ముప్పైఏళ్ల క్రితం వచ్చిన “ఎర్రమందారం” సినిమా నటుడు రాజేంద్ర ప్రసాద్ కి మంచి పేరు తెచ్చిపెట్టింది. అప్పటివరకు కామెడీ పాత్రలకే పరిమితమైన రాజేంద్ర ప్రసాద్ సీరియస్ రోల్స్ కూడా చేయగలనని “ఎర్రమందారం” లోని “బండి రాముడు” పాత్ర తో చాటి చెప్పారు. రాజేంద్ర ప్రసాద్ లో ఒక విలక్షణ నటుడు దాగి వున్నాడని మొదట నిర్మాత పోకూరి బాబూరావు గుర్తించారు.
తొలుత ఎర్రమందారం కథ… అందులో బండిరాముడు పాత్ర గురించి చెబితే రాజేంద్ర ప్రసాద్ మొత్తం విని ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయారట. ఏ విషయం చెప్పక పోయేసరికి బాబురావు విస్తుపోయారట. గంట తర్వాత రాజేంద్ర ప్రసాద్ ఫోన్ చేసి ‘ఆ పాత్ర పదే పదే గుర్తు కొస్తోంది. .. ఆ క్యారక్టర్ నేను చేస్తాను.’ అన్నారట. ఆ క్యారెక్టరే “బండి రాముడు”. రాజేంద్రప్రసాద్ నట జీవితాన్ని మలుపు తిప్పింది.
ఇక ఈ సినిమాకు మూల కథ ప్రముఖ నాటక, సినీ రచయిత హరనాథరావు రాసిన “లేడి చంపిన పులి నెత్తురు”. ఆ కథ 80 దశకంలో ఆంధ్రజ్యోతి వార పత్రిక నిర్వహించిన దీపావళి కథల పోటీలో మొదటి బహుమతి గెలుచుకుంది. ఈ కథ ను సినిమా గా తీద్దామని బాబూరావు హరనాథరావుతో మాట్లాడితే అది సినిమాకు పనికిరాదని ఆయన చెప్పారు.
బాబూరావు గట్టిగా పట్టుబట్టేసరికి హరనాథరావు ఒక వారం .. పది రోజులు కసరత్తు చేసి సినిమాకు పనికొచ్చేలా ఒక లైన్ తయారు చేశారు. దాన్ని మరల మార్పులు చేర్పులు చేసి మరో లైన్ రూపొందించారు. ఈ లైన్ ఆధారంగా రచయిత సంజీవి సీనిక్ ఆర్డర్ రెడీ చేశారు. హరనాథరావు మాటలు రాశారు. స్క్రిప్ట్ రెడీ కావడంలో హరనాథరావు తమ్ముడు సినీరచయిత మరుధూరి రాజా కూడా ఓ చేయి వేశారు.
నిర్మాత బాబూరావు .. రచయిత హరనాథరావు … మరుధూరి రాజా అంతా ఒంగోలు వాళ్లే. అంతకు ముందు మాదాల రంగారావు, దర్శకుడు టి. కృష్ణ (హీరో గోపీచంద్ తండ్రి ) హరనాథరావు వీళ్లంతా కలసి నాటకాలు వేసిన వాళ్ళు. బాబూరావు ఆంద్రాభ్యాంకు లో ఉద్యోగం మానేసి సినీ రంగంలోకి ప్రవేశించి ఈ తరం ఫిలిమ్స్ బ్యానర్ పై చాలా సినిమాలు తీశారు.
ఈ సినిమాకు ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించారు. దర్శకుడిగా ఆయనకు మంచి పేరు వచ్చింది. పంచాయితీ రాజ్ వ్యవస్థలోని రిజర్వేషన్ల ప్రహసనం పై ఈ సినిమా పెద్ద సెటైర్. సినిమాలో మరెన్నో మలుపులున్నాయి. ఆకట్టుకునే సన్నివేశాలున్నాయి. బండి రాముడు పాత్రలో రాజేంద్ర ప్రసాద్ జీవించాడు. ఉత్తమ నటుడిగా నంది అవార్డు గెలుచు కున్నారు.
ఉత్తమ కథా చిత్రంగా కూడా ఎంపికైంది. ‘కళ్ళు తెరుచుకుంటే ఉయ్యాల, కళ్ళు మూసుకుంటే మొయ్యాల’ అనే పాటకు జాలాది ఉత్తమ గేయరచయితగా అవార్డు అందుకున్నారు. దేవరాజ్ ఉత్తమ విలన్ గా… గౌతమ్ రాజు ఉత్తమ ఎడిటర్ గా అవార్డులు పొందారు. సినిమాకు లాభాలు రాకపోయినా నష్టం రాలేదు. ఈ తరం బ్యానర్ ఇమేజ్ పెరిగింది.
తిరుపతి ఆంధ్రజ్యోతిలో పనిచేస్తున్న సమయంలో నట కిరీటీ రాజేంద్రప్రసాద్ ను ఎర్రమందారం విడుదలైన కొన్నాళ్ల తర్వాత కలిసాను. చాలా జోవియల్ మనిషి. ఆయనతో మాట్లాడుతుంటే టైమ్ తెలీదు.ఆ రోజు మాటల్లో ‘ఎర్రమందారం’ సినిమా ప్రస్తావన వచ్చింది. “మీరు ఉత్తమనటుడిగా నంది అవార్డు అందుకుంటారు గ్యారంటీ” అన్నాను.
రాజేంద్రప్రసాద్ నాకేసి అదోలా చూసారు. “ఇటీవలి కాలంలో అలాంటి పాత్ర రాలేదు. మీరు అద్భుతంగా చేశారు” అన్నాను. రెండు గంటలపాటు ఇంటర్వ్యూ నడిచింది. ఇంటికి వచ్చేసాను. కరెక్టుగా ఆ మూడో రోజే నంది అవార్డులు ప్రకటించారు. రాజేంద్రప్రసాద్ ఉత్తమనటుడు గా ఎంపికయ్యారు. అప్పటికే తయారు చేసిపెట్టుకున్న ఇంటర్వ్యూ ని వెంటనే అన్ని ఎడిషన్స్ కి పంపించాం.
అన్ని ఎడిషన్స్ లో ఇంటర్వ్యూ కవర్ అయింది. మిగతా పత్రికల కంటే ఫాస్ట్ గా పని చేసినట్లు లెక్క. మరుసటి రోజు మధ్యాహ్నం స్వీట్ ప్యాకెట్ పట్టుకుని ఆఫీస్ కొచ్చారు రాజేంద్రప్రసాద్. “నీ మాట నిజమైంది” అన్నారు. ” అభినందనలు … మీరు కష్టపడ్డారు ..ఫలితం అందుకున్నారు” అన్నారు. ఆయన చాలా సంతోషపడ్డారు.
————–KNMURTHY