హరిశ్చంద్రుడు అబద్ధం చెప్పాడు!

Sharing is Caring...

ఎండాకాలపు మిట్టమధ్యాహ్నం నిప్పులు చిమ్ముతున్న వడగాలిని తట్టుకోలేక ఊళ్లకి ఊళ్లు తలుపులేసుకొని కూర్చుంటే… మా వూరి ముంగిట్లో  మాత్రం ఆ వేళ వెన్నెల కురిసింది. రాత్రికి హరిశ్చంద్ర  నాటకం. చంద్రమతి వేషంలో పద్యనాటక గాన కోకిల గూడూరు సావిత్రి. మహాతల్లి  పద్యం పాడిందంటే శిలలు సైతం కరిగి ఆమె పాదాలకు ప్రణమిల్లుతాయి. 

ఒకటవ హరిశ్చంద్రుడు ముప్పాల నాంచారయ్య. నక్షత్రకుడిగా ‘దంతావళంబుపై బలవంతుడొకండు’ పద్యంలో రివ్వు……………..నా అంటూ బ్రీత్లెస్ రాగంతీసి వన్సుమోర్లు కొట్టించుకునే  వై.గోపాల్రావ్. ఇక రెండవ హరిశ్చంద్రుడెవరో తెలుసా…ఎవరు పద్యం పాడితే  శిశువులూ పశువులూ  తేడాలేకుండా  సమస్త  జీవరాశులూ అతని  గానామృతపు  గంగా ప్రవాహంలో కొట్టుకుపోతాయో అతనే  డి.వి. సుబ్బారావ్.

అతను ఎలా వస్తాడో  ఏ వాహనం మీద వస్తాడో ఎవరికీ  అంచనా లేదు.  ఒక్కోసారి అద్దెకు తీసుకున్న అంబాసిడర్లో వస్తాడు! ఇంకోసారి   ఎవరో ఒకరు   బైకు  మీద దిగబెట్టి పోతారు!  మరికొన్ని సార్లు  ముందురోజు రాత్రి నాటకం అడిన ఊరి జనం ఊరేగింపుగా నాలుగైదు  ట్రాక్టర్లలో  వచ్చి మరీ సాగనంపుతారు!  ఆవేళ  మావూరికి ఎట్లా వస్తాడో  తెలియక  ఏ బండి వూళ్లోకి  వచ్చినా  ఆయనే అని అందరూ  హడావుడి పడుతున్నారు.  

మిట్ట మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతపు  తెల్లని  వెన్నెల్లో   ఎర్రని ట్రాక్టరు  ఊళ్లోకి వచ్చింది.  ట్రాక్టర్ నిండా జనం. డి.వి. సుబ్బారావ్ వచ్చాడన్న వార్త  దావాగ్నిలా ఊరంతా  పాకింది. అంత మందిలో డి.వి. సుబ్బారావు ఎవరో  పోల్చుకోలేక నాబోటి పిల్లగాళ్లమంతా గోడలెక్కీ, మిద్దెలెక్కీ చూస్తున్నాం.  వచ్చిన ట్రాక్టర్లో డి.వి.సుబ్బారావు లేడూ అని కొందరు. ఆ సన్నగా ..పంచెనే లుంగీలా చుట్టుకొని వున్న ఆయనే డి.వి. సుబ్బారావు అని ఇంకొందరు.  ట్రాక్టరు చూట్టూ గుంపులు గుంపులుగా  జనం.

