Taadi Prakash …………………………………
Old man and the sea of telugu literature ……………………………….
టీషర్ట్ టక్ చేసుకుని షోగ్గా, హుందాగా, ఓ మల్టీ నేషనల్ కంపెనీ సీఇవోలా వుంటారు. రచయితలా అనిపించరు. మోహన్ కామెంట్లని ఎంజాయ్ చేసేవాడు. ‘‘అసలు మీరెవరండీ, రాసినవి పది కథలు, మీరెవరికీ తెలీదు. అదే నేనైతే Millions of telugu people will recognise me with my signature’’ అన్నాడో సారి మోహన్.
‘‘ఏదో లెండి, మేం చిన్నవాళ్లం కదా’’ అని రావుగారి హంబుల్ రిపార్టీ! ఓ సారి ఆయన మోహన్ ఆఫీసుకొచ్చారు. ఒక టేబుల్ అయిదారు కుర్చీలు, బొమ్మలు వేసుకునే తెల్ల షీట్లూ, రంగులు, బ్రష్షులూ…అంతే! నేను బ్లూరిబండ్ జిన్ తెప్పించాను. రా.రావుగారు సిప్ చేస్తూ, బావుంది మోహన్…. “I like your bohemian way of life” అన్నారు. నెల తర్వాత ఆయన దగ్గరకు వెళ్తే, ఖరీదైన విస్కీలు పక్కన పెట్టి జిన్ తాగుతున్నాయరాయన. మేం ఆశ్చర్యపోయాం.
మరోసారి ఆఫీసుకొచ్చి, ఆయన ఖరీదైన కార్లో నన్నూ, మోహన్నీ, టాంక్ బండ్ చివర వుండే బోట్స్ క్లబ్ కి తీసికెళ్లారు. ఆయన లోపలికి వెళ్లారు. మమ్మల్ని సెక్యురిటీ గార్డు ఆపేశాడు. నాకు అర్థమే కాలేదు. నవ్వుతూ వెనక్కొచ్చిన రావు గారు ‘‘allow them’’ అన్నారు. బూట్లు లేకపోతే లోనికి పంపరని తెలిసింది. రెండు జతల బూట్లు తెచ్చిచ్చారు. చెప్పులు బైట పెట్టి, బూట్లేసుకుని వెళ్లాం. మధ్యాహ్నం. చల్లని ఏసీహాలు. జనం దాదాపు లేరు. మంచి ఫ్రెంచి బ్రాందీ ఆర్డర్ చేశారు.
రా.రావుగారు కొత్తగా రాసిన కథ బైటికి తీశారు. డీటీపీ చేసిన కాగితాలు. మోహన్ చదివాడు. నేనూ చదివా. కథ మీకు ఏం అర్థమైంది? అని అడిగారు. చెప్పాను. పాయింట్ కరెక్టుగా పట్టుకున్నానని ముచ్చట పడ్డారు. ఆ కథలో మూడు చిన్న మాటల్ని మార్చి, సజెస్టివ్ గా మరో మూడు మాటలు రాసి ఆయనికి ఇచ్చాను. ‘‘…seems you are an editor’’ అని చిన్న పాజ్ యిచ్చి, ‘‘I am accepting your corrections” అన్నారు. చెప్పేదేముంది.
తర్వాత బ్రాందీలో నేను నీళ్లసలు కలుపుకోనే లేదు! అది ‘సామి కుంబుడు’ అనే గొప్ప కథ. ఇలా మా స్నేహం నల్లేరు మీద చిన్న కథలా, చిత్రకళలా నడిచిపోయింది, చాలా ఏళ్లు. ఆయనకి 80 ఏళ్లు వచ్చినపుడు అనుకుంటా, రావు గారింట్లో పెద్ద పార్టీ. హైద్రాబాద్ లోని cream of telugu literature అంతా కలిసి ఎంజాయ్ చేసింది. నిజమైన సెలబ్రేషన్ అది. ఇప్పుడాయన వయసు 88 సంవత్సరాలు. అదే అందమైన నవ్వు. చెక్కు చెదరని ఆరోగ్యం.
