ఈ నిఘానౌక తో ముప్పు తప్పదా ?

Sharing is Caring...

Spy Ship………………………………………………………

యువాన్‌ వాంగ్‌ 5 … చైనా తయారు చేసిన నిఘా నౌక ఇది . చైనాలోని జియాంగ్‌నాన్ షిప్‌యార్డ్‌లో దీన్ని నిర్మించారు. యువాన్ వాంగ్ 5 … 2007 నుంచి సేవలు అందిస్తోంది. దీన్ని చైనీయులు రీసెర్చ్ వెసెల్ అని పిలుస్తారు. ఇది గూఢచర్యం చేయగల సామర్థ్యం ఉన్న ట్రాకింగ్ షిప్.

ఈ షిప్ ఆన్బోర్డు లో  అత్యాధునిక ట్రాకింగ్ టెక్నాలజీని అమర్చారు. దీని పొడవు 222 మీటర్లు కాగా వెడల్పు  25.2 మీటర్లు. యువాన్ వాంగ్ 5  అంతరిక్షం.. ఉపగ్రహ ట్రాకింగ్‌ కూడా చేస్తుంది. యువాన్ వాంగ్ సిరీస్‌కు చెందిన మూడవ తరం స్పేస్-ట్రాకింగ్ షిప్ ఇది. 

దీన్ని పరిశోధన నౌక అని చైనా చెబుతోంది కానీ ఇది పరిశోధనలు, సర్వేలతో పాటు నిఘా పనులు కూడా చేస్తుంది. భారత్‌ మిలటరీ ప్రాంతాలన్నింటిపై నిఘా పెట్టే ఉంచే సామర్థ్యం ఈ స్పెషల్ షిప్ కి ఉంది. అత్యాధునిక టెక్నాలజీ తో చైనా దీన్ని రూపొందించింది. ఖండాంతర క్షిపణులు, ఉపగ్రహాలు, రాకెట్లను ట్రాక్‌ చేసే ఎలక్ట్రానిక్‌ వ్యవస్థను కలిగి ఉండటం  ఈ యువాన్ వాంగ్ ప్రత్యేకత.

ఇది ఎక్కడ నిలిస్తే అక్కడనుంచి  750 కి.మీ. దూరంలో ఉన్నవన్నీ దీని రాడార్‌ పరిధిలోకి ఆటోమాటిక్ గా వస్తాయి. శ్రీలంకలోని హంబన్‌తోట రేవులోకి ఈ నౌక ప్రవేశించింది. భారత్‌లోని తూర్పు కోస్తా రేవు పట్టణాల్లో జరిగే వ్యూహాత్మక కార్యకలాపాలన్నీ ఈ నౌక రాడార్‌ పరిధిలోకి వస్తాయి.

శ్రీలంక తీరంలో ఆ నౌక ఉన్నకాలంలో  భారత్‌ క్షిపణి పరీక్షలు నిర్వహిస్తే వాటి గురించి మొత్తం ఆ నౌక ద్వారా తెలుసుకోవచ్చు. శ్రీలంక రేవులో యువాన్‌ వాంగ్‌5 ఉన్నంతవరకు తమిళనాడులో ఉన్న 1,076 కి.మీ. తీర ప్రాంతంపై ఈ నౌక నిఘా ఉంచుతుంది. 

శ్రీహరికోటలోని ఇస్రో ఉపగ్రహ స్థావరం, కల్పక్కం అటామిక్ పవర్ ప్లాంట్ .. కూడంకుళం అణు విద్యుత్ ప్లాంట్, కల్పక్కంలోని అణుశక్తి ప్లాంట్, దక్షిణ భారత దేశంలోని ఆరు నౌకాదళ ఓడరేవులు, కొచ్చిలోని దక్షిణ నౌకాదళ కమాండ్‌  కార్య కలాపాలను  ఈ నౌక ఈజీగా గ్రహించేస్తుంది.

అందుకే భారత్‌లో ఆందోళన పెరుగుతోంది. ఇంధనం నింపుకోవడానికే హంబన్‌తోట లో ఆగినట్టు చెబుతున్నప్పటికీ చైనా మాటలు నమ్మలేమని భారత్ ప్రభుత్వం భావిస్తోంది.  జూలై 14న చైనా నుంచి బయల్దేరిన ఈ నౌక ఇప్పటివరకు ఏ రేవు పట్టణంలోనూ ఆగలేదని సమాచారం. ఈ క్రమంలో యువాన్ 5 ఇండియా మిలటరీ కార్యకలాపాలను పసిగట్టడం కోసమే వచ్చిందనే  అనుమానాలు వ్యక్త మౌతున్నాయి.

సముద్ర గర్భంలో సర్వేలు చేసే సామర్ధ్యం ఈ యువాన్ 5 కి ఉంది. తద్వారా  దాని పరిధిలో జలాంతర్గాములు ఎన్ని ఉన్నాయో పసికట్టే అవకాశాలున్నాయి.  2007 నుంచి యువాన్ 5  వివిధ మిషన్ల కోసం పనిచేసింది. ఇటీవల వెంటియన్ లాబొరేటరీ క్యాబిన్ మాడ్యూల్‌ను ప్రారంభించడం కోసం సముద్ర పర్యవేక్షణ మిషన్‌ను విజయవంతంగా పూర్తి చేసింది.

ఈ నౌక  5,80,000 నాటికల్ మైళ్లకు పైగా సురక్షితంగా ప్రయాణించింది. పసిఫిక్ మహాసముద్రంలో 2020లో లాంగ్ మార్చ్-5బి రాకెట్‌ను ప్రయోగించడానికి సముద్ర ట్రాకింగ్ కోసం  81 రోజులకు పైగా పనిచేసింది. అలాగే అనేక అంతర్జాతీయ ఓడరేవుల గుండా 20,000 నాటికల్ మైళ్లకు పైగా నావిగేట్ చేసింది.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!