Goverdhan Gande………………………..
Alternative politics………………………….. అసంతృప్తి, అసహనం, హింస, అశాంతి లాంటి పరిస్థితులు ప్రత్యామ్నాయ అవసరాన్ని కల్పించడం సహజమే కదా. దేశంలో అలాంటి స్థితిని గ్రహించిన ప్రతిపక్ష రాజకీయ నాయకత్వం ఒక ప్రత్యామ్నాయాన్ని నిర్మించే ఏర్పాట్లలో ఓ అడుగు ముందుకు వేసినట్లుగా కనిపిస్తున్నది. మరాఠా దిగ్గజం శరద్ పవార్ తో ఎన్నికల వ్యూహకర్తగా విశేష ప్రచారం పొంది కొన్ని చోట్ల విజయం సాధించిన పీకే (ప్రశాంత్ కిశోర్ )జరిపిన భేటీ రాజకీయ ప్రాధాన్యం సంతరించుకున్నది.తెలంగాణ సి ఎం కేసీఆర్ ను కూడా కలిసే అవకాశాలున్నాయని ప్రచారం జరుతున్నది.
ఒక దశలో కేసీఆర్ వివిధ రాష్ట్రాల సీఎంలను కలసి వచ్చారు. జాతీయ పార్టీ పెట్టేందుకు కొన్ని ప్రణాళికలను రూపొందించుకున్నారు. అయితే ఆ ప్రయత్నాలను పక్కనబెట్టారు. ఇక దీదీ 2019 ఎన్నికలకు ముందే కొన్ని ప్రయత్నాలు చేశారు. అప్పట్లోనే శరద్ పవర్ ను నాయకత్వం వహించమని కోరారు. కానీ అవేవి వర్కవుట్ కాలేదు. గత ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు చొరవ తీసుకుని యూపీఏ ఫ్రంట్ కోసం పనిచేశారు. కానీ ప్రజలు మోడీ వైపే మొగ్గు చూపారు.
ఇపుడు తాజాగా శరద్ పవర్ పీకే తో జరిపిన మంతనాలను బట్టి మళ్ళీ మరో ఫ్రంట్ పై చర్చలు జరిగి ఉండవచ్చు అనే ఊహాగానాలు మొదలైనాయి. మమతా సూచనల మేరకే పీకే శరద్ పవర్ ను కలిసారని కూడా అంటున్నారు. మోడీ ని .. ఎన్డీయే ను ఎదుర్కొనేందుకు బలమైన ప్రత్యామ్నాయం ఇపుడు అవసరం ఉందని అన్ని ప్రతిపక్షాలు భావిస్తున్నప్పటికీ ఈ సమయంలో ఎంతమంది ముందుకు వస్తారనేది మిలియన్ డాలర్ ప్రశ్న. యూపీఏ అయితే ఇప్పటి పరిస్థితుల్లో ప్రత్యామ్నాయం కాదు. దాన్నినడిపే కాంగ్రెస్ కి ఆ విషయం తెలుసు. పార్టీకి ప్రెసిడెంట్ ను పెట్టుకోలేక రెండేళ్లుగా కాంగ్రెస్ కొట్టు మిట్టాడుతోంది.
కొత్త ఫ్రంట్ పెడితే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే, తెలంగాణ సీఎం కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్, ఏపీ ముఖ్యమంత్రి జగన్ సారధ్యంలోని వైసీపీ జతగట్టే అవకాశాలు ఏ మేరకు ఉన్నాయనేది ఓ చర్చనీయాంశం. అఖిలేష్ యాదవ్, మాయావతి, నితీష్ కుమార్, నవీన్ పట్నాయక్ లాంటి నేతల స్పందన ఏమిటి? వైఖరి ఎలా ఉంటుందనేది చూడాలి. ఇవన్నీ ఇప్పటికిప్పుడే తేలే అంశాలు కావు. సీపీఐ,సీపీఎం లాంటి పార్టీలు బీజీపీ ని రాజకీయ శత్రువుగా భావించే ఇతర పార్టీలు ఈ ప్రయత్నాలను ఎలా చూస్తాయి?ఈ పార్టీలు కాంగ్రెస్ తో కలసి పనిచేసాయి గతంలో. కొత్త ఫ్రంట్ వస్తే ఏ విధంగా స్పందిస్తాయో చూడాలి.
బిజేపీతో చెలిమి చేస్తూ , ఎన్డీఏ గొడుగు కిందే ఉండి అసంతృప్తితో ఉన్న కొన్ని పార్టీలు ఎలా స్పందిస్తాయి. ఈ పార్టీలు,నేతల రాజకీయ అవసరాల్లో సర్దుబాటు జరిగితే బీజీపీ కి రాజకీయ ప్రత్యామ్నాయం నిర్మించడం సాధ్యమే. వీరిలో కొందరు ఇప్పటికే వ్యక్తిగత, రాజకీయ అవసరాల కోసం బీజీపీ తో స్నేహం చేస్తున్నారు.వీరు ఇప్పటికిప్పుడు తమ వైఖరి ని మార్చుకునే అవకాశాలు లేవు. సాధారణ ఎన్నికల నాటికి వీరి వైఖరి లో మార్పు రావచ్చు. నాడు దేశంలో ఉండే పరిస్థితులు, వీరి అవసరాలు,(నమోదైన,ప్రచారంలో ఉన్న,ఆరోపణలున్న అవినీతి అంశాలు) ప్రాదాన్యతలు వీరి వైఖరిని నిర్ణయిస్తాయి. కానీ వీరి మధ్య సఖ్యత,ఐక్యత అనేదే ఓ సమస్య.ఎన్నికల నాటికి బీజీపీ బలం ఇలాగే ఉంటుందా,బలహీన పడుతుందా అనే అంశాలు కూడా ప్రత్యామ్నాయ వేదిక నిర్మాణంలో కీలక పాత్రను పోషిస్తాయి అని చెప్పాలి.