A rare event …………………………………….
కొన్నిసినిమాలు భారీ అంచనాలతో.. అట్ఠ హాసంగా ప్రారంభమవుతాయి. వి ఐ పీ లు ..వి వి ఐ పీలు ఇతర ప్రముఖులు కూడా హాజరవుతుంటారు. కానీ ఆ సినిమాలు అనూహ్యంగా మధ్యలోనే ఆగిపోతుంటాయి. అందుకు కారణాలు ఏవేవో ఉంటాయి. చాలామంది హీరోలకు ఇలాంటి అనుభవాలున్నాయి. సుప్రసిద్ధ హీరో కమల్ హాసన్ తీయాలనుకున్న ‘మరుదనాయగం’ సినిమా కూడా అలాగే ఆగిపోయింది.
1997 లో రెండవ ఎలిజబెత్ రాణి ఇండియా కు వచ్చారు. అక్టోబర్ 16 న ఎలిజబెత్ రాణి చెన్నై లోని MGR ఫిల్మ్ సిటీని సందర్శించారు.ఈ క్రమంలోనే ఎలిజబెత్ రాణి హీరో కమల్ హాసన్ నిర్మిస్తున్న ‘మరుదనాయగం’ సినిమా షూటింగ్ కి అతిథిగా హాజరయ్యారు. అక్కడ ఆమె కోసం ఆ సినిమాలోని ఒక యుద్ధ సన్నివేశాన్ని ప్రదర్శించారు.1. 5 కోట్ల బడ్జెట్‌తో ఆ యుద్ధ సన్నివేశాన్నిచిత్రీకరించారట.ఎలిజబెత్ రాణి మరుదనాయగం సినిమా సెట్స్‌లో 20 నిమిషాలు గడిపారు.
చిత్ర కథానాయకుడు కమల్ హాసన్ ‘మరుదనాయగం’ విశేషాలను ఆమెకు వివరించారు. అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి, కాంగ్రెస్ నాయకుడు మూపనార్, జర్నలిస్టు చో రామస్వామి, హీరో శివాజీ గణేశన్, బాలీవుడ్ నటుడు అమ్రిష్ పూరితో కలిసి రాణి ఎలిజబెత్ వేదికను పంచుకున్నారు.
భారత స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న వీర యోధుడు ‘మరుదనాయగం’ నిజ జీవిత కథ ఆధారంగా కమల్ హాసన్ ఈ చిత్రాన్ని ప్రారంభించారు. మరుదనాయగం అసలు పేరు ముహమ్మద్ యూసుఫ్ ఖాన్.1725లో తమిళనాడులోని రామనాథపురం జిల్లా, పన్నయ్యూరులో జన్మించారు. అతను ఆర్కాట్ దళాలలో యోధుడు.
తరువాత బ్రిటిష్ సైన్యంలో తూర్పు కమాండెంట్ గా పనిచేశాడు. బ్రిటీష్ దొరలు,ఆర్కాట్ నవాబు దక్షిణ తమిళనాడులోని పాలీగార్లను అణచివేయడానికి ‘మరుద నాయగం’ ను వాడుకున్నారు.తర్వాత రోజుల్లో బ్రిటిష్ దొరలతో,ఆర్కాట్ నవాబుతో విభేదాలు ఏర్పడ్డాయి..ఈ క్రమంలోనే 1764లో మరుదనాయగం ను మదురైలో ఉరితీశారు.
క్లుప్తంగా అది కథ.ఈ సినిమా నిర్మాణ వ్యయం అప్పట్లోనే 87 కోట్లు గా అంచనా వేశారు. తమిళ, ఫ్రెంచ్, ఆంగ్ల భాషల్లో ఈ సినిమాను విడుదల చేయాలని కమల్ భావించారు.ఈ ప్రాజెక్టు కి ఒక బ్రిటన్ ఇన్వెస్టర్ పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చారు.ఇంతవరకు బాగానే ఉంది. ఎలిజబెత్ రాణి రావడంతో ఈ చిత్రానికి పెద్ద ఎత్తున ప్రచారం లభించింది. ప్రపంచమంతా తెలిసిపోయింది. అదే ప్రచారం ఆ సినిమాకు మైనస్ అయింది.
అదెలాగంటే …
బ్రిటిష్ సామ్రాజ్యంపై తిరుగుబాటు చేసిన నాయకుడి సినిమా షూటింగ్ కి బ్రిటన్ రాణి ఎలా హాజరవుతారంటూ అప్పట్లో విమర్శలు వచ్చాయి. ఈ విమర్శలకు క్వీన్ ఎలిజబెత్ ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. ఆమె మౌనంగా ఉన్నారు. ఈ లోగా బ్రిటన్ ఇన్వెస్టర్ పై ఒత్తిళ్లు పెరగడంతో అతగాడు భయపడిపోయి చేతులెత్తేశాడు.దీంతో సినిమా నిర్మాణం అర్ధాంతరంగా ఆగిపోయింది.ఊహించని ఈ పరిణామానికి కమల్ షాక్ తిన్నాడు.
కమల్ కన్విన్స్ చేయాలని ప్రయత్నించినా … బ్రిటన్ ఇన్వెస్టర్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ లేదు. అప్పటికి కమలహాసన్ రైజింగ్ పొజిషన్ లో ఉన్నప్పటికీ పెద్ద నిర్మాతలు,పెట్టుబడి దారులు ఈ చిత్రనిర్మాణంలో భాగస్వాములు కావడానికి ఆసక్తి చూపలేదు. అంతగా పాపులర్ కాని ‘మరుదనాయగం’ కథతో సినిమా తీస్తే ..వర్కౌట్ కాదనే సందేహంతో ఎవరూ సాహసించలేదని కూడా అంటారు.
అప్పటికే కమల్ నాలుగైదు కోట్లు ఖర్చుపెట్టారట. బ్రిటన్ ఫైనాన్సియర్ ‘నో’ అన్న తర్వాత కమలహాసన్ కొన్ని ప్రయత్నాలు చేసినా అవేవి ఫలించలేదు. దీంతో 27 ఏళ్ళ నుంచి చిత్ర నిర్మాణం పెండింగ్ పడిపోయింది. తీసినంతవరకు సినిమాను మంచి సాంకేతిక విలువలతోనే తీశారు.
ఇపుడు ఎవరైనా పెట్టుబడిదారులు ముందుకొచ్చినా కమల్ వయసు కూడా పెరిగి పోవడంతో ఆ పాత్రకు ఆయన ఫిట్ కారు. ఆవిషయం ఆయనే స్వయం గా ఒక సందర్భంలో చెప్పారు. ఆ విధంగా ఆ సినిమా పర్మినెంట్ గా ఆగిపోయింది. కమల్ డ్రీం ప్రాజెక్టు గానే మిగిలి పోయింది. అదండీ ‘మరుదనాయగం’ సినిమా కథ.
pl.watch ‘మరుదనాయగం’ song