A great storyteller………………………..
ఒకప్పుడు హరికథలు అంటే జనాలు పెద్దఎత్తున వచ్చేవారు. శ్రీరామనవమి, వినాయక చవితి పందిళ్లలో లేదా పెద్ద దేవాలయాల వద్ద ఈ హరికథా కాలక్షేపం జరిగేది. రాత్రి తొమ్మిది నుంచి రెండు .. మూడు గంటల పాటు హరికథా భాగవతార్లు వివిధ పౌరాణిక కథలు జనరంజకంగా చెప్పి అలరించేవారు.. టీవీలు వచ్చాక ఈ హరికథలు క్రమంగా కనుమరుగు అయ్యాయి..
హరి కథలు చెప్పడమంటే మాటలు కాదు. అందుకు అద్భుతమైన సంగీత, పాండిత్య ప్రతిభ అవసరం. అది అందరికి అబ్బే విద్య కాదు. ఈ తరం లో చాలామందికి హరికథ అంటే తెలియదు. హరికథ అనేది తెలుగు వారి సంప్రదాయంలో ఒక భాగం. సంగీత, సాహిత్య, నృత్య, అభినయాల సమ్మేళనమే ఈ హరికథ .. ఇదొక అద్భుత కళారూపం.
నారద మహర్షి తన మహతిని మీటుతూ హరినామాన్ని కీర్తిస్తూ.. ముల్లోకాలు తిరిగేవాడు. ఆయన ఎపుడు హరికథ చెబుతూ సంచరిస్తూ ఉండేవాడని మనం చదువుకున్నాం .. నాటకాల్లో .. సినిమాల్లో చూసాం. ఒక వీణ తప్ప … అదే ఆహార్యంతో హరికథకులు కూడా ఈ కళా రూపాన్నిప్రదర్శించేవారు.
హరికథకులనగానే మనకు గుర్తు కువచ్చే మొదటి పేరు ఆదిభట్ల నారాయణ దాసు. ఆదిభట్ల వారు తన మనోహర రూపం తో, సంగీత , పాండిత్య ప్రతిభతో ,అనితరసాధ్యమైన రీతిలో హరికథను చెప్పేవారు . హరికథా ప్రక్రియ కు ఒక ఒరవడిని సృష్టించిన ఖ్యాతి ఆయనది. అందుకే ఆదిభట్ల వారు హరికథా పితామహుడి గా గణుతికెక్కారు.
ఆయన తర్వాత కోట సచ్చిదానంద శాస్త్రి మంచి హరికథకుడిగా గుర్తింపు పొందారు. ఆయన కథ చెప్పే విధానం గంగా ప్రవాహంలా సాగిపోతుంది. తన అద్భుతమైన, అనర్గళమైన వాక్పటిమతో, శ్రావ్యమైన సంగీత, నాద, తాళ పాండిత్యంతో, శ్రోతలను రసమాధుర్యంలో ఓలలాడించే వారు.
కోట వారు ఆకర్షణీయమైన ఆహార్యంతో … మృదుమధురం గా పాడుతూ, ముఖంలో హావభావాలను ప్రదర్శిస్తూ .. మరోవైపు తగిన నృత్య రీతిని అనుసరిస్తూ అభినయించే వారు. హరి కథ చెబుతూనే సందర్భానుసారం గా ఎన్నో పిట్ట కధలు చెప్పి అలరించేవారు.
కోట వారు .. మంచి ఛాయ, ఒడ్డు, పొడుగు ఉన్న వారు. గిరజాల జుత్తు ఫాలభాగాన కదులుతుండగా, చేతిలో ఉన్న చిరుతలను కదిలిస్తూ పాడుతున్న పద్యానికి, పాటకు లయాత్మకంగా నర్తించే వారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన హరికథ చెప్పే తీరు అద్భుతం…. నభూతో నభవిష్యత్ .. ఆయన హరికథలు చూసిన వారు ఎప్పటికి మర్చిపోలేరు.
ఆయన అభిమానుల్లో సామాన్య ప్రేక్షకులే కాదు ప్రముఖులైన మంగళం పల్లి బాలమురళి కృష్ణ, ఈమని శంకరశాస్త్రి, ఎస్. పి. బాలు వంటి వారు ఉండటం విశేషం. ఆకాశవాణిలో కూడా ఆయన ఎన్నో హరి కథలు చెప్పారు. అటుఇటుగా 20 వేల హరికథలు చెప్పారు. ఎందరో శిష్యులను తయారు చేశారు.
కోట సచ్చిదానంద శాస్త్రి ప్రతిభ ను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం గత ఏడాది పద్మశ్రీ పురస్కారం తో సత్కరించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయన పద్మశ్రీ అవార్డు అందు కున్నారు. గతంలో ఏ కథకుడికి ఈ పురస్కారం దక్కలేదు .. కోట వారినే వరించడం విశేషం.
ఇప్పటి బాపట్ల జిల్లా అద్దంకి గ్రామంలో 1934 ఆగస్టు 12 వ తేదీన జన్మించిన కోట గుంటూరు లో స్థిరపడ్డారు. పదమూడు సంవత్సరాల వయసుకే తండ్రి గారి మరణం తో ఓ పెద్ద కుటుంబ పోషణ భారాన్ని నెత్తిన వేసుకున్నారు. అప్పటినుంచే హరికథలు చెప్పడం మొదలెట్టారు.. ఆ క్రమంలోనే రామాయణ, భారత, భాగవతా లను క్షుణ్ణం గా చదివి ఆకళింపు చేసుకున్నారు. సినిమా పాటల బాణీ లు హరికథలో జొప్పించి పామర జనాలను మెప్పించారు. ఈ అంశంపై కొన్ని విమర్శలు కూడా వచ్చేయి.