క్లౌడ్ బరస్ట్ వెనుక చైనా హస్తం ఉందా ?

Sharing is Caring...

Cloud burst……..……………………………………………………………………..

ఒక ప్రాంతంలో ఆకస్మికంగా పెద్ద ఎత్తున  వర్షాలు కురిసి, వరదలు ముంచెత్తడాన్ని క్లౌడ్ బరస్ట్ అంటారు.తక్కువ సమయంలో అధిక స్థాయిలో వాన పడుతుంది. వాగులు, వంకలు పొంగిపొర్లుతాయి. వరదలొచ్చి చుట్టు పక్కల ప్రాంతాలు నీట మునిగిపోతాయి.

వాతావరణ శాఖ నిర్వచనం ప్రకారం.. 20 — 30 కి.మీ. పరిధిలో ఒక గంటలో 10 సెం.మీ లేదా అంతకన్నా అధిక వర్షం కురిస్తే.. దానిని మేఘాల విస్ఫోటనం అంటారు…  లేదా క్లౌడ్ బరస్ట్ అని పిలుస్తారు. ఒక్కోసారి ఒకే ప్రాంతంలో ఒకటి కన్నా.. ఎక్కువ సార్లు కూడా క్లౌడ్ బరస్ట్ జరగొచ్చు. ఇలా ఒక ప్రాంతంలో ఉహించని విధంగా వర్షాలు కురిసి వరదలు రావడం గతంలో మనం చూసాం. ఇపుడు చూస్తున్నాం.

ఇలాంటి సందర్భాలలో నష్టం పెద్ద ఎత్తున వాటిల్లుతుంది. క్లౌడ్ బరస్ట్‌లు సాధారణంగా పర్వత ప్రాంతాల్లోనే ఎక్కువగా జరుగుతాయి. పర్వతాలపై ఏర్పడిన మేఘాలు అధిక తేమను కలిగి తక్కువ టైంలోనే భారీ వర్షాలు పడతాయి. మనదేశంలో తరచూ ఇలాంటి విపత్తులు ఎక్కువగా జరుగుతుండడంతో.. వీటి వెనక విదేశీ కుట్ర ఉందేమోనని తెలంగాణ సీఎం కేసీఆర్ అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై ఖండనలు చాలా వచ్చాయి. కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు పై విమర్శలు రాకుండా విషయాన్నీ తెలివిగా పక్కదారి పట్టించారని ఆరోపణలు కూడా వచ్చాయి. ఇక ఈ విషయంలో చైనాపై కూడా అనుమానాలు వస్తున్నాయి.

చైనా గతంలో పలుమార్లు వర్షాలను కంట్రోల్ చేసే టెక్నాలజీ ని ఉపయోగించి  ఇలాంటి విపత్తులు కల్పించింది  అంటారు.  తమకు అవసరమైనపుడు  వర్షాలను కురిపించడం, వద్దనుకున్నప్పుడు ఆగిపోయేలా చేయడంలో చైనాకు అనుభవముందని చెబుతుంటారు. 2008లో చైనా రాజధాని బీజింగ్‌లో ఒలింపిక్ క్రీడలు జరిగాయి.

ఈ క్రీడలకు అంతరాయం కలగకుండా  చైనా టెక్నాలజీ ని ఉపయోగించి వర్షాలను ఆపిందని అంటారు. కొన్ని సందర్భాలలో ముందే వర్షాలను కురిపించి మేఘాలను క్లియర్ చేసిందట. అలాగే ఇదే టెక్నాలజీ ని ఉపయోగించి కృత్రిమ వర్షాన్ని కురిపించిందని చెబుతారు. ఇలా గతం లో ఆంధ్రా లో కూడా జరిగాయి. ఆ ప్రయత్నాలు అంతగా సక్సెస్ కాలేదు.

అలాగే 1967లో వియత్నాం వార్ సమయంలోనూ అమెరికా ‘ది ఆపరేషన్ పొపియే’ పేరిట  క్లౌడ్ బరస్ట్ చేసి.. వియత్నాంను  దెబ్బకొట్టిందని అంటారు. మండు వేసవిలో 50 డిగ్రీల ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు దుబాయ్‌లో కూడా కృత్రిమ వర్షం కురిపించారట.ఇందుకు క్లౌడ్ సీడింగ్ టెక్నాలజీని ఉపయోగించారని అంటారు.

సిల్వర్ అయోడైడ్, పొటాషియం అయొడైడ్, డ్రై ఐస్‌ వంటి రసాయనాలను సమీకరించి విమానాలు, హెలికాప్టర్లలో తీసుకెళ్లి ఆకాశంలో చల్లుతారు. ఈ రసాయనాలు  గాల్లో ఉన్న తేమను ఆకర్షిస్తాయి. నీట కణాలన్నీ ఒకే చోటకు రావడంతో..పెద్ద క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడతాయి. ఆ మేఘాలను ఎలక్ట్రిసిటీతో చార్జ్ చేస్తే  వర్షం కురుస్తుంది.ఇలా వర్షం కురిపించేందుకు అరగంట నుంచి గంట టైమ్ పడుతుంది.

మనదేశంలో 1970 నుంచి 2016 వరకు దాదాపు 30కి పైగా క్లౌడ్ బరస్ట్ ఘటనలు సంభవించాయి. ఇవన్నీ హిమాలయ ప్రాంతంలోనే జరిగాయి. జమ్మూకాశ్మీర్,లడక్, ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతాల్లో క్లౌబ్ బరస్ట్ ఘటనల వల్ల కుండపోత వర్షాలు పడి.. వరదలు ముంచెత్తాయి.

2013లో ఉత్తరాఖండ్‌లో క్లౌడ్ బరస్ట్ వల్ల కేదార్‌నాథ్‌ను ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. 5వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.  అసోంలో ప్రతి ఏటా వందలాది మంది వర్షాలు, వరదల కారణంగా మరణిస్తున్నారు. క్లౌడ్ బరస్ట్‌లు ఎక్కువగా ఇండియా, చైనా సరిహద్దు ప్రాంతాల్లో జరుగుతుండడంతో.. దీని వెనక చైనా కుట్ర ఉందన్న అనుమానాలు కలుగుతున్నాయి.

చైనా, భారత్ మధ్య చాలా ఏళ్లుగా సరిహద్దు గొడవలు జరుగుతున్నాయి.  ఇటీవల  కాలంలో భారత సరిహద్దుల వెంబడి చైనా సైన్యం కవ్వింపు చర్యలకు  పాల్పడుతుంది. ఈ పరిణామాల క్రమంలో  చైనానే కుట్రపూరితంగా క్లౌడ్ బరస్ట్‌లను సృష్టించి.. వర్షాలు, వరదలతో భారత్‌ను దొంగ దెబ్బకొట్టేందుకు ప్రయత్నిస్తోందన్న అనుమానాలు కలుగుతున్నాయి. అదే రీతిలో తెలంగాణాలో కూడా జరిగిందా అన్న అనుమానం వ్యక్తమౌతోంది. వీటికి ఆధారాలు ఏమీ లేవు.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!