ఏవేవో అరుపులూ, కేకలు వినిపిస్తున్నాయ్! చూస్తుండగానే అది గొడవలా రూపం మార్చుకుంది.  ఆ ట్రాక్టర్లో వచ్చిన వాళ్లకీ మా వూరి జనాలకీ మధ్య చిచ్చురేగింది. అసలు గొడవ ఏంటంటే  ఆ ట్రాక్టర్లో  వచ్చిన వాళ్లు అక్కడెక్కడో ప్రకాశం జిల్లా వాళ్లు.  వాళ్ల ఊళ్లో కూడా ఇదే రాత్రి నాటకం ఆడ్డానికి డి.వి.సుబ్బారావు అడ్వాన్స్ తీసుకున్నాడంట! మా వూళ్లో ఆడ్డానికి ఒప్పుకొని మీ ఊరెట్లా వస్తాడూ అని వాళ్ల గొడవ.  అడ్వాన్స్ మేం కూడా ఇచ్చాం…ఏం చేస్తారో చేసుకోండి అని మా వూరి వాళ్లు పంచెలు బిగించారు. 

ఆ నా కొడుకుని రానీయండి  తేలుద్దాం అని ఆ ప్రకాశం వాళ్లు పంతం పట్టుకొని కూర్చున్నారు.  ఆరు నూరయినా  నాటకం ఆడందే  ఇక్కడ్నుంచి  ఆడ్ని పంపేది లేదు అని మా వూరు వాళ్లు కూడా  అనేక పౌరుష వాక్యాలు వదిలారు.  ఇరు వర్గాలకీ సర్దిచెప్తూ మా  తాత  మధ్యవర్తిత్వం  నడుపుతున్నాడు.  రాత్రికి నాటకం జరుగుద్దో లేదో  తెలియడం లేదు. అసలు డి.వి. సుబ్బారావు ఏ వూళ్లో వున్నాడో, ఏ టైంకి  వస్తాడో, అసలు వస్తాడో  రాడో తెలియదు.  అందరూ ఓపిగ్గా ఎదురుచూస్తున్నారు.
అపస్మారక స్ధితిలో…

అంతలో  ఎక్కడినుంచో ఒక  నీలం రంగు జీపు పొగలు చిమ్ముతూ  ఊళ్లోకి వచ్చింది.  జీపు దగ్గరికి మా తాతయ్యని పిలిపించారు. ఏదో మాట్లాడారు. జీపు లోనుంచి ఒక శరీరాన్ని కిందకు దించి వచ్చిన జీపు వచ్చినట్టే వెళ్లిపోయింది. ఆ ఊహించని పరిణామంతో  ఊరంతా ఒక్కసారిగా ఉత్కంఠతకు లోనయ్యింది. అది డి.వి. సుబ్బారావు శరీరం. క్రితం రోజు రాత్రి నాటకం ఆడించుకున్న కాంట్రాక్టరు  జీపులో సుబ్బారావు  శరీరాన్ని మావూరికి తీసుకొచ్చి పడేసి చేతులు దులుపుకొని వెళ్లిపోయాడు.  ఏ మయ్యిందో తెలియదు. శరీరం అపస్మారకంగా పడివుంది. 

అతని తెల్లని బట్టలు నల్లని మట్టితో మురికి  వాసన కొడుతున్నాయి.   తెలుగు పద్యనాటకపు చరిత్రలో ఒక లెజెండ్  అలా అపస్మారకంగా పడిపోయివున్నాడు. దాదాపు రెండు  దశాబ్దాల పాటు హరిశ్చంద్ర పాత్రతో ఆంధ్రదేశాన్ని ఉర్రూతలూగించిన  ఒక  పెను  ఉప్పెన  చనిపోయో లేక చావుకి దగ్గరగానో   నిశ్చేష్టమై పడివుంది.  కబీరు  డాక్టరుకి కబురెళ్లింది.  నులక మంచం మీద డి.వి. సుబ్బారావు శరీరాన్ని మోసుకుంటూ జనం  కబీరు  డాక్టరింటికి  వెళ్లారు. 

