అంతలోనే …… మూర్తి గారు అన్న పిలుపు వినిపించింది. నాలుగు వైపులా చూసాను.ఎవరూ కనిపించలేదు … మరి పిలిచింది ఎవరు ? దెయ్యాలు ర్యాగింగ్ మొదలెట్టాయా ? ఎందుకో భయమేసింది.ఇక్కడ కొచ్చి తప్పు చేసానా ? ఆలోచనలు ఎటెటో పరుగెడుతున్నాయి. అసలే చీకటి గా ఉంది. దూరం గా ఊరి లైట్లు తప్ప ఏమి కనిపించడం లేదు. సరిగ్గా అపుడు ప్రియంవద పేరు గుర్తుకొచ్చింది. పెద్దగా అరిచాను ‘ప్రియంవద’అంటూ.
మరుక్షణమే ప్రత్యక్షమైంది ఆవిడ.ఆమె ను చూడగానే స్టన్ అయ్యాను.ప్రియంవద తెల్ల చీరలోమెరిసి పోతోంది. గమ్మత్తుగా మెరుస్తున్న కళ్ళలో ఏదో ఆకర్షణశక్తి ఉంది.ఆమె అందగత్తెలకే అందగత్తెలా ఉంది. ఆమె రాకతో ఆ ప్రాంతమంతా మల్లెపూల పరిమళాలు అలుముకున్నాయి. దెయ్యాలు కూడా ఇంత అందంగా ఉంటాయా ? బహుశా మోహిని జాతి దెయ్యం అయిఉంటుంది .
“హలొ సార్ … ఏమిటి ? అలా కన్నార్పకుండా చూస్తున్నారు ?” అందామె. ‘ఏమి లేదు ‘అన్నాను.
‘వెళదామా’ అందామె “ఎక్కడికి ? ‘ “చెట్టుపైన కూర్చుందాం” అంటూ నా చేయి పట్టుకుందామె.
ఇద్దరం గాలిలో తేలుతూ చెట్టుపైకి చేరాం. అక్కడో పెద్ద మంచె ఉంది .. దానిపై కూర్చున్నాం. చల్లటి గాలి వీస్తోంది.
అప్పటికే అక్కడ కూల్ డ్రింక్స్ , ఫలహారాలు రెడీగా ఉన్నాయి. పకోడీ , మైసూర్ పాక్ ఉన్న ప్లేట్ నాకు అందించి తాను ఒకటి తీసుకుంది. “ఇక మొదలు పెట్టండి మీ ఇంటర్వ్యూ” అందామె నవ్వుతూ.
“సినిమాల్లో దెయ్యాలు ఎప్పుడూ తెల్లచీరలే కట్టుకుంటాయి ఎందుకని ?” తొలి ప్రశ్న వేసాను.
“పూర్వం సినిమాలన్నీ బ్లాక్ అండ్ వైట్ లో వచ్చేవి కదా ! అలాగే చీకట్లో ‘తెల్ల చీర’ బాగా కనబడుతుంది. అందుకనుకుంటా. అయినా రీసెంటుగా వస్తున్న సినిమాల్లో మోడ్రన్ డ్రస్సుల్లో కూడా మా దెయ్యాలు కనిపిస్తున్నాయి కదా.” అందామె.
” నిజమే .”
“దానికంటే కూడా ఇంట్రస్టింగ్ పాయింట్ ఏంటంటే …సినిమాల్లో ఎక్కువగా ఆడ దెయ్యాల డామినేషన్ కనిపిస్తోంది .
ఆడ దెయ్యాల మీదే కథలు నడుస్తాయి. ఎపుడో కానీ మగ దెయ్యాలు కనిపించవు.. పాటలు కూడా ఎక్కువగా ఆడదెయ్యాలకే పెడుతుంటారు. కారణం ఏమిటి ?”
“ఇది సినిమా డైరెక్టర్లను అడగాల్సిన ప్రశ్న.”
“ఎక్కువ ఆడ దెయ్యాలనే ఎందుకు చూపిస్తున్నారని మీ దెయ్యాలు ఎపుడూ అనుకోలేదా ?”
“ఆ విషయం మా మీటింగ్ లో చర్చించాం.”
“మీరు మీటింగ్స్ కూడా పెట్టుకుంటారా ?”
“ఏం అన్ని మీ మసుష్యులే చేయాలా ?”
“కోప్పడకండి … దెయ్యం గారు..”
