ఆమె సినిమా జీవితం సూపర్ హిట్!!

Sharing is Caring...

Showed ability…..

లేడీ అమితాబ్‌గా గుర్తింపు పొందిన నటి విజయశాంతి చిత్ర పరిశ్రమ కొచ్చి 45  సంవత్సరాలు అవుతోంది.1966 లో వరంగల్లో జన్మించి, మద్రాసులో పెరిగారు విజయశాంతి. పిన్ని విజయలలిత అలనాటి తెలుగు సినిమా నటే. విజయశాంతి అసలు పేరు శాంతి. పిన్ని విజయ లలిత పేరు లోని విజయ ను తీసుకుని  విజయశాంతిగా మారారు.

ఆమెను తెరకు పరిచయం చేసింది ప్రముఖ తమిళ దర్శకుడు భారతీరాజా.ఆయన దర్శకత్వంలో 1979లో వచ్చిన తమిళ సినిమా కల్లుక్కుళ్ ఈరమ్  కథానాయికగా విజయశాంతి మొదటి సినిమా. తెలుగులో విజయశాంతి తొలి చిత్రం  కిలాడి కృష్ణుడు. ఈ చిత్రంలో హీరో సూపర్ స్టార్ కృష్ణతో ఆమె నటించింది. ఈ చిత్రానికి దర్శకురాలు విజయనిర్మల. అంతకు ముందు బాలనటిగా కొన్ని చిత్రాల్లో కూడా నటించారు.

విజయశాంతి కథానాయికగా పరిచయమైన మొదటి నాలుగు సంవత్సరాల పాటు గ్లామర్ పాత్రలు పోషించింది.ఎన్టీయార్, ఏయెన్నార్‌ల హీరోలుగా నటించిన  ‘సత్యం – శివం’లో ఆమె పోషించిన పాత్ర కొద్దిగా చెప్పుకోతగ్గది. మొదట్లో  ఆమె ఎక్కువగా తమిళ చిత్రాల్లోనే నటించింది. విజయశాంతికి తెలుగులో నటిగా గుర్తింపు తెచ్చిన సినిమా టి.కృష్ణ దర్శకత్వంలో ఈ తరం సంస్థ 1983లో నిర్మించిన ‘నేటి భారతం’ .. అక్కడనుంచి ఆమె వెను తిరిగి చూడలేదువరుసగా మంచి చిత్రాల్లో నటించారు.

అప్పటికే తెలుగు తెరపై జయసుధ, జయప్రద,శ్రీదేవి, మాధవి వంటి వారు  మంచి పొజిషన్ లో ఉన్నారు.రాధ, సుహాసిని, రజని, రాధిక వంటి తారలు కూడా అప్పట్లోనే పరిశ్రమ కొచ్చారు.  నేటి భారతం చిత్రంలో తన నటనకు మొదటిసారిగా ఉత్తమ నటిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి నంది అవార్డును కూడా గెలుచుకుంది. కొన్నాళ్ళు కొన్ని మంచి పాత్రలు ,గ్లామర్ పాత్రల్లో నటించి విజయశాంతి ప్రేక్షకులను అలరించారు. 

1985 నటిగా విజయశాంతి విశ్వరూపం ప్రదర్శంచిన సంవత్సరం. ఆ ఏడాది వందేమాతరం, దేశంలో దొంగలు పడ్డారు, దేవాలయం, ప్రతిఘటన వంటి చిత్రాల్లో కథానాయిక పాత్రల్లోనూ నటించారు.అగ్ని పర్వతం, పట్టాభిషేకం, చిరంజీవి, దర్జా దొంగ, ఊరికి సోగ్గాడు, శ్రీవారు వంటి చిత్రాల్లో గ్లామర్  పాత్రలు పోషించారు.ప్రతిఘటన చిత్రంలో తన అద్భుత నటనకు గాను రెండవసారి ఉత్తమ నటిగా నంది అవార్డును గెలుచుకోవటమే కాకుండా ప్రేక్షకులలో ఆమెకంటూ ప్రత్యేకమయిన అభిమాన వర్గాన్ని సంపాదించుకుంది.

1990 జూన్ నెలలో వచ్చిన కర్తవ్యం విజయశాంతి నట జీవితాన్ని మరో మలుపు తిప్పింది. ఐ.పీ.ఎస్. అధికారిణి కిరణ్ బేడీ స్ఫూర్తితో, మోహన గాంధీ దర్శకత్వంలో తను కథానాయిక పాత్ర పోషిస్తూ తన సొంత ప్రొడక్షన్‌ సూర్యా మూవీస్ పతాకంపై విజయశాంతి నిర్మించిన ఈ చిత్రం ఘన విజయం సాధించడమే కాకుండా ఆమెకు మరో రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డుతో పాటు, కేంద్ర ప్రభుత్వ ఉత్తమ జాతీయ నటి అవార్డులను సంపాదించిపెట్టింది.

అప్పటినుంచి  లేడీ అమితాబ్, యాంగ్రీ యంగ్ ఉమన్, ఫైర్ బ్రాండ్ లాంటి బిరుదులు కూడా వచ్చాయి. ఒక్క సారిగా తెలుగు సినిమా పరిశ్రమలో టాప్‌పొజిషన్ లోకి వెళ్లారు.1993 లో వచ్చిన పోలీస్ లాకప్ తరువాత వరుసగా రెండేళ్లపాటు ఆమెకు సిల్వర్ జూబ్లీ సినిమాలు కరువయ్యాయి. దానితో ఆమె 1996 లో ఒక్క తెలుగు చిత్రంలోనూ నటించలేదు. ఏడాది పాటు విజయశాంతి సినిమా అనేది థియేటర్లలో కనిపించలేదు.

ఈ క్రమంలోనే  1997 మార్చి 7 న విడుదలయింది ‘ఒసేయ్ రాములమ్మా’. దాసరి నారాయణ రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రం విడుదలయిన మొదటి రోజు నుంచి అన్ని అంచనాలనూ మించిపోతూ  చిత్రపరిశ్రమ  రికార్డులను బద్దలు కొట్టిందీ.ఈ చిత్రంలో నటనకు గాను నాలుగోసారి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉత్తమ నటిగా నంది అవార్డు అందుకున్నారు.

అప్పటి నుంచి  రాములమ్మగా పిలవడం ప్రారంభించారు. ఆ తర్వాత లాంగ్ బ్రేక్‌ తీసుకుని హీరో మహేశ్‌ బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చింది. కథా పరంగా ప్రాధాన్యత  ఉండే పాత్రలనే విజయ శాంతి అంగీకరిస్తోంది.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!