రోజూ ఉదయాన్నే కార్లో 30, 40 కిలోమీటర్లు షామీరుపేట వెళ్లి గోల్ఫ్ ఆడతారు. కంఫర్ట్ బుల్ లైఫ్. భార్యా, కూతురూ వున్నారు. చీకూ చింతా ఏమీ లేనట్టే వుంటారాయన! సి.రామచంద్రరావు గార్ని గనక కలవకపోతే జీవితంలో అమూల్యమైన పేజీనొక దాన్ని నేను పోగొట్టుకున్నట్టే. sound of Music లో… “Girls in white dresses with blue satin sashes, snowflakes that stay on my nose and eyelashes. Silver white winters that melt into springs… these are a few of my favorite things!” అంటూ హీరోయిన్ జూలీ ఆండ్రూస్ పాడే పాటలాగా, రావుగారు నాకు యిష్టమైన వాళ్లలో కెల్లా యిష్టమైన వాడు.
బాల గంగాధర తిలక్ రాసిన ‘సిఐడీ రిపోర్టు’ కవితలో క్లర్కు అయినాపురం కోటేశ్వరరావు, చనిపోయే ముందు రోజు అడుగుతాడు. ‘‘సుఖమంటే ఏమిటి? ఎలా వుంటుంది? ఎక్కడ దొరుకుతుంది?’’ అని! డబ్బుకి కొదవలేని upper strataకి చెందిన highly sophisticated వ్యక్తిగా, మంచి టెన్నిస్ ప్లేయర్ గా, ఆయన కావాలనుకుంటే, పొద్దున్నే హీత్రూలో దిగి వింబుల్డన్ ఫైన్సల్స్ చూసి, మారియా షరపోవాతో రెండు పెగ్గుల వైన్ తాగి, సాయంకాలానికి రోలాండ్ గారోస్ లో మెకన్రోని పలకరించి, యురోపియన్ విస్కీ రుచి చూసి, రాత్రికే షంషాబాద్ చేరుకుని ఇంటికెళ్లి రెస్టు తీసుకోవచ్చు.
పారిస్ ఫైవ్ స్టార్ లో చికెన్ టిక్కా కుదర్లేదని కంప్లయింట్ కూడా చేయొచ్చు. అలాంటివి ఎన్నో చూసినవాడు. కోట్లు, విమానాలు ఆయనకి కొత్త కాదు. సుఖం ఆయనకో లెక్క కాదు. ఏది ఏమైనా, రావుగారెన్ని ఆకాశపు అంచుల్ని తాకినా, ఆయన్ని గాఢంగా పెనవేసుకున్నవీ, మనసు పొరల్లో మెదిలేవీ, చేతులు సాచి తండ్రీ అంటూ అమృతాన్ని అందించేవీ ఆ పది కథలు మాత్రమే!
1. వేలుపిళ్లై 2. నల్లతోలు 3. ఏనుగుల రాయి 4. టెన్నిస్ టోర్నమెంట్ 5. ఉద్యోగం 6. గాళి దేవరు 7. ఫ్యాన్సీ డ్రస్ పార్టీ 8. కంపెనీ లీజ్ 9. క్లబ్ నైట్ 10. సామి కుంబుడు. అవును. రామచంద్రరావుగారి ఆస్తి, సంపద, రెండు చేతుల్తో పోగు చేసుకున్న నిధి నిక్షేపాలూ… ఆ పది కథలే! ఒకడు దశ కంఠుడు! ఒకడు దశ కథకుడు!! ఆ పది కథల్లోనే రామచంద్రరావు జీవిస్తారు. అదే ఆయనకిష్టం కూడా.