సాయంత్రం నాలుగవుతున్నా వేడి గాలి ఇంకా వుదృతంగానే వుంది. డాక్టరు ఇంటిముందు వేపచెట్టు కింద నులకమంచాన్ని దించారు. అందరూ దూరంగా వెళ్లాలని, మనిషికి గాలి ఆడటం లేదని డాక్టరు పదే పదే చెబితే జనం కొంచెం దూరంగా జరిగారు. రాత్రి నాటకం అయ్యే సరికి తెల్లారిందనీ, అప్పట్నుంచి సారాయి షాపులోనే కూర్చొని తాగీ తాగీ పడిపోయాడని మా తాతయ్య జనాలకి జరిగింది చెప్పి దూరంగా పంపిస్తున్నాడు. 

సెలైను బుడ్డి తెచ్చి ఎక్కించడం మొదలుపెట్టారు.  ఊరి జనం తండోప తండాలుగా వేప చెట్టు చుట్టూతా కూర్చొని ఎప్పుడు ఏమౌతుందో అన్నట్టు ఊపిరి బిగబట్టి చూస్తూవున్నారు. ప్రకాశం నుంచి వచ్చిన రుబాబు గుంపు కూడా  మరో పక్క బిక్కు బిక్కు మంటూ కూర్చున్నారు.  సెలైను బుడ్డి పెట్టి  గంట దాటింది.  అయినా శరీరంలో ఏ కదలికా లేదు. అవసరమైతే రెండో బుడ్డి కూడా ఎక్కించాల్సివుంటుందని డాక్టరు అన్నాడో లేదో  ఊళ్లో వున్న మోతుబరి పిల్లల మోటారు సైకిళ్లు సెలైను బుడ్డి తేవడం కోసం టౌనుకి  రయ్యిమన్నాయ్.  

చుట్టూ కూర్చున్న జనం డి.వి. సుబ్బారావు గురించీ, అతని నాటకాల గురించీ ఎవరి జ్ణాపకాలు వాళ్లు నెమరేసుకుంటున్నారు. ఈ డి.వి గాత్రానికి శృతీలయా నేర్పింది వల్లూరి వెంకట్రామయ్య చౌదరంట! వల్లూరి వెంకట్రామయ్య ఎవరంటే వాడిపోయిన మల్లె పువ్వు వాసనకు పనికిరాదు సంగూ అంటూ బాలనాగమ్మ నాటకంలోని మాయలపకీరు వేషంతో ఆంధ్రదేశాన్ని ఉర్రూతలూగించిన మొనగాడు.   

అసలీ  డి.వి. సుబ్బారావు ఆయువు పట్టు బండారు  రామారావులో వుందంట! బండారు రామారావు ఎవరంటే గుర్రం జాషువా పద్యాలని తీసుకొచ్చి హరిశ్చంద్ర కాటిసీనులో దూర్చి సంచలనం సృష్టించిన ఘనాపాటి. బండారు రామారావు ఎవరంటే అక్షర జ్ణానం, సంగీత జ్ణానం, సాహితీ పరిజ్ణానం లాంటివి ఏవీ లేకుండానే కేవలం వినికిడి జ్ణానంతోనే పద్యం పాడవచ్చూ, ప్రేక్షకులని మెప్పించవచ్చూ అని భాష్యం చెప్పి  పద్య నాటకాన్ని కింది కులాల కాళ్ల దాకా ఈడ్చుకొచ్చిన తరతరాలకి  తొలి తరం  మార్గదర్శి.

ప్రకాశం జిల్లా వేటపాలెంలో పుట్టిన   ఈ  డి.వి. సుబ్బారావు పాడితే అచ్చం బండారు పాడినట్టే వుంటుందని, బండారు కాలం చేశాక సుబ్బారావుని పల్లకీ ఎక్కించారు పల్లెల్లోని మాల, మాదిగ, కాపు,కమ్మ, రెడ్డి, వెలమ లాంటి  రైతు కూలీలు. బండారు రామారావుకున్న అందమైన రూపం,  అచంచలమైన  సమయస్పూర్తి,  సంభాషణా చాతుర్యం డి.వి.కి లేకపోయినా రాగాలాపనలో, కరుణరసం పండించడంలో తనకంటూ ఒక ప్రత్యేకతని ఏర్పరుచుకున్నాడు. 

