అదేంటి స్వామి .. అలా అనేసారు ?

Sharing is Caring...

చినజీయర్ స్వామి వన దేవతలపై వ్యాఖ్యలు చేసి వివాదంలో ఇరుక్కున్నారు. ఎవరో అదను చూసి ఈ వీడియోను బయటికి లాగి ప్రచారంలోకి తెచ్చారు. దీంతో ‘వనదేవతలు సమ్మక్క, సారక్కలపై చిన జీయర్ చేసిన వ్యాఖ్యలతో ఉన్న ఆ వీడియో ఒక్కసారిగా వైరల్ అయింది. ‘వాళ్లేం దేవతలా..? బ్రహ్మలోకం నుంచి దిగివచ్చినవారా ? వాళ్ళ చరిత్ర..ఏమిటి ?

ఏదో ఒక అడవి దేవత. గ్రామదేవత. అక్కడుండే వాళ్లు సరే. చదువుకున్నవాళ్లు, పెద్ద పెద్ద వ్యాపారస్తులు. ఆ పేరిట బ్యాంకులే పెట్టేశారు. ఇప్పుడు అది వ్యాపారమైపోయింది . కొంతమంది కావాలనే దీన్నిగురించి ప్రచారం చేస్తున్నారు. ‘ అంటూ ఆ వీడియోలో చినజీయర్ స్వామి వన దేవతలను  కించ పరిచేలా మాట్లాడారు.

వాస్తవానికి చినజీయర్ స్వామి మాట్లాడిన ఆవీడియో ఇప్పటిది కాదు. కొన్నేళ్ల క్రితం ఓ ఎంటర్‌టైన్‌మెంట్ చానల్‌లో ఆయన ఇచ్చిన ప్రసంగాల వీడియో అది. అప్పట్లో రోజువారీగా ఆయన ప్రవచనాలు ఆ ఛానల్ లో ప్రసారమయ్యేవి. అప్పట్లో దీని గురించి ఎవరూ పట్టించుకోలేదు. ఎలాంటి వివాదం కాలేదు. ఇప్పుడు అకస్మాత్తుగా ఆ వీడియో వైరల్ కావడంతో చినజీయర్‌పై సమ్మక్క-సారలమ్మ భక్తులు విమర్శలు గుప్పిస్తున్నారు.

ఆంధ్రా కి చెందిన చినజీయర్ తెలంగాణ ఆత్మగౌరవ పోరాట ప్రతీకలైన సమ్మక్క సారలమ్మల పై  అహంకార పూరిత వ్యాఖ్యలు చేశారని  ఎమ్మెల్యే సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు “మా తల్లులది వ్యాపారమా? మా దేవతల దర్శనానికి ఒక్క రూపాయి కూడా టికెట్ లేదు. కానీ.. మీరు పెట్టిన 120 కిలోల బంగారు సమతా మూర్తి విగ్రహం చూసేందుకు రూ.150 ధర పెట్టారు. ఎవరిది వ్యాపారం ? అంటూ విమర్శలు చేశారు.

లక్ష రూపాయలు తీసుకోకుండా పేదవారి ఇంటికి తమరు ఎపుడైనా  వెళ్ళారా అని చినజీయర్‌ను సీతక్క ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం వెంటనే రియల్ ఎస్టేట్ స్వామి చిన జీయర్ చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీపీఐ నేత నారాయణ మాట్లాడుతూ.. సమ్మక్క-సారక్క  ఉత్సవాలను అవమానపరిచే విధంగా చినజీయర్ మాట్లాడటం  శోచనీయం .. ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

‘తెలంగాణ ప్రాంతంలో సమ్మక్క సారక్కలను ఎంతో మంది పవిత్రంగా కొలుస్తారు.. మేడారం జాతరకు కోట్లాది మంది వస్తారు.. అలాంటి దేవతలను చినజీయర్ లాంటి మేధావులు అవమానకరంగా మాట్లాడటం ఆయన స్థాయి కి తగదు. ఇప్పుడు మీ చుట్టూ రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు తిరుగుతున్నారు.. మీరా ఆ దేవతల గురించి మాట్లాడేది.. ఇప్పటికైనా ఆ అహంకార పూరిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి..’ అని చినజీయర్‌ను నారాయణ డిమాండ్ చేశారు.

ఇక తెలంగాణ ఆదివాసీ గిరిజన నాయకులైతే భగ్గుమంటున్నారు. ఆసియా ఖండంలొనే అత్యంత పెద్ద ఆదివాసీ గిరిజన జాతర మేడారం సమ్మక్క సారక్క జాతర,.. దేశంలోని 4 రాష్ట్రాల నుండి కోటి మంది భక్తులు ఈ జాతరకు వస్తారు. అలాంటి గొప్ప దేవతలను కించపరిచేలా చిన జీయర్ స్వామి మాట్లాడటం ఏమిటని మండి పడుతున్నారు. అసలే ప్రభుత్వంతో చెడి స్వామి ఇబ్బందులో ఉన్నారు. ఈ సమయంలో వీడియో బయటకు రావడంతో చిన జీయర్ ఇరుకున పడ్డారు.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!