పినరయి విజయం నల్లేరుపై నడకేనా ?

Sharing is Caring...

పినరయి విజయన్ సుదీర్ఘ  అనుభవం గల కమ్యూనిస్ట్ యోధుడు. ఈయన నాయకత్వం లోనే ఇపుడు కేరళ ప్రభుత్వం నడుస్తోంది. కన్నూర్ జిల్లాలోని పేద కుటుంబంలో విజయన్ జన్మించారు. పెరాలస్సెరీ ఉన్నత పాఠశాలలో విద్యాభ్యాసం పూర్తి చేశారు.1964వ సంవత్సరంలో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియాలో చేరక ముందే విద్యార్థి సంఘ నాయకునిగానే రాజకీయ ప్రస్థానాన్ని ఆరంభించారు. జిల్లా కమిటీ, జిల్లా సెక్రటేరియట్‌లలో సభ్యునిగా బాధ్యతలతో పాటు పార్టీలో పలు పదవులు చేపట్టారు.ఆ తర్వాత కన్నూర్ జిల్లా సెక్రటరీగా 1986లో ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1998లో కేరళ రాష్ట్ర సెక్రటరీగా పదోన్నతి పొందారు. ముఖ్యమంత్రి కాక ముందు విద్యుత్ శాఖ మంత్రితో పాటు సహకార మంత్రిత్వ శాఖ పోర్ట్ ఫోలియోలను నడిపించారు. ఇటీవల కాలంలో సీఎం గా ఆయన మంచిపేరు సంపాదించుకున్నారు.

కరోనా కట్టడి చేయడంలో విజయన్ సర్కార్ సమర్థవంతంగా పనిచేసిందని అభినందనలు అందుకున్నారు. అలాగే కష్టకాలంలోనూ ప్రజలు ఇబ్బందులు పడకుండా చూశారని, రేషన్‌ సరకుల పంపిణీ ప్రక్రియను సమర్ధవంతంగా నిర్వహించారని పేరు తెచ్చుకున్నారు. అయితే శబరిమల ఆలయంలోకి మహిళలను అనుమతించే విషయంలో భక్తులపై దాడి చేయడం, కేసులు పెట్టడం వంటివి కాస్త విజయన్ కు ఇబ్బందికరంగా మారాయి. కేరళ వ్యాప్తంగా శబరిమల ఆందోళనలకు సంబంధించి దాదాపు 2వేల కేసులు పెట్టారు. తాము అధికారంలోకి రాగానే ఆ కేసులను తొలగిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. దీంతో  విజయన్ సర్కార్‌ ఆ కేసులను తొలగించింది. ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో లెఫ్ట్‌ గెలుపు అధికార కూటమిలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఎన్నికలకు ముందు నుంచే కేరళలో అన్ని పార్టీలు వ్యూహాల్లో మునిగిపోయాయి. ప్రస్తుతం ఒకే ఒక్క రాష్ట్రానికి పరిమితమైన సీపీఎంకు కేరళ ఎన్నికలు ప్రతిష్టాత్మకం కానున్నాయి. ఇప్పటికే బెంగాల్‌, త్రిపురలో అధికారానికి దూరమై ప్రాభవం కోల్పోయిన ఆ పార్టీకి ఈ ఎన్నికలు సవాల్ అని చెప్పుకోవచ్చు. 

కేరళ లో మొత్తం 140 అసెంబ్లీ స్థానాలున్నాయి. కేరళ ప్రజలు ఎపుడూ విలక్షణ తీర్పు ఇస్తుంటారు. మధ్యలో రెండుసార్లు మినహా ప్రతిసారీ ఎల్డీఎఫ్ , యూడీఎఫ్ కూటమిల మధ్య అధికార మార్పిడి జరిగింది. ఇక 1977 నుంచి తీసుకుంటే ఓసారి యూడీఎఫ్ గెలిస్తే తర్వాత ఎల్డీఎఫ్ గెలిచేది. వరుసగా రెండుసార్లు ఎవ్వరికీ ఓటర్లు అధికారం కట్టబెట్టలేదు. గత ఎన్నికల్లో ఇక్కడ లెఫ్ట్‌ కూటమి ఘన విజయం సాధించింది. ఈసారి ఎలాగైనా గెలిచి ఆ సంప్రదాయాన్ని మార్చాలని  ఎల్డీఎఫ్ పట్టుదలతో కృషి చేస్తుంటే …ఎలాగైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూడీఎఫ్ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. రాహుల్ గాంధీ కూడా కేరళ నుంచి పార్లమెంట్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి ఆయనకు ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకమే. ఇప్పటివరకు వచ్చిన ప్రీపోల్ సర్వేలు ఎల్డీఎఫ్ వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారని చెబుతున్నాయి. 

2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూడీఎఫ్ 19స్థానాలు గెలుచుకోగా, లెఫ్ట్‌ కూటమికి కేవలం ఒక్క ఎంపీ సీటు మాత్రమే దక్కింది. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అదే తీరున ఫలితాలు వస్తాయని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. అయితే గ్రూప్ రాజకీయాలు ఎక్కువగా ఉండటంతో పార్టీ దూసుకుపోతుందా అనేది  సందేహమే.ఉమెన్‌చాందీ ఒక వర్గం అయితే రమేశ్‌ చెన్నితాల మరోవర్గం. ఈ క్రమంలో ముఖ్యమంత్రి అభ్యర్థి పేరు ప్రకటించకుండానే ఎన్నికలకు వెళ్లాలని కాంగ్రెస్ నిర్ణయించింది.
ఇక గత ఎన్నికల్లో బీజేపీ ఇక్కడ కేవలం ఒక్కసీటునే గెలుచుకుంది. 2026 నాటికి కేరళ లో అధికారం చేపట్టాలని బిజెపి భావిస్తోంది.

అందుకోసం బీజేపీ కనీసం ప్రతిపక్షంగా ఎదిగేందుకు ప్రయత్నాలు చేస్తోంది. గత కొన్నేళ్లుగా బిజెపి తమ ఓటు శాతంలో కొంత పెరుగుదలను సాధించింది. 2011 ఎన్నికల్లో బిజెపి కేవలం 6.03 శాతం ఓట్లు మాత్రమే సాధించగా, 2016 ఎన్నికలలో అది14.93 శాతానికి పెరిగింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో 13 శాతానికి తగ్గినప్పటికీ, 2020 లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో 15 శాతం ఓట్లు సాదించింది. శబరిమల ఆలయం ఉన్న పఠనమిట్ట జిల్లాలోని పండలం మునిసిపాలిటీని కూడా బీజేపీ గెలుచుకుంది. మొత్తం మీద బీజేపీ కాస్త బలం పుంజుకుంది. ప్రభుత్వ వ్యతిరేక పోరాటాలని నిర్వహించింది. ఓటు బ్యాంక్ మరింతగా పెంచుకునే దిశగా వ్యూహ రచన చేస్తోంది. 

————–K.N.MURTHY

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!