బండారు రామారావు స్నేహితులంతా కాళ్లు పట్టుకొని బతిమిలాడినా చేయని ఒక పని డి.వి. సుబ్బారావు చేతులు పట్టుకోగానే చేసేశాడు.  మద్రాసు నుంచి వచ్చిన  లియో కంపెనీ వాళ్లకి కాంట్రాక్టు కాగితం రాసిచ్చి, తన పద్యాలన్నిటినీ గ్రామ్ ఫోన్ రికార్డు చేశాడు.  ఆ  రికార్డులు తర్వాత తర్వాత  కాసెట్లుగా మారి ఎన్ని వందలు వేలు లక్షలు అమ్ముడుపోయాయో లెక్కలేదు.  ప్రేక్షకులని మంత్రముగ్ధుల్ని చేసే గాత్రంతో  తెలుగు నాటకరంగంలో చెలరేగిపోయాడు.  

ఆ ముగ్ధమనోహర గాత్రం ఇప్పుడు మూగబోయి మంచం మీద పడివుంది. పొద్దు పోయి చాలాసేపయ్యింది. నాటకం చూడ్డానికి అన్నాలు తిని బండ్లు కట్టుకొని వచ్చిన పొరుగూళ్ల జనంతో ఊరంతా కిక్కిరిసిపోయింది.  డి.వి. కి ఇంకా స్పృహ రాలేదు.  ఈ రాత్రికి  ఇక నాటకం జరగదు అన్న విషయం అందరికీ అర్ధమైపోయింది. ఈ నాటకంతో సెటలయిపోతాం అనుకున్న కాంట్రాక్టర్ కళ్లల్లో నిస్పృహ అతని దేహమంతా ఆవరించింది.

రాత్రి పది గంటలకి డి.వి. మెల్లగా కళ్లు తెరిచాడు. కొన్ని వేల కళ్లు అతని కళ్లవైపే కన్నార్పకుండా చూస్తున్నాయి.  చిన్నగా ఓపిక తెచ్చుకొని కూర్చున్నాడు.  వేదిక ఎక్కగలవా అని అడిగాడు మా తాత.  అదేం ప్రశ్న అన్నట్టు ఒక చిరునవ్వు చిలకరించాడు డి.వి.  జనం ఈలలు, కేకలు…కాంట్రాక్టరు వేదిక దగ్గరికి పరిగెత్తాడు. మరో అరగంటలొ నాటకం ప్రారంభమౌతుందని ఎనౌన్స్మెంట్లు. పది, ఇరవై, యాభై  టికెట్లు  తెగుతూనే వున్నాయ్. చూస్తుండగానే ఆ ప్రాంతమంతా జనమయమైపొయింది. 

ఆ ప్రకాశం వాళ్లు ఇక పంతానికి పోయిలాభం లేదనుకున్నారు. గురూ! వారణాసిలో నాలుగు పద్యాలు పాడించేసి దించేస్తే మేం మావూరు తీసుకుపోతాం! ఒట్టి చేతుల్తో పోతే చేతులు తీసేసినా తీసేస్తారు మాఊరోళ్లూ! అంటూ స్టేజీ ఎనకమాల ట్రాక్టరు రడీచేసి కాచుక్కూచున్నారు.  చెప్పలేని నీరస వదనంతో డి.వి. మేకప్ పూర్తిచేసుకొని వేదిక మీదకు వచ్చాడు. మేకప్ పూర్తయ్యిందో లేదో ఊరిపెద్దలు వారిస్తున్నా వినకుండా సైడ్ వింగ్ లో  డి.వి. మరో  సారాయి పాకెట్ కొరికి అతి కష్టంమీద ఆ గరళాన్ని గొంతులో పోసుకున్నాడు. అతని పద్యానికీ మద్యానికీ మధ్య  ఏదో అవినాభావ సంబంధం వున్నట్టుగానే తోస్తుంది.

