పై ఫొటోలో కనిపించే ‘నందాదేవి’ దేశంలో ఎత్తైన మంచు పర్వతం. ఇవాళ ఈ పర్వతం లో పగుళ్లు ఏర్పడి కొంత భాగం విరిగి పడి ఉత్తరాఖండ్ లో వరదలు వచ్చాయి. కాంచన్ జంగా తరువాత దేశంలో నందా దేవి రెండవ ఎత్తైన పర్వతం. ఈ పర్వతం చాలా మటుకు హిమానీనదంతో నిండి ఉంటుంది. ఇది గర్హ్వాల్ హిమాలయాల్లో భాగం గా ఉంది. ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో ఈ పర్వతానికి ఒకవైపు రిషి గంగా లోయ, మరోవైపు గోరి గంగా లోయ ఉన్నాయి. హిమానీ నదం నందా దేవి అభయారణ్యం లోపల నుంచి పశ్చిమాన రిషి గంగలోకి ప్రవహిస్తుంది. నందా దేవి ఉత్తర, నందా దేవి దక్షిణ హిమానీనదాలు 19 కిలోమీటర్ల పొడవుతో.. సముద్ర మట్టానికి 7,108 మీటర్ల ఎత్తులో ఉన్నాయి. సంవత్సరం పొడుగునా ఇక్కడ మంచు కురుస్తూనే ఉంటుంది.
ఈ పర్వతం చుట్టూ నందా దేవి నేషనల్ పార్క్ ఉంది, ఇక్కడ ప్రకృతి అందాలు అద్భుతంగా ఉంటాయి. నందా దేవి పర్వత శ్రేణిలో పశ్చిమ .. తూర్పు శిఖరాలతో సహా రెండు శిఖరాలు ఉన్నాయి. తూర్పు శిఖరాన్ని నందా దేవి అని పిలుస్తారు. పశ్చిమ శిఖరాన్ని సునంద శిఖరం అంటారు.నందా దేవి హిమానీనదం నుంచి కరిగిన నీరు ప్రవాహంగా మారి నదులలో కలుస్తుంది. మొదట రిషిగంగా నదిలోకి ప్రవహిస్తుంది. ఆ తరువాత ఇది ధౌలిగంగా నదిలో కలుస్తుంది. గంగా నది ఉపనదులలో ధౌలిగంగ ఒకటి. ధౌలిగంగా తరువాత విష్ణుప్రయాగ్ వద్ద అలకనంద నదిలో కలిసిపోతుంది. ధౌలిగంగా నది జోషిమత్, కర్ణాప్రయాగ్ వంటి ప్రదేశాల గుండా వెళుతుండగా.. అలకనంద ఉత్తరాఖండ్ శ్రీనగర్, హరిద్వార్, రాణిఖెట్, భీమ్‌తాల్, హల్ద్వానీ ప్రాంతాల గుండా ప్రవహిస్తుంది. నందాదేవి పర్వతం లోని ఒక పెద్ద భాగం విరిగి పడటంతో ఆ మంచు ముక్కలు నీరుగా మారి ధౌలిగంగా కు వరదలు వచ్చాయి.
ఇక రిషి గంగా విద్యుత్ ప్రాజెక్టు కారణంగా పర్యావరణం దెబ్బతింటుందని .. ఎప్పటికైనా విద్వంసం జరుగుతుందని ఎప్పటినుంచో పర్యావరణ ప్రేమికులు చెబుతున్నారు. కొందరు పర్యావరణ వేత్తలు కోర్టుకు కూడా వెళ్లారు. ప్రభుత్వం ఎవరి మాటలు లెక్క చేయకుండా ప్రాజెక్టు నిర్మాణానికి పూనుకుంది.
ఇవాళ రైనీ తపోవన్ గ్రామం వద్ద ఉన్న పవర్ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరింది. నీటి ప్రవాహం ధాటికి రైనీ వద్ద ఉన్న ఆనకట్ట కొట్టుకుపోయింది. ఒక్కసారిగా వరద ముంచెత్తడంతో రుషి గంగా పవర్ ప్రాజెక్టు దెబ్బతింది. ఈ విద్యుత్ కేంద్రంలో పని చేస్తున్న 150 మంది కార్మికులు గల్లంతు అయ్యారు. ఇవ్వాళ్టి ప్రకృతి వైపరీత్యానికి కారణం ఏమిటో ? పరిశోధకులు ఏమి చెబుతారో చూడాలి.
—————-KNM