నృత్య తారలైన జ్యోతిలక్ష్మి,జయమాలిని డాన్సులను సినిమాల్లో నిషేదించాలని ఇందిరా కాంగ్రెస్ సభ్యురాలు సంతోషమ్మ విధానసభలో డిమాండ్ చేశారు. సినిమాలలో డాన్సులు సాంప్రదాయకం గా సంసారపక్షం గా ఉండాలని సూచన చేశారు. నృత్యతారల డాన్సులపై ఆలా విధాన మండలి లో సభ్యులు విమర్శలు చేయడం ఇదే మొదటిసారి. అపుడు సినిమాటోగ్రఫీ మంత్రి గా చంద్రబాబు ఉన్నారు.
చంద్రబాబు మామగారు ఎన్టీఆర్ కూడా అలాంటి తారలతో గంతులు వేస్తున్నారని సంతోషమ్మ వ్యాఖ్యానించారు.ఈ వ్యాఖ్యలతో చంద్రబాబు ఇరుకున పడ్డారు. సభ్యురాలికి చంద్రబాబు సమాధానం చెబుతూ డాన్సులు కట్ చేయడానికి సెన్సార్ వారు ఉన్నారని అన్నారు. మరోసభ్యుడు శివరామరాజు మాట్లాడుతూ జ్యోతిలక్ష్మి జయమాలిని డాన్సులు రద్దు చేయమనడం సరికాదని.. వారి వృత్తిని దెబ్బ తీయడం సమంజసం కాదని మంచి దుస్తులు వేసుకోమని చెబితే సరిపోతుందని సూచించారు.
ఇంకో సభ్యుడు మాధవరావు మాట్లాడుతూ అండమాన్ ప్రాంతంలో నేటికి మనుష్యులు బట్టలు లేకుండా తిరుగుతున్నారని .. అక్కడ దుస్తులు వేసుకుంటే తప్పు … ఇక్కడ వేస్కోకపోతే తప్పు ..ఈ విషయంలో దేశం మీద ఒకే చట్టం ఉండాలని సూచించారు.
నగ్న ప్రదర్శనలు ఉన్న సినిమాలను రద్దు చేయాలనీ మార్పు బాలకృష్ణమ్మ డిమాండ్ చేశారు. హిందూ మహిళల పరువు తీసే పోస్టర్లను నిషేదించాలని … అందుకోసం ఒక శాసనం తీసుకురావాలని శ్రీమతి కుముదిని నాయక్ కోరారు. గుంటూరు లో నగ్న పోస్టర్లకు వ్యతిరేకంగా మహిళలు నిరసన ప్రదర్శన చేపట్టారని .. అశ్లీల పోస్టర్లను చించి వేశారని జూపూడి సభకు తెలియ జేశారు.
మొత్తం మీద ఆ ఇద్దరి డాన్సులపై సభలో చిన్నపాటి చర్చ జరిగింది. సభ్యుల సూచనలకు మంత్రి చంద్రబాబు సమాధానం చెప్పారు. సెన్సార్ చేసిన దృశ్యాలను పోస్టర్లుగా వేస్తున్నారని .. వారి పై చర్యలు తీసుకుంటాం. పోస్టర్ల విషయంలో కేసులు నమోదు అయ్యాయని చంద్రబాబు సభకు తెలియ జేశారు.
1981 లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఈ చర్చ జరిగింది.సభ సమయం వృధా అయింది కానీ సినిమాల్లో డాన్సుల జోరు ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికి అదే పరిస్థితి. అప్పటికంటే ఘోరంగా అశ్లీలం వెండితెరపై వెలిగిపోతోంది.
——–KNM