The new friendship………………………………………………………..
రాబోయే 2024 సార్వత్రిక ఎన్నికల్లో విపక్షాల తరపున ప్రధాని అభ్యర్థి గా బరిలోకి దిగేందుకు ముగ్గురు నేతలు పోటీ పడుతున్నారు. ఇప్పటికే రేసులో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ , తెలంగాణ సీఎం కేసీఆర్ రంగంలో ఉండగా తాజాగా బీహార్ సీఎం జేడియూ అధినేత నితీశ్ కుమార్ కూడా సై అంటున్నట్టు వార్తలు వస్తున్నాయి.
అయితే ఆ విషయం నితీష్ పైకి చెప్పడం లేదు. 2024 పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా ఆయన పావులు కదుపుతున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ కి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు.రాహుల్ తో చర్చల తర్వాత నితీష్ మరింత చురుగ్గా బిజేపీయేతర పార్టీ నేతలను ఏకతాటిపైకి తెచ్చే యత్నాలను ముమ్మరం చేశారు.ఇందులో భాగంగా ఆయన సీపీఐ నేత రాజాను, అరవింద్ కేజ్రీ వాల్ ను కలిశారు.
ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ సహా మిగతా రాజకీయ పార్టీల నేతలను కలుసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు . వీరందరితో ఆయన చర్చలు జరపనున్నారు. ప్రతిపక్షాల ప్రధాని అభ్యర్ధి ఎవరనే దానిపైనా ప్రాథమిక చర్చలు జరిపే అవకాశం ఉంది. ముఖ్యంగా నితీశ్ మోడీ వ్యతిరేకులందరినీ ఒకే తాటిపైకి తీసుకువచ్చే ప్రయత్నాలు మొదలు పెట్టారు.
ఇక మోడీ పైన,ఎన్డీయే ప్రభుత్వంపైన యుద్ధం ప్రకటించిన టీఆర్ఎస్ అధినేత, కేసీఆర్ కొంతకాలంగా బీజేపీయేతర పక్షాల నేతలతో వరుస సమావేశాలు జరిపారు. తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ కూడా అంతకు ముందు విపక్ష నేతలతో మాట్లాడారు. ఇంతవరకూ బాగానే ఉన్నప్పటికీ అందరి మధ్య ఐఖ్యత కుదరడలేదు.అది అంత సులభమైన విషయం కూడా కాదు.
కాంగ్రెస్ తరపున ప్రధాని అభ్యర్థిగా రాహుల్ బరిలోకి దిగుతారు. రాహుల్ ప్రధాని అభ్యర్థి అంటే మమతా ,కేసీఆర్ లు ముందుకు రారు. నితీష్ తన సర్కార్ కి కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది కాబట్టి ఒకే అనవచ్చు. లేదంటే నితీష్ కూడా ఎన్నికల నాటి పరిస్థితి ని బట్టి వేరే నిర్ణయం తీసుకోవచ్చు. అవసరాన్ని బట్టి నితీష్ విధేయత మారుస్తారని అందరికి తెలిసిందే.
ప్రతిపక్ష పార్టీల నేతలంతా కూర్చుని చర్చించుకుని, ఏకాభిప్రాయానికి వస్తామని చెబుతున్నప్పటికీ అది కూడా ఈజీ కాదు. ప్రస్తుతానికి దక్షిణాది నుంచి కేసీఆర్, ఉత్తరాది నుంచి నితీశ్ ఏకకాలంలో మోదీపై అస్త్రాలు ఎక్కుపెట్టారు.
రాబోయే కొద్ది రోజుల్లో మరింత మంది నాయకులు రంగంలోకి దిగవచ్చు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అందులో ఒకరు. వీరందరిలో మోడీ ని ఎదుర్కొని నిలిచే సత్తా ఎవరికుందో ? కాంగ్రెస్ లీడ్ తీసుకుంటే చిన్న పార్టీలు రాహుల్ కే మద్దతు పలకవచ్చు.రాహుల్ పాదయాత్ర కు వచ్చే స్పందనను బట్టి కూడా ఇతర నేతల్లో మార్పు రావచ్చు. కొద్ది రోజులు పోతే గానీ రాజకీయ సమీకరణాలు ఎలా ఉంటాయో తేలదు.