దృశ్యకావ్యమే .. జనాలకు ఎందుకు నచ్చలేదో ?

Sharing is Caring...

Subramanyam Dogiparthi ………………………………….

సంగీత సాహిత్యాల సమ్మేళవింపు . నాకయితే ఓ దృశ్య కావ్యం . నాకిష్టమైన సినిమాలలో ఒకటి 1969 లో వచ్చిన ఈ ఏకవీర సినిమా . తెలుగులో తొలి ఞాన పీఠ పురస్కార గ్రహీత విశ్వనాథ సత్యనారాయణ గారి నవల.1930 దశకంలో  భారతి మాస పత్రికలో సీరియల్ గా ప్రచురితమై బ్రహ్మాండమైన పేరు తెచ్చుకుంది. 

1960 ప్రాంతంలో NTR , ANR లతో ఈ నవల సినిమాగా రాబోతుందని తెగ చెప్పుకునే వారు.చివరకు సి యస్ రావు దర్శకత్వంలో NTR , కాంతారావులతో నిర్మించారు.కాంతారావే కరెక్ట్ .విశ్వనాథ వారికి ఏకవీర అనే పేరు ఎలా స్ఫురించిందో ! అద్భుతమైన పేరు . అష్టాదశ పీఠాలలో ఒకటి ఏకవీర. అయినా ఎందుకనో చాలా చాలా అరుదుగా వింటుంటాం ఈ పేరు.  నాకు ఈ పేరు కూడా చాలా ఇష్టం. 

మరో జ్ఞాన పీఠ పురస్కార గ్రహీత సి నారాయణరెడ్డి  సంభాషణలు వ్రాసిన మొదటి చిత్రం. ఆ మాటలు సినిమా మాటల్లాగా ఉండవు . ఓ కావ్యంలోని మాటల్లాగా ఉంటాయి. ఈ సినిమాలో మెచ్చుకోవలసింది సంగీత , సాహిత్యాలు . కె వి మహదేవన్ సంగీతంలో పాటలన్నీ ఇప్పటికీ హిట్టే. నాకు అత్యంత ఇష్టమైన పాటలు సి నారాయణరెడ్డి వ్రాసిన ‘తోటలో నారాజు తొంగి చూసెను నాడు’ , దేవులపల్లి వారు వ్రాసిన ‘ప్రతీ రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి’ పాటలు.

మిగిలిన పాటలు ‘ఒక దీపం వెలిగింది ఒక రూపం వెలిసింది’ , ‘కలువ పూల చెంత చేరి’ , ‘నీ పేరు తలచినా చాలు’ , ‘ఔనే చెలియా సరి సరి’ చాలా శ్రావ్యంగా ఉంటాయి . ఏ పారిజాతములనీయగలనో సఖీ పద్యం కూడా నాకిష్టం.

నాకు బాగా నచ్చిన నృత్యం రాజసులోచన భామాకలాపం కూచిపూడి నృత్య ప్రదర్శన . భామనే సత్యభామనే నృత్యం. ఈ నృత్యంతోనే ఆవిడకు బయట కూడా పేరొచ్చింది . వెంపటి సత్యం నృత్య దర్శకులు .

ఇంత గొప్ప కళాఖండం ప్రేక్షకులకు ఎందుకనో నచ్చలేదు.ఫస్ట్ రిలీజ్ అప్పుడు ఆడలేదు . రిపీట్ రన్సుల్లో డబ్బులు ఎలా ఉన్నా జనం చూసారు. ఒరిజినల్ నవల నేను చదవలేదు . నవలకు సినిమాకు అనుగుణంగా చాలా మార్పులు చేసారని , ఆ మార్పుల్లో నవలకు ఆయువుపట్టులయిన కధాంశం దెబ్బ తిన్నదని అప్పుడప్పుడు సమీక్షల్లో చదువుతూ ఉంటాం.

ఇదంతా ఎలా ఉన్నప్పటికీ సినిమా ఓ దృశ్యకావ్యమే . ఏకవీరగా కె ఆర్ విజయ , మీనాక్షిగా జమున , వీరభూపతిగా కాంతారావు గొప్పగా నటించారు.  ప్రత్యేకంగా చెప్పుకోవలసింది కుట్టాన్ సేతుపతిగా NTR నటన . Subdued గా , ధీరోదాత్తంగా , ప్రేమికుడిగా , భగ్న ప్రేమికుడిగా అద్భుతంగా నటించారు . చాలా అందంగా కనిపిస్తారు. 

16వ శతాబ్దం , మధురై ప్రాంతం నేపధ్యంలో జరిగే కధ ఈ నవల కధ. ఈ సినిమా రూపం విశ్వనాథ వారికి కూడా నచ్చలేదని అంటారు . ఏది ఏమయినా ఇప్పటి తరంలో చూడని వారెవరయినా ఉంటే మాత్రం తప్పక చూడండి . మిస్ కానే కావద్దు . కళా పిపాస లేకపోతే ఎలా? ముఖ్యంగా పాటలు , మాటలు… యూట్యూబులో ఉంది. 

నేనీ సినిమాను గుంటూరు హరిహర మహల్లో చూసా . ఒక నరసరావుపేట మిత్రుడి పెళ్ళికి గుంటూరు రావటం జరిగింది . ఆరోజే రిలీజ్ . అందులో NTR సినిమా . చొక్కాలు చినిగినా చూడాలి కదా ! ఇంత గొప్ప నవలను ఎవరయినా ఇప్పటి సాంకేతికతో మళ్ళా ఓ దృశ్య కావ్యంగా తెలుగు ప్రేక్షకులకు చూపించాలని నా ఆకాంక్ష.ఆది పురుషుడు, శాకుంతలం లాగా చెడదొబ్బకుండా పధ్ధతిగా తీసి తెలుగు వారికి అందించటం విశ్వనాథ వారికి సమర్పించే నివాళి.ఏ నిర్మాత,ఏ దర్శకుడికి మనసు కలుగుతుందో ! 

 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!