ఆ పాత్రలో ఆయన ఒదిగిపోయారా ?

Sharing is Caring...

The role of an old man in a young age……………..

1962లో విడుదలైన ‘భీష్మ’ చిత్రంలో ఎన్టీఆర్ ప్రదర్శించిన నటనకు ప్రేక్షకులు, విమర్శకుల నుండి ఎన్నో ప్రశంసలు లభించాయి. భీష్ముడి వంటి గొప్ప, పౌరాణిక పాత్రకు ఎన్టీఆర్ ప్రాణం పోశారని, ఆయన నటన అద్భుతంగా ఉందని ప్రేక్షకులు, విమర్శకులు అప్పట్లో ప్రశంసించారు.

‘భీష్మ’ చిత్రంలో నటించినప్పుడు ఎన్టీఆర్ వయసు 39 సంవత్సరాలు. ఈ సినిమా 1962 ఏప్రిల్ 19న విడుదలైంది.ఎన్టీఆర్ పుట్టిన తేదీ 1923 మే 28. ఈ లెక్కన సినిమా విడుదల సమయానికి ఆయనకు ఇంకా 39 సంవత్సరాలు నిండలేదు (38 సంవత్సరాల 11 నెలలు). అంత చిన్న వయసులోనే, నాలుగు తరాలు చూసిన కురువృద్ధుడైన భీష్ముడి పాత్రలో ఎన్టీఆర్ అద్భుతంగా ఒదిగిపోయి నటించడం విశేషం.

అది ఆయన నటనా కౌశలానికి నిదర్శనం.మహాభారతంలోని భీష్ముడి పాత్ర ఔన్నత్యాన్ని,త్యాగాన్ని, అంతర్గత సంఘర్షణను ఎన్టీఆర్ తన హావభావాల ద్వారా అద్భుతంగా చూపారు.ఆ పాత్రలో ఆయన ఒదిగిపోయిన తీరు అందరినీ ఆకట్టుకుంది. ఈ సినిమాలో యువ భీష్ముడు, మధ్య వయసు భీష్ముడు,పండు ముసలి భీష్ముడు గా నటనలో తేడా చూపడం విశేషం.

తండ్రి వివాహం కోసం యావజ్జీవం బ్రహ్మచారిగా ఉంటానని మాట ఇచ్చే సన్నివేశం, నిండు సభలో ప్రతిజ్ఞ చేసేటపుడు ..అంబ కథ వినే సమయంలో, బాణాల శయ్యపై భీష్ముడు శయనించిన భావోద్వేగభరితమైన ఘట్టాలలో ఎన్టీఆర్ నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.ఆయన నటనలోని గాంభీర్యం, హుందాతనం అభిమానులను కట్టి పడేస్తుంది. 

ఈ సినిమాలో ముఖ్యంగా ఎన్టీఆర్ నటన హైలైట్..ఆ కాలంలో సినిమా గొప్ప విజయాన్ని సాధించి, ఆయనకు నటుడిగా మరింత మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. తర్వాత కాలంలో ఎన్టీఆర్ తెలుగు చలనచిత్ర రంగంలో పౌరాణిక పాత్రలు పోషించడంలో దిట్టగా పేరుగాంచారు. ‘భీష్మ’ చిత్రం ఆయనకు విభిన్నపాత్రలు చేసేందుకు స్ఫూర్తి నిచ్చింది..

ఆయన సినీ ప్రయాణంలో  భీష్మ ఒక మైలురాయిగా నిలిచింది. ఈ పాత్ర ఆయన కీర్తిని మరింత పెంచింది.భీష్ముడి పాత్రను ఎన్టీఆర్ కాకుండా వేరే ఎవరు పూర్తి స్థాయిలో పోషించలేదు.. కొన్ని సినిమాల్లో కొందరు చేశారు కానీ వారిని ఎన్టీఆర్ తో పోల్చలేము. ‘భీష్మ’ చిత్రంలో ఎన్టీఆర్ నటన క్లాసిక్ (classic) కేటగిరీలోకి వస్తుంది. ఈ సినిమాలో నటనకు గాను ఎన్టీఆర్ కి ఎలాంటి అవార్డులు రాలేదు. ఎన్టీఆర్ తన కెరీర్‌లో ఇతర సినిమాలకు అవార్డులు అందుకున్నారు.

ఇక భీష్మ సినిమా గురించి చెప్పుకోవాలంటే దీన్ని బీఏ సుబ్బారావు నిర్మించారు. ఆయనే  డైరెక్ట్ చేశారు.. తాపీ ధర్మారావు మాటలు రాశారు. ఆరుద్ర పాటలు రాశారు. హైలో హైలెస్స హంస కదా నాపడవా… మనసులోని కోరికా తెలుసు నీకు ప్రేమిక, తెలియగా లేరే నీ లీలలు పాటలు బాగుంటాయి.రాజేశ్వరరావు మంచి ట్యూన్స్ ఇచ్చారు. పద్యాలెక్కువ. రహమాన్ కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. 

భీష్ముడి పుట్టుక నుంచి మరణం వరకు కథ నడుస్తుంది. గంగా తనయుడు గాంగేయుడు భీషణ ప్రతిజ్ఞ చేసి భీష్ముడిగా మారిన కథనం ఆకట్టుకుంటుంది.భీష్ముడి చరిత్ర గురించి తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే. కథ బోర్ కొట్ట కుండా సాగుతుంది.

ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న రోజుల్లో కర్ణుడిగా నటించిన గుమ్మడి షూటింగ్‌కి వచ్చారు.మేకప్ వేసుకుని కూర్చున్నారు. అదే మొదటిరోజు షూటింగ్ గుమ్మడికి.ఎన్టీఆర్ గురించి ఎదురు చూస్తున్నారు. షాట్‌కి పిలుపు  రాలేదు. దర్శకుడు బిఎ సుబ్బారావు దగ్గరకి వెళ్ళి ఎన్టీఆర్ ఇంకా రాలేదు.. ఎప్పుడొస్తారని ప్రశ్నించారు.దానికి బిఎ సుబ్బారావు నవ్వి, అదిగో అక్కడే కూర్చున్నాడుగా రామారావు అని చెప్పారు.

గుమ్మడి ఆశ్చర్యపోయారు. అక్కడో  కిరీటంపెట్టుకోని ఓ ముసలాయన కూర్చున్నాడు. ఈయన్ని ఎన్టీఆర్ అంటారేంటి అని గుమ్మడి సందేహపడ్డారు. దగ్గరగా వెళ్ళి చూస్తే నిజంగా ఆయన ఎన్టీఆరే. గుమ్మడి తన కళ్ళను తానే నమ్మలేకపోయారు. ఎన్టీఆర్ అంత గొప్పగా భీష్మపాత్రకి సరిపోయారు.

ఈ సినిమా నిర్మాణం జరుగుతుండగానే బిఎ సుబ్బారావు ఒకసారి విజయా చక్రపాణి ని కలిశారు. ఎన్టీఆర్ భీష్ముడిగా భలే సూట్ అయ్యారు. ఆ మేకప్ లో నేనే గుర్తుపట్టలేకపోయాను అని చక్రపాణి తో అన్నారట.వెంటనే చక్ర పాణి స్పందిస్తూ ఎన్టీఆర్ ని గుర్తు పట్టనపుడు ఆ పాత్ర ఆయన చేసి ప్రయోజనం ఏముంది? మీరే వేస్తె సరిపోయేదిగా అని జోక్ చేశారట. 

 

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!