“మా మహిళా దెయ్యాల ఇమేజ్ దెబ్బతీసేలా సినిమాలు తీస్తున్నారు . చివరకి గూగుల్ సెర్చ్ లో తెలుగులో దెయ్యం అని కొట్టి ఇమేజెస్ లోకి వెడితే ఉన్న బొమ్మలన్నీ ఆడవాళ్లవే. కనుక సీరియస్ గా పట్టించుకోవాల్సిన విషయం ఇది. ఈ సంగతి మరోమారు చర్చించి చర్యలు తీసుకుంటాం.”
“అవునూ… పాడుబడిన బంగళాలంటే మీ దెయ్యాలకు ఎందుకంత ఇష్టమో చెబుతారా ?” టాపిక్ మార్చాను
“పాడుపడిన ఇండ్లు … దెయ్యాలకు సౌకర్యంగా ఉంటాయి. ఓనర్ అనేవాడు ఉండడు. రోజూ గదులన్నీశుభ్రం చేసే పని ఉండదు. బెడ్‌రూమ్‌లోనే పడుకోవాలనేం లేదు. ఇంట్లోని దూలాలకు ఎక్కడబడితే అక్కడ ఎలాబడితే అలా వేలాడుతూ నిద్రపోవచ్చు. ఇలాంటి లైఫ్ మనుషులకు దొరకదు కదా “
“ఓహ్ … భలే చెప్పారు. మరి చింత చెట్లపైన … మర్రి చెట్లపైన కూడా ఎందుకు కనిపిస్తుంటాయి మీ దెయ్యాలు?”
“ఆ ఏముంది ? ఇళ్ల కొరత … చింత చెట్లపై కాపురం ఏసీలో ఉన్నట్టు ఉంటుంది .. మర్రి చెట్లపైన అంతే. మనుష్యులకు దూరంగా ప్రశాంతంగా ఉండొచ్చు.” టకటక జవాబు చెప్పేసింది ప్రియ.
“మరి శ్మశానాల్లో ఉండరా ?”
” అక్కడ కూడా కొన్ని దెయ్యాలు ఉంటాయి”
“మీ దెయ్యాలలో 22 రకాలు ఉన్నాయట మీకు తెలుసా ?”
వామ్మో … అన్ని రకాలున్నాయా ? నాకే తెలీదే ?
తెలుస్కుంటారా ?
చెప్పండి ……
తివారీ అని ఒకాయన …
ఈ పేరు ఎక్కడో విన్నట్టుందే
” ఈయన వేరే తివారీ లే. ఈయన పూర్తి పేరు గౌరవ్ తివారీ . దెయ్యాల మీద పరిశోధనలు చేశారు .దెయ్యాల్లో మొత్తం 22 రకాలు ఉన్నాయని చెప్పాడు.
1. భూతం…. భూతం అంటే నిజానికి దెయ్యం కాదు. కొత్తగా జన్మించిన శిశువును భూతం అంటారట. శిశువు జన్మించే సమయంలో ఆ దేహంలోకి ఓ ఆత్మ వచ్చి చేరుతుందట. అలా భూతం చేరిన శిశువును భూతం అంటారు. ఆత్మకొంత సేపు ఉంటుంది. ఆ తరువాత ఆ ఆత్మకు పూర్వ జ్ఞానం పోతుంది. అప్పుడు శిశువుకు ఏమీ తెలియవు. గుర్తుండవు.
2. ప్రేతం…. ఇంట్లో ఉండే కుటుంబ సభ్యుల హింస వల్ల మరణించినవారు, శ్మశానంలో సరిగ్గా దహనం అవని మృతదేహాలు ప్రేతాలుగా మారుతాయట.
3. చుడెయిల్… ఉత్తర భారత దేశంలో దీని గురించి నమ్ముతారు. ఇలాంటి దెయ్యాలు ఎక్కువగా మర్రి చెట్ల మీద తలకిందులుగా వేలాడుతూ ఉంటాయట.
దారిన వచ్చీ పోయే వారిని భయపెట్టి, బెదిరిస్తాయట.
4. కొల్లిదేవా …. ఈ దెయ్యం గురించి కర్ణాటక వాసులు నమ్ముతారు. ఇలాంటి దెయ్యాలు అడవుల్లో ఎక్కువగా ఉంటాయి. రాత్రిపూట చేతిలో టార్చి లైట్‌ను పట్టుకుని అటు ఇటు తిరుగుతుంటాయట.
5. హడల్…. ఇవి దెయ్యాలే కానీ మనుషులకు హాని చేయవు. బిడ్డకు జన్మినిచ్చే సమయంలో చనిపోయిన మహిళలు ఈ దెయ్యాలుగా మారుతారట.
