బాలయ్య …
బాలయ్య అంటే ఇవాళా రేపూ నందమూరి బాలకృష్ణ అనుకుంటారు. కానీ … మన్నవ బాలయ్య ఎంత మందికి గుర్తొస్తారు… అందుకే ఆయన గురించోసారి గుర్తు చేసుకుంటే బాగుంటుందనిపించి … ఇలా …
నటుడు నిర్మాతలు కావడం క్వైట్ కామన్.
తాము అనుకున్న పాత్రలు చేయడం కోసం కొందరు నిర్మాతలుగా మారితే…తాననుకున్న కథలతో చిత్రాలు తీయడానికి నిర్మాణ రంగంలోకి దూకేస్తారు ఇంకొందరు. నటుడు మన్నవ బాలయ్య సెకండ్ కేటగిరీలోకి వస్తారు.
ఇంజనీరింగ్ చదివి సినిమాల్లోకి వచ్చిన బాలయ్య … ఉన్నట్టుండి నిర్మాతగా మారారు. బాలయ్య రాసిన కథలు కొన్ని పత్రికల్లో అచ్చయ్యాయి కూడా. దీంతో తన కథలతోనే స్వంత చిత్ర నిర్మాణం ప్రారంభించాడు. సక్సస్ అయ్యాడు.
బాలయ్య మద్రాసు గిండీ కాలేజ్ లో మెకానికల్ ఇంజినీరింగ్ చేశారు. తాపీ చాణక్య డైరక్ట్ చేసిన ఎత్తుకు పై ఎత్తు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. సుమారు 350 చిత్రాల్లో విభిన్న పాత్రలు చేసి ఏ కారక్టర్ ఇచ్చినా బాలయ్య శక్తి మేరకు నటించేస్తాడనే పేరు సంపాదించారు.
కారక్టర్ రోల్స్ హీరో రేంజ్ లో చేయడం బాలయ్య స్పెషాల్టీ. టాలెంటుకు తగ్గ పాత్రలు రాలేదనే కసితో స్వంత చిత్ర నిర్మాణానికి దిగారు బాలయ్య. అలా తీసిన మొదటి చిత్రం చెల్లెలి కాపురం.భారత చలనచిత్ర చరిత్రలో నటుడిగా రాణించి, ఆపై సినిమాలకు కథలు సమకూర్చి, నిర్మాతగా మారి, దర్శకత్వం నెరపి నాలుగు విభాగాల్లో ప్రజ్ఞాపాటవాల్ని చాటిన వారిలో బాలయ్య ఒకరు.
వి.శాంతారామ్, రాజ్‌కపూర్, మనోజ్‌కుమార్, ఎన్.టి.రామారావు తదితరులు కూడా ఇదే రూట్ లో వెళ్లి తమ సత్తా ప్రూవ్ చేసుకున్నారు. వారిని ఆదర్శంగా తీసుకునే బాలయ్య తన మొదటి సినిమాకు తనే కథ సమకూర్చుకున్నారు.దర్శకుడుగా విశ్వనాథ్ అనుకున్నారు.
బాలయ్య అప్పట్లో తుఫాన్ అనే పత్రికలో తెలుపు నలుపు అనే కథ రాశారు. దాన్నే తను ప్రారంభించిన అమృతా ఫిలింస్ తొలిచిత్రంగా తెర కెక్కించాలనుకున్నారు. నవయుగ పర్వతనేని చంద్రశేఖరరావు గారితో చెప్తే … విశ్వనాథ్ ను డైరక్టర్ గా పెట్టుకోమని ఎడ్వైజ్ చేశారు.
విశ్వనాథ్ నలుపు తెలుపు కథను మరింత సాన పెట్టారు. సినిమా అద్భుత విజయం సాధించడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వ పురస్కారాలు సాధించింది. విశ్వనాథ్ సూచన మేరకే తొలిచిత్రంలో శోభన్ ను హీరోగా తీసుకున్నారు బాలయ్య. ఆ తర్వాత సినిమా కోసం కూడా శోభన్ నే సంప్రదించారు బాలయ్య.
నువ్వు కలర్ లో తీస్తే చేస్తాననడంతో కృష్ణకు మారారు. డైరక్టర్ మాత్రం విశ్వనాథే. సినిమా పేరు నేరమూ శిక్షా. డోస్టోవస్కీ క్రైమ్ అండ్ పనిష్ మెంట్ తెలుగునాట కూడా పాపులర్ అయిన నవల. శిక్ష అనేది మనిషి అంతరంగాన్ని మార్చగలగాలనే కాన్సెప్ట్ తో సాగే ఈ చిత్రం అద్భుతమైన విజయం సాధించింది.
బాలయ్య తను తీసిన సినిమాలన్నిటికీ కథలు తనే తయారు చేసుకునేవారు. పైగా ఫ్యామ్లీ ఆడియన్స్ ను ధియేటర్లకు రప్పించేట్టుగా తీసేవారు. అశ్లీలత, అసభ్యత దరిదాపుల్లోకి రానిచ్చేవారు కాదు. పర్పస్ ఫుల్ మూవీస్ తీస్తే జనం తప్పకుండా ఆదరిస్తారని నమ్మి తీసిన చిత్రాలే బాలయ్య సినిమాలన్నీ. నేరమూ శిక్ష లో బాలయ్య నటుడుగా కూడా ఒక మెట్టు పైకెక్కాడు.
