Why are Hijras joining Nagasadhus?
నాగ సాధువుల సమూహాల్లోకి హిజ్రాలు, ట్రాన్స్ జెండర్స్ కూడా చేరుతున్నారు. నాగ సాధువుల జీవన శైలి పట్ల ఆకర్షితులై హిజ్రాలు కూడా దీక్షలు చేపట్టి సాధువులుగా మారుతున్నారు, వీరంతా ప్రత్యేకంగా ఒక అకడాను కూడా ఏర్పాటు చేసుకున్నారు.
చాలా మంది హిజ్రాలు, ట్రాన్స్ జెండర్స్ సామాజిక బహిష్కరణ, వేధింపుల బారి నుంచి బయటపడి నాగ సాధువుగా మారి ఆధ్యాత్మిక జీవనం గడపాలని సన్యాసం స్వీకరిస్తున్నారు. ఈ హిజ్రాల అకడా ను “కిన్నెరా అకడా”అంటారు.
ఈ అకడా కు’లక్ష్మీ’గా మారిన లక్ష్మి నారాయణ్ త్రిపాఠి నాయకత్వం వహించారు. దేశంలోని ఎల్‌జిబిటి సమాజంలో ప్రముఖులుగా గుర్తింపు పొందిన లక్ష్మి నారాయణ్ త్రిపాఠి 2011 లో రియాలిటీ టివి షో “బిగ్ బాస్” లో కనిపించి పాపులర్ అయ్యారు.
మనదేశంలో దాదాపు 20 లక్షల మంది హిజ్రాలు ఉన్నట్టు అంచనా. వీరిని స్త్రీ, పురుషుల తర్వాత మూడో లింగంగా గుర్తిస్తూ 2014లో సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు ఇచ్చింది. ఆ దరిమిలా 2015 లో ‘లక్ష్మి’ నేతృత్వంలో ఈ కిన్నెర అకడా ఏర్పడింది.
హిందూ పురాణాలు, ఇతిహాసాల్లో కూడా ట్రాన్స్ జెండర్ల ప్రస్తావన చాలా చోట్ల ఉందని, ట్రాన్స్ జెండర్లు వారి లింగ గుర్తింపు కారణంగా బహిష్కరణకు గురయ్యారని, తీవ్ర వివక్షకు గురవుతున్నారని హక్కుల సంస్థలు చాలాకాలంగా వాదిస్తున్న విషయం తెలిసిందే. కాగా చాలామంది హిజ్రాలు ఈ సాధు సంఘంలో చేరారు.
నాగ సాధువులకు వర్తించే నియమాలు వీరికి వర్తిస్తాయి.అయితే వాటిని తట్టుకుని వీరు నిలబడగలరా ? కఠోర నిష్ఠతో వ్యవహరించగలరా అనేది పెద్ద ప్రశ్నే. వీరి వేషధారణ కొంచెం భిన్నంగా ఉంటుంది. ప్రస్తుతం దేశంలో మగ నాగ సాధువుల,మహిళా నాగసాధువులు కోసం 13 అకడాలు (సంఘాలు ) పనిచేస్తున్నాయి. వీటికి ‘అఖిలభారత అకడా పరిషత్’ గుర్తింపు ఉన్నది.
ఈ గుర్తింపు ఉంటేనే వీరికి కుంభ మేళా సమయంలో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసుకోవటానికి ఊరేగింపుగా వెళ్లి గంగాజలాల్లో పవిత్ర స్నానం చేసే వీలుంటుంది.లేదంటే ఏదైనా ‘అకడా’ కు అనుబంధంగా ఉంటూ ఆ సంఘం వారితో కలసి శిబిరాలు ఏర్పాటు చేసుకుని ..స్నానాలకు వెళ్లాల్సి ఉంటుంది.
“కిన్నెరా అకడా”అఖిలభారత అకడా పరిషత్ గుర్తింపు కోసం గట్టి ప్రయత్నం చేసింది. అందరికి సంఘాలు ఉన్నపుడు హిజ్రాలకు మాత్రం సంఘం ఎందుకు ఉండకూడదని కిన్నెరా అకడా సభ్యులు వాదించారు.అయితే,తమవి శతాబ్దాల కిందటి అకడాలని.. కొత్త సమూహాన్ని అంత సులభంగా అంగీకరించలేమని అఖిల భారత అకడా పరిషత్ చెప్పుకొచ్చింది.
మొత్తం మీద ‘కిన్నెరా అకడా’ కు గుర్తింపు లభించలేదు. 2019 కుంభ్ సమయంలో ‘జునా అకడా’ లో కిన్నెరా అకడా విలీనమైంది.ఆమేరకు రాత పూర్వక ఒప్పందాలు కూడా జరిగాయి. ఆతర్వాతనే 2019 కుంభ స్నానాలలో పాల్గొనేందుకు ‘కిన్నెరా అకడా’సభ్యులకు అవకాశం కల్పించారు.
ఆది శంకరాచార్యులు ఏడు అకడాలను స్థాపించారు. అవి మహ నిర్వాణి, నిరంజని, అటల్, అవహాన్,అగ్ని,ఆనంద,నిర్వాణి గా గుర్తింపు పొందాయి.ఆ తర్వాత కొన్నేళ్ళకు నిర్మల్ పంచాయతీ,నిర్మోహి,దిగంబర్,జూనా,ఉదసిన్ బారా,ఉదసిన్ నయాల పేరిట మరో ఆరు అకడాలు ఏర్పడ్డాయి. తరువాత, వైరాగి అకడా (సిక్కు సాధులతో ) ఏర్పడింది. కానీ దీనిని స్వతంత్ర అకడా గా పరిగణించలేదు.
తాజాగా ఈ ‘హిజ్రాల అకడా’ నాయకురాలు లక్ష్మి తమ సంఘానికి ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు.వచ్చే మౌని అమావాస్య జనవరి 29 న పెద్ద కార్యక్రమం చేపట్టే ప్రయత్నాలు చేస్తోంది.
అమెరికా,బ్రిటన్, ఫ్రాన్స్,జర్మనీ సహా మరి కొన్నిదేశాలకు చెందిన 60 మంది ట్రాన్స్ జెండర్స్ పిలిపించి వారిలో కొందరికి మండలేశ్వరుడు, మహామండలేశ్వరుడు, జగద్గురువు అనే బిరుదులు ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ట్రాన్స్ జెండర్స్ పంచవ్యాప్తంగా గౌరవం పొందడమే కాకుండా, అకడా ప్రపంచవ్యాప్తంగా కూడా విస్తరించవచ్చని భావిస్తున్నారు.
—————– KNMURTHY