Super hit movie in telugu, hindi languages……………………..
దక్షిణాది నుంచి బాలీవుడ్ కు వెళ్లిన నటి శ్రీదేవిని బిగ్ స్టార్ గా మార్చేసిన క్రెడిట్ హీరో కృష్ణ కే దక్కుతుంది. తమిళ్,తెలుగు భాషల్లో హిట్ అయిన “పదహారేళ్ళవయసు” ను “సోల్వా సావన్” పేరిట హిందీలో మళ్ళీ శ్రీదేవితో తీశారు.అక్కడ అది ఫ్లాప్ అయింది.
ఆ తర్వాత ఒకటి రెండు సినిమాలు చేసినా శ్రీదేవికి పెద్దగా పేరు రాలేదు. నిర్మాతలు ఎవరూ శ్రీదేవిని హీరోయిన్ గా తీసుకునేందుకు ముందుకు రాలేదు. ఆ సమయంలోనే హీరో కృష్ణ జయప్రద జంటగా నటించిన “ఊరికి మొనగాడు” సూపర్ డూపర్ హిట్ అయింది.
వెంటనే ఆ సినిమా ను కృష్ణ హిందీలో “హిమ్మత్ వాలా” పేరుతో తీస్తున్నట్టు ప్రకటించారు. హీరో గా జితేంద్ర, హీరోయిన్ గా శ్రీదేవి నటిస్తున్నారని కూడా చెప్పేసారు. తెలుగులో ‘ఊరికి మొనగాడు’ దర్శకుడు రాఘవేంద్రరావే హిందీ సినిమాను డైరెక్ట్ చేస్తారని చెప్పారు. అయితే హిందీ ఫిలిం పంపిణీదారులు చిన్న అభ్యంతరం వ్యక్తం చేశారు.
తెలుగు లో నటించిన హీరోయిన్ జయప్రదనే హిందీ లో పెట్టమని అడిగారు. అలాగే అప్పటికే హిందీ లో హిట్ సినిమాలు అందించిన బాపయ్యను డైరెక్టరుగా పెట్టమని సిఫారసు చేసారు. అంతకు ముందు కృష్ణ హిందీలో తీసిన సినిమాల్లో జయప్రద నటించారు. బాపయ్య డైరెక్ట్ చేశారు. బాపయ్య కు బాలీవుడ్ మార్కెట్లో మంచి డిమాండ్ కూడా ఉంది. కొత్త వాళ్లతో రిస్క్ ఎందుకని పంపిణీదారులు చెప్పారు.
అయితే కృష్ణ మాత్రం అందుకు అంగీకరించలేదు. రాఘవేంద్రరావు , శ్రీదేవితోనే చేస్తానని కృష్ణ గట్టిగా చెప్పారు. దాంతో మొత్తం బిజినెస్ లో పదిలక్షలు తగ్గించి డబ్బులు కట్టారు. తర్వాత “హిమ్మత్ వాలా” 1983లో విడుదలై అన్ని రికార్డులను బ్రేక్ చేసింది.50 వారాలు ఆడి చరిత్ర సృష్టించింది. అలా శ్రీదేవి బిగ్ స్టార్ గా మారిపోయింది.
ఇక వెనుదిరిగి చూడలేదు. డైరెక్టర్ రాఘవేంద్రరావుకు హిందీలో పెద్ద మార్కెట్ ఏర్పడింది. అప్పటిదాకా వెనుకబడిన జితేంద్ర కూడా ఈ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. తన అంచనా నిజమైందని ఒక సందర్భంగా కృష్ణ నే స్వయంగా ఈ విషయం చెప్పారు. శ్రీదేవి ఆ తర్వాత వరుసగా మవాలీ, తోఫా, మిస్టర్ ఇండియా, నగీనా వంటి సినిమాలతో టాప్ రేంజ్ కి ఎదిగిపోయింది.
ఇక తెలుగు ‘ఊరికి మొనగాడు ‘ సినిమా కృష్ణ ఇమేజ్ ను ఒక్కసారిగా పెంచేసింది. 1981 లో రిలీజ్ అయిన ఈ సినిమా కథ పాతదే అయినా కథనం ఆకర్షణీయంగా ఉంటుంది. అప్పట్లోనే 15 కోట్లు పైగా వసూలు చేసింది. ఏ . గోపాలకృష్ణ ఈ సినిమాను నిర్మించారు. ‘ఇదిగో తెల్లచీర’ పాట ఆ రోజుల్లో ఎక్కడకు వెళ్లినా వినిపించేది.
మాస్ మసాలా సాంగ్ గా రాఘవేంద్రరావు దీన్ని చిత్రీకరించారు.కృష్ణ అభిమానులు ఈ పాట కోసం సినిమాకు రిపీటెడ్ గా వెళ్లేవారు. ‘కదిలి రండి మనుషులైతే’ పాట కూడా బాగుంటుంది. వేటూరి వారు రాసిన పాటలకు చక్రవర్తి బాణీలు సమకూర్చారు. రచయిత సత్యానంద్ డైలాగులు ఆకట్టుకుంటాయి .యూట్యూబ్ లో ఈ సినిమా ఉంది అభిమానులు మరోమారు చూడవచ్చు. 43 ఏళ్ళు అవుతున్నా సినిమా పాతది అనిపించదు.
————- KN.MURTHY