Sai Vamshi …………
Pakistan is nurturing terrorism …………..
పాక్ స్వయంకృతాపరాధాలే దానికి వినాశనాన్ని తెచ్చిపెడతాయి. అంతర్జాతీయ స్థాయిలో అవమానాల పాలవ్వడం తప్ప పాక్ ప్రగతి పథంలో సాధించింది చాలా తక్కువ. అయినా కూడా మేకపోతు గాంభీర్యంతో ప్రగల్భాలు పలుకుతూనే ఉంది. సొంత దేశాన్ని సరిగ్గా చూసుకోలేక, పక్క దేశాన్ని ఏదో చేసేయాలనుకుంటూ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది.
1990లో కశ్మీర్‌లో ఉగ్రవాదుల సంఖ్య 2 వేల నుంచి 5 వేల దాకా ఉండేది. అది ఉగ్రవాదం చాలా ఉధృతంగా నడిచిన కాలం. 2001 తర్వాత పరిస్థితి అదుపులోకి వచ్చింది. భారత్ సరిహద్దుల్లో కంచె ఏర్పాటు చేయడం, పటిష్ఠమైన సెన్సర్ వ్యవస్థ రావడంతో పాక్ మిలిటెంట్లు ఇటువైపు రావడం కష్టంగా మారింది. అక్కడే పాక్ దుందుడుకుగా వ్యవహరించింది.
కశ్మీర్ రాష్ట్రమనే నినాదాన్ని గట్టిగా ఎత్తుకోవడం ద్వారా, 250-300 మంది ఉగ్రవాదులు అందుబాటులో ఉండేలా చూసుకుంది. తాము చెప్పినప్పుడు, లేదా తమకు అవసరం అనిపించినప్పుడు వారు కశ్మీర్‌లో కల్లోలం సృష్టించేందుకు ప్రణాళికలు రూపొందించారు.
మనదేశంలో ఒక్కో ఎంబీబీఎస్ సీటు కోసం ప్రభుత్వం రూ.25 లక్షలు ఖర్చుపెడుతోంది. ప్రాణాలు నిలిపే వైద్యులను ప్రపంచానికి అందించాలని చూస్తోంది. పాకిస్థాన్ బుద్ధి మరోలా ఉంది. ఒక మిలిటెంట్‌పై రూ.8.46 కోట్లు ఖర్చుపెడుతుంది. అంటే 30 మంది వైద్యులు తయారయ్యే ఖర్చును ఒక్క ఉగ్రవాదిని తయారు చేసేందుకు వాడుతోంది.
దీన్నిబట్టే పాక్ నీచబుద్ధి అర్థమైపోతోంది. లష్కరే తయ్యిబా లాంటి ఉగ్రవాద సంస్థలకు ఆయుధాల స్మగ్లింగ్, చొరబాట్ల కోసం రూ.కోట్లలో చెల్లిస్తోంది. కశ్మీర్‌లో రాళ్లదాడులు, ఆందోళనలు, ధర్నాలు, బంద్‌ల నిర్వహణకూ భారీగా ఖర్చు చేస్తున్నట్లు సమాచారం.
రాళ్లు విసిరితే మనిషికి రూ.300-500 దాకా, దాడికి నాయకత్వం వహించినవారికి రూ.10 వేల దాకా చెల్లిస్తారని తెలుస్తోంది. ఇవన్నీ సౌత్ ఏషియన్ టెర్రరిజం పోర్టల్(ఎస్‌ఏపీటీ) ఆధారంగా తేల్చిన లెక్కలు.కశ్మీర్‌లో ఉగ్రవాద ఆర్థిక మూలాలపై డాక్టర్ అభినవ్ పాండ్యా అధ్యయనం చేశారు. ఆయన అంచనా ప్రకారం ఒక ఉగ్రవాదిని తయారు చేయటానికి పాకిస్థాన్ రూ.లక్షల్లో ఖర్చు చేస్తోంది.
భారత కరెన్సీని పాకిస్థాన్‌లో అక్రమంగా ముద్రించడం ద్వారా, అంతర్జాతీయంగా చందాలు అడగడం ద్వారా, కొన్ని ఇస్లామిక్ దేశాల నుంచి విరాళాలు సేకరించడం ద్వారా పాక్ ఇందుకోసం డబ్బులు సమకూర్చుకుంటోందని అంటున్నారు. పాక్‌లో ఉగ్రవాదాన్ని అణిచి వేయడానికనే పేరుతో అమెరికా చేస్తున్న సాయాన్ని భారత్ పలు సందర్భాల్లో తప్పుబట్టింది.
పైకి అది ఉగ్రవాదుల అణిచివేతకు సాయంలా కనిపిస్తున్నా, అంతర్గతంగా అది ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడమే అవుతుందని తన అభ్యంతరం వ్యక్తం చేసింది.విచిత్రమేమిటంటే, పాకిస్థాన్ భారమైన అప్పులతో దివాలా తీసే స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. ఆదాయాన్ని మించిన అప్పుల శాతం 70 శాతానికి చేరింది.
ప్రతిసారీ విదేశీ అప్పుల కోసం ఎదురుచూడటంతోనే దాని కాలం గడిచిపోతోంది. పైగా ఆ దేశప్రజలు కట్టే పన్నులు, దేశ సమగ్ర ఆదాయాన్ని అంచనా వేస్తే ప్రపంచంలో అతి తక్కువ(10 శాతం) ‘Tax-to-GDP Ratio’ ఉన్న దేశాల్లో పాక్ కూడా ఉంది.
పైగా చమురు దిగుమతులపై విపరీతంగా ఆధారపడటం, విదేశీ ఎగుమతుల్ని సమర్థంగా నిర్వహించలేని స్థితిలో ఆ దేశ వ్యాపారరంగం తీవ్ర సంక్షోభాన్ని అనుభవిస్తోంది. ఇన్ని జరుగుతున్నా తన దేశాన్ని బాగు చేసుకోలేని పాక్ భారత్‌పై నిప్పులు రువ్వుతోంది.
ఇతరుల నాశనాన్ని కోరే దేశం చివరకు తన పనుల వల్ల తానే నాశనమైపోతుంది. పాక్ ఆ స్థితికి చేరకుండా ఉండాలంటే ఇప్పుడే కళ్లు తెరిచి, బుద్ధి తెచ్చుకోవడం అవసరం.