6. చెట్‌కిన్… ఈ దెయ్యాలు మనుషులను లొంగదీసుకుని వారిని యాక్సిడెంట్లలో చనిపోయేలా చేస్తాయట. ఒక రకంగా చెప్పాలంటే హిప్నాటిజం అన్నమాట. అలాంటి స్థితిలో మనుషులు తమకు తామే యాక్సిడెంట్‌లో చనిపోతారట.
7. కుట్టి చేతాన్…. చనిపోయిన చిన్నపిల్లల ఆత్మలను కుట్టిచేతాన్ అంటారట. వీరిని ఎక్కువగా తాంత్రికులు తమ గుప్పెట్లో పెట్టుకుని వారు చెప్పినట్టు చేసేలా ఆడిస్తారట.
8. బ్రహ్మదైత్య… పశ్చిమబెంగాల్ వాసులు ఈ తరహా దెయ్యాలను నమ్ముతారు. చనిపోయిన బ్రాహ్మణుల ఆత్మలు ఈ దెయ్యాలుగా మారుతాయట
9. మోహిని…. బాగా ప్రేమించిన వారు చనిపోతే మోహిని దెయ్యాలుగా మారుతారట. ఈ దెయ్యాలు చాల అందంగా ఉంటాయట.
10. విరికాస్… అడవుల్లో నివసిస్తూ పెద్ద ఎత్తున ఏడుపులు, వింత శబ్దాలు చేస్తాయట ఈ దెయ్యాలు .
11. శాకినీ…. వివాహం అయిన కొద్ది రోజులకే మరణించే మహిళలు శాకినీ దెయ్యాలుగా మారుతారట. ఈ దెయ్యాలు చాలా ప్రమాదకరమట.
12. ఢాకినీ…. మోహనీ, శాకినీ రెండు దెయ్యాలు కలిపితే అప్పుడు ఢాకినీ దెయ్యం అవుతుంది. ఇవి చాలా ప్రమాదకరం.
13. సంకోధోక్తాస్… ట్రెయిన్ ప్రమాదాల్లో చనిపోయిన వారు ఈ దెయ్యాలుగా మారుతారట. అలా అని బెంగాల్ వాసులు నమ్ముతారు.
14. నిశి…. ఈ దెయ్యాలు ఎక్కువగా చీకట్లోనే తిరుగుతాయట. వీటిని కూడా బెంగాల్ వాసులు నమ్ముతారు.
15. కిచ్చిన్…. ఈ దెయ్యాలను బెంగాల్ వాసులు నమ్ముతారు. ఇవి చాలా ఆకలితో, కోపంగా ఉంటాయట.
16. పందుబ్బ…. బీహార్ వాసులు ఈ దెయ్యాలను నమ్ముతారు. నదుల్లో మునిగి చనిపోయిన వారు ఈ దెయ్యాలుగా మారుతారట.
17. బుర డాంగోరియా… అస్సాంలో ఈ దెయ్యాల గురించి నమ్ముతారు. ఇవి తెల్లని డ్రెస్‌లో తలకు కట్టు కట్టుకుని గుర్రంపై వెళ్తూ ఉంటాయట.
18. బాక్… ఈ దెయ్యాలను అస్సాం వాసులు నమ్ముతారు. ఇవి ఎక్కువగా చిన్నపాటి చెరువులు, సరస్సుల వద్ద ఉంటాయట.
19. ఖాబీస్… పాకిస్థాన్, గల్ఫ్ దేశాలు, యూరప్ దేశాల్లో ఈ దెయ్యాలను నమ్ముతారు. ఈ దెయ్యాలకు కామరూప శక్తి ఉంటుందట.అంటే తాము ఏ రూపంలో కావాలనుకుంటే ఆ రూపంలోకి ఈ దెయ్యాలు మారుతాయట.
20. బీరా… ఈ దెయ్యాలను అస్సాం వాసులు నమ్ముతారు. ఈ దెయ్యాలు తమ కుటుంబ సభ్యుల చుట్టూ తిరుగుతుంటాయి .
21. జోఖిని… ఈ దెయ్యాలను అస్సాం వాసులు నమ్ముతారు. ఈ దెయ్యాలు ఎక్కువగా మగవారిని చంపుతాయట.
22. పువాలి భూత్…. ఈ దెయ్యాలు ఇండ్లలో ఉండే వస్తువులను దొంగిలిస్తాయట. ” చెప్పడం ఆపాను.
>>>>>>>>>>>>>>>>>>>
PL.READ IT ALSO………………………. దెయ్యంతో ఇంటర్వ్యూ 3