుకుంది. మంత్రి మీడియాతో మాట్లాడుతూ సినిమాల్లో కొనసాగినంతకాలం రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదని కంగనా చెప్పినట్టు పేర్కొన్నారు. ఈ మాటలను బట్టి చర్చలు జరుగుతున్నాయని భావించాలి. రాజకీయాలకు కంగనా కుటుంబం కొత్తేమీ కాదు ఆమె తాత ఐ ఏ ఎస్ అధికారిగా పని చేశారు. కంగనా ముత్తాత సంజూసింగ్ రనౌత్ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా చేశారు. హిమాచల్ ప్రదేశ్ లోని బామ్లా నియోజకవర్గం నుండి 1951 లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి ఆయన గెలిచారు.
ఇక కంగన రనౌత్ ముంబైని పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీరుతో పోల్చినందుకు ఆమెపై శాసన మండలిలో సభా హక్కుల తీర్మానం ప్రవేశపెట్టారు. దీన్ని కూడా బెదిరింపు చర్య గా భావించవచ్చు. ఈ తీర్మానం ఆసరాగా కంగనా సభకు వచ్చి క్షమాపణ కోరమని మండలి చైర్మన్ ఆదేశాలు జారీ చేస్తే చేయవచ్చు. అయితే ఇందుకు కాంగ్రెస్ , ఎన్సీపీ లు సుముఖత చూపక పోవచ్చు. ఇప్పటికే ఆపార్టీలు కంగనా కు అంత ప్రాధాన్యమివ్వాల్సిన పనిలేదని అభిప్రాయపడుతున్నాయి. సొంతంగా బలం లేనందున థాక్రే ఏమీ చేయలేరు.
ఇక డ్రగ్స్ విషయం లో విచారణకు రంగం సిద్ధం అవుతోంది. కంగనా కూడా దీనికి సై అంది. గతంలో కంగనా తనను మాదకద్రవ్యాలు తీసుకోవాలని బలవంతం చేసినట్టు నటుడు అధ్యాయన్ సుమన్ ఆరోపించారు. ఇపుడు అవి తెరపైకి వచ్చాయి. ఆ విచారణ … పరీక్షలు కథను ఏ మలుపు తిప్పుతాయో చూడాలి. మొత్తం మీద కాంగ్రెస్, ఎన్సీపీ మద్దతుతో సర్కార్ ఏర్పాటు చేసినప్పటినుంచి బీజేపీ శివసేనల మధ్య ఈ ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తోంది. మధ్యలో కంగనా వచ్చి చేరింది. ఈ పోరులో శివసేన ను తక్కువగా అంచనావేయడానికి లేదు . పటిష్టమైన కార్యకర్తల బలం ఉన్న పార్టీ అది. అందుకే బీజేపీ అదను కోసం చూస్తోంది.
She is contravertial actress, came into limelight with comments on Hruthik Roshan in the past. No such damage she can do on Shivasena which has very strong roots.