పిడకల వేట అను పుల్లయ్య కథ: ఫామిలీ పార్టీలన్నిటికీ మోహన్నీ, నన్నూ తప్పక పిలిచేవారు. రామచంద్రరావుగారి ఇంట్లో ఒక మంచి పార్టీ. రావుగారి చుట్టూ పది మంది దాకా మేము. అటు ఎవరో ఒక పెద్దావిడ.. చుట్టూ ఆడవాళ్లు. స్త్రీలంతా రెడ్ వైన్ నడిపిస్తున్నారు. గ్రేస్ ఫుల్ గా, ఉత్సాహంగా కబుర్లు చెబుతున్న పెద్దావిడ, అస్సలు ఇర్రెసిస్టబుల్. నెమ్మదిగా నేను ఆవిడ పాదాల దగ్గర చేరాను. ఎవరు ఏంటి అని అడిగాను. ‘‘నేను పుల్లయ్య గారి కూతుర్ని’’ అని చెప్పింది.
డైరెక్టరు పుల్లయ్య గారా? అంటే శాంతకుమారి కూతురా మీరు? అనడిగాను. ‘‘శాంతకుమారి మా అమ్మ’’ అని చెప్పింది గర్వంగా. పద్మ అనుకుంటా ఆవిడ పేరు. తెగ కబుర్లు చెబుతోంది. నేను జర్నలిస్టుని. గుర్తుండిపోయే సినిమా విశేషం ఒకటి చెప్పండి. Don’t disappoint me అన్నాను. ‘‘మాకో డ్రైవర్ వుండేవాడు నాన్నా’’ అని మొదలు పెట్టింది. ‘‘మా నాన్న పుల్లయ్యకి వాడు లేకపోతే గడవదు.
‘‘నా గుడిసెలో ఒక పిల్ల వుంది. దానికి చిన్న వేషం యిప్పించండి’’ అని డ్రైవరు విసిగించేవాడు. ‘‘పోరా వెధవా’’ అనేవాడు నాన్న. ‘‘వాడు వినేవాడు కాదు. ఆరు నెలల తర్వాత, పుల్లయ్య గారి సినిమా షూటింగ్. అందులో ఒక పడుచుపిల్ల చెట్టెక్కి కూచోవాలి. అలా చాలా గంటలు కూచోవాలి. ఎవరు దొరుకుతారు?’’ అని నాన్న చూస్తున్నారు. అప్పుడు డ్రైవర్ గాణ్ణి పిలిచి, ‘‘వోరేయ్. ఆ పిల్లని పట్రా’’ అన్నారు. మర్నాడు పొద్దున్నే ఆ అమ్మాయిని చెట్టెక్కించారు.
చెట్టు కింద అయిదారు గంటల సేపు షూటింగ్. పాపం ఆ పిల్ల అలా కొమ్మ మీదే కూర్చుని వుంది’’ అని ముగిస్తూ ‘‘ఇంతకీ ఆ పిల్లెవరో తెలుసా నాన్నా’’ అనింది. ఎవరు అని అడిగా. ‘‘ఇంకెవరు మన వాణిశ్రీ’’ అని చెప్పింది. ‘‘నాకు మీరు బాగా నచ్చారండీ… నాతో వచ్చెయ్ కూడదూ… పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను’’ అన్నాను.
నా భుజమ్మీద ఆవిడ చెయ్యివేసి, మరో చేత్తో గ్లాసులో వైన్ పూర్తి చేసి, ‘‘నువ్వా చిన్న వాడివి. నాకు 72 ఏళ్లు. నీతో వచ్చేస్తా. నాకెలాంటి అభ్యంతరమూ లేదు, అయితే ఈయనకో మాట చెప్పు. పర్మిషన్ తీసుకో’’ అందావిడ. సోఫాలో 75 ఏళ్ల ఆయన కూర్చుని వున్నాడు… ఆమె భర్త! నవ్వుకున్నాం అందరం మరో రౌండ్ వైన్ పోసుకుంటూ!