అతనికి అమితమైన గుర్తింపు తెచ్చిన ‘భక్తయోగ పదన్యాసి’ ని ఎలాంటి భక్తిభావం లేకుండానే ముగించేశాడు. జనం ఉత్సాహం మీద నీళ్లుపోశాడు. కొందరు కొట్టడానికి వేదికమీదకు వెళ్లబోయారు. జీవితంలో కోలుకోలేని  దెబ్బతీసిన ఒక మోసగాడ్ని ఎలా తిడతామో అలా తిడుతున్నారు.  ఆ పరుష పదాలేవీ అతని  చెవిని కూడా  తాకుతున్నట్టులేవు. డి.వి. పక్కనే నక్షత్రకుడు వేషంలో వున్న గోపాల్రావ్ నీకే లేని ఈ బాధ నాకా అంటూ రెచ్చిపోయాడు.

మా అప్పు ఎప్పుడు తీరుస్తావ్ అని నక్షత్రకుడు అనరాని మాటలు అంటూవుంటే… ఏం చేయాలో ఎలా చెప్పాలో తెలియక చంద్రమతి వేషంలో వున్న గూడూరు సావిత్రి  వెక్కి వెక్కి ఏడుస్తూ ప్రేక్షకుల కళ్లని సజలాలు  చేస్తూ నాధా నేను చెప్పేది వినండి. నన్ను ఎవరికైనా అమ్మి…. అని అన్నదో లేదో…..అప్పటిదాకా పంటిబిగువనే బాధని, దుఖాన్ని  అదిమిపట్టి వుంచిన డి.వి  ఒక్కసారిగా దేవీ అంటూ పెను గర్జన చేసి  అంతటి రాజచంద్రునకు ఆత్మజవై అందుకున్నాడు. ప్రేక్షకులు రోమాంచితులయ్యారు.

హార్మనిస్టు పుల్లారావు శృతిని తారాస్ధాయికి తీసుకుపోయాడు. పద్యం పాకాన పడుతుంది.  డి.వి. మధ్య మధ్యలో గొంతు సరిచేసుకుంటూనే ఒక బాధాతప్తహృదయాన్ని తన పద్యం ద్వారా ఆవిష్కరించాడు. సావిత్రమ్మ కొంగుతో కన్నీళ్లు తుడుచుకుంటూ నన్ను అమ్ముకోవండం తప్ప వేరే  మార్గం లేదంటూ సర్ది చెప్పింది. అప్పుడు అందుకున్నాడు డి.వి. ఎక్కడినుంచి వచ్చిందో తెలియదు ఆ సంబాళింపు ..  ఆ గాత్రం .. ఆ భావావేశం ప్రేక్షకులని తన్మయులని చేసే ఆ మంత్రశక్తి… హృదయమా నేటితో అభిమానములు వదిలివేయుము అంటూ ఒక మహా విజృంభణకి నాంది పలికాడు.

ఆ ప్రాంగణంలోని వేలాది శరీరాలు పైరగాలి పరవశంతో ఊగిపోయే పొద్దు తిరుగుడు పువ్వులమల్లే ఒక తన్మయత్వపు మత్తులో తూలిపోవడం మొదలుపెట్టాయి.  అది నాటకం అనీ ఆ పాడుతున్నది పరమ తాగుబోతు డి.వి. అని, కొద్ది సేపటి క్రితమే అతని వంశవృక్షపు కూకటివేళ్లను కూడా పెకలించి మరీ దూషించామని  మర్చిపోయి జనం ఒకరి తర్వాత ఒకరు దైవదర్శనానికి వెళుతున్నట్టు స్టేజీ ఎక్కడం మొదలు పెట్టారు.

ఒక రైతు ఐదురూపాయల నోట్లను దండ గుచ్చి డి.వి. మెడలో అలంకరించాడు. ఇంకో కూలీ డి.వి. చేతిలో ఏవో చిల్లర డబ్బులు వుంచి దండం పెట్టి దిగిపోయాడు. ఒకరు యాభై రూపాయల నోటుని పిన్నుతో డి.వి. కాషాయపు చొక్కాకి గుచ్చారు. అదే పద్యాన్ని మళ్లీ పాడమని కోరాడు. డి.వి కాదనలేదు.  అట్లా ప్రతి రెండు పద్యాలలో ఒక పద్యం రెండేసి సార్లు పాడుతుంటే  ప్రకాశం వాళ్ల గుండెళ్లో పిడుగులు పడ్డంత పనైంది.

ఈ లెక్కన వారణాసి పూర్తయ్యి వాళ్ల ఊళ్లో కాటికి పోయేసరికే తెల్లవారుద్దని తొందరపెట్టటం ప్రారంభించారు. కాసేపట్లోనే డి.వి. చొక్కా అంతా కరన్సీనోట్లతో కిక్కిరిసి పోయింది.  ప్రకాశం వాళ్ల పోరు పడలేక అతి కష్టం మీద వారణాసిని స్టేజీమీదనే ఆన్ లైన్ ఎడిటింగ్  చేసి ముంగించేశాడు డి.వి. మీ వూరు మళ్లీ వస్తాను కాటిసీను పద్యాలన్నీ ఒకటికి రెండు సార్లు పాడతాను ఇంక సెలవిప్పించండి అంటూ వేడుకున్నాడు. జనం కుదరదన్నారు.

ఆ కాషాయపు దుస్తులతోనే  రెండు కాటిసీను పద్యాలు పాడి మరోసారి కళ్లనీళ్లతో చేతులు జోడించాడు. ఈసారి జనం సరే అన్నారు. అలాంటి ఆపద సమయాల్లో అతన్ని ఆదుకోవడానికి ముప్పాల నాంచారయ్య సర్వం సన్నద్ధం గానే వుంటాడు. కాటిసీను హరిశ్చంద్రుడిగా నాంచారయ్య రంగప్రవేశం చేశాడు. అప్పటికే అర్ధరాత్రి దాటింది. ఆ అద్భుత ఘడియల కోసం కాచుక్కూచున్న ప్రకాశం వాళ్ళ ఆనందం చెప్పడానికి మాటలు చాలవు.

ఆ చిమ్మ చీకట్లో  డి.వి.ని జాగ్రత్తగా ట్రాక్టరెక్కించారు. చక్కగా దిండూ దుప్పటి అమర్చారు. డి.వి.ని  పడుకోబెట్టుకొని   ప్రకాశం  జిల్లా  వైపు  పరుగులు పెట్టింది ట్రాక్టరు.  ఆ రాత్రి  అక్కడ నాటకం జరిగిందో లేదో తెలియదు. ఆ తర్వాత కొన్నాళ్లకి తెనాలి దగ్గర చదలవాడలో నాటకం ఆడాడు. సత్య హరిశ్చంద్రుడు  అబద్దం చెప్పాడు. ఆడినమాట తప్పాడు. మరలా మా వూరు వస్తానన్న డి.వి మావూరే కాదు ఏ వూరూ వెళ్లలేదు. డి.వి మరణించి పాతికేళ్ళు దాటింది. ఇప్పటికీ అతని పద్యాలు ప్రజల నాలుకల మీద లయబద్ధంగా  వినిపిస్తూనే  ఉన్నాయి.

[వాట్సాప్ గ్రూప్ ల్లో ఈ పోస్ట్ తిరుగుతోంది .. ఎవరు రాశారా అని వెతికితే పెద్ది రామారావు గారి బ్లాగ్ నుంచి తీసుకొచ్చారని తెలిసింది. రామారావు గారికి ధన్యవాదాలతో ..
డీవీ పద్యాలూ వినాలని అనుకునే వారు కింది లింక్ క్లిక్ చేసి వినవచ్చు]

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!