నేరమూ శిక్షా ఎంతటి పేరు తెచ్చుకుందంటే. .. తమిళ సూపర్ స్టార్ తర్వాత ముఖ్యమంత్రి అయిన ఎమ్జీఆర్ ఆ సినిమా చూసి మెచ్చుకోవడమే కాదు … తమిళ హక్కులు తీసుకుని తన బ్యానర్ లో రీమేక్ చేశారు. తెలుగులో బాలయ్య చేసిన కారక్టర్ ఆయనతోనే చేయించారు. రాజశ్రీ వారు అదే సినిమాను హిందీలో శిక్షా పేరుతో రీమేక్ చేశారు.
అక్కడా అద్భుతమైన విజయం చవిచూసిందా చిత్రం.బాలయ్య తీసిన చిత్రాలన్నీ బడ్జెట్ కు లోబడి తీసినవే. ఎక్కడా అనవసరమైన ఖర్చు కనిపించదు. కథను నమ్ముకుని తీసిన సినిమాలవి. స్టార్స్ ఉన్నా….వారిలోని నటులను ఎలివేట్ చేసేవిగానే పాత్రల చిత్రణ సాగేది.
ఎంత స్టార్ అయినా అడపాదడపా కథాత్మక చిత్రాల్లో చేయాలనే తపన ఉంటుంది. బాలయ్య స్టార్స్ తో చిన్న తరహా చిత్రాలు తీసినా వారికి పెద్ద విజయాలనే అందించారు.నేరమూ శిక్ష తర్వాత బాలయ్య తీసిన సినిమా అన్నదమ్ముల కథ.నిరుద్యోగ సమస్య … దారి తప్పుతున్న యువత ప్రధాన కథావస్తువుగా తీసుకుని చేసిన ఈ సినిమా నటుడుగా బాలయ్యకు మంచి పేరు తెచ్చిపెట్టింది.
తర్వాత బాలయ్య తీసిన సినిమా ఈనాటి బంధం ఏనాటిదో. హీరో కృష్ణ. డైరక్షన్ కె.ఎస్.ఆర్ దాస్. క్రైమ్ సినిమాల స్పెషలిస్ట్ దాసుతో ఫ్యామ్లీ సబ్జక్ట్ డీల్ చేయించిన ఘనత బాలయ్యదే. ఈ నాటి బంధం ఏనాటిదోకు ఇంకో స్పెషాల్టీ ఉంది. అదేంటంటే … దాస్ సినిమాలకు సహజంగా సత్యం మ్యూజిక్ చేసేవారు. ఎక్కువగా ఆరుద్ర పాటలు రాసేవారు.
అలాంటిది ఈ సినిమాకు ఎస్. రాజేశ్వర్‌రావు సంగీతం అందించడం … దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రితో పాటలు రాయించడం విశేషం కాక మరేమిటి? దాస్ సినిమాల్లో “ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకూ” …లాంటి గీతాలు ఊహించగలమా?
సూపర్ స్టార్ కృష్ణతో బాలయ్యకు చాలా అనుబందం ఉంది. బాలయ్య అన్నదమ్ముల కథ ప్లాన్ చేస్తున్న టైమ్ లోనే కృష్ణ అల్లూరి సీతారామరాజు తీసే పనిలో ఉన్నారు. అందులో అగ్గిరాజు పాత్రకు ముందు ఎస్వీరంగారావు అనుకున్నారు. తీరా ఆయన వేరే సినిమాతో బిజీగా ఉండడం ఆరోగ్యం సహకరించడం లేదనడంతో కృష్ణ ఆలోచనలో పడ్డారు.
అప్పుడు ఆయనకు తట్టిన పేరు బాలయ్య. వెంటనే బాలయ్యను పిల్చి మేకప్ చేసి కొన్ని షాట్స్ తీసి చక్రపాణిగారికి చూపించారు. ఆయన ఓకే అనడంతో అగ్గిరాజుగా బాలయ్య కంటిన్యూ అయ్యారు.
ఈ నాటి బంధం ఏనాటిదో తర్వాత మురళీ మోహన్ హీరోగా ప్రేమ పగ తీశారు బాలయ్య. ఈ చిత్రానికీ ఎస్. రాజేశ్వర్‌రావు నే కంటిన్యూ చేశారు.
కలసిన హృదయాలలోన లాంటి హృద్యమైన గీతాలున్నాయి. బాలయ్య సంగీతం విషయంలో చాలా కేర్ తీసుకునేవారు. కె.వి.మహదేవన్, ఎస్.రాజేశ్వరరావు, ఎమ్.ఎస్.విశ్వనాథన్ లాంటి సంగీత దిగ్గజాలతో ఆయన తన చిత్రాలకు సంగీతం చేయించుకున్నారు.
నేరమూ శిక్షతో మొదలు పెట్టి అన్నదమ్ముల కథ, ఈ నాటి బంధం ఏనాటిదో, ప్రేమ పగ ఇలా వరుసగా అమృతా వారి నాలుగు చిత్రాలకు సంగీతం అందించారు రాజేశ్వర్‌రావు. మొదటి చిత్రం చెల్లెలి కాపురానికి కె.వి.మహదేవన్ మ్యూజిక్ చేశారు. చుట్టాలున్నారు జాగ్రత్త నుంచి ఎమ్.ఎస్.విశ్వనాథన్ ప్రవేశించారు. ఆయన కూడా వరసగా నాలుగు చిత్రాలకు మ్యూజిక్ డైరక్టర్ గా పనిచేశారు.
అమృతా ఫిలింస్ బ్యానర్ లో వచ్చిన మరో సెన్సేషనల్ హిట్ మూవీ చుట్టాలున్నారు జాగ్రత్త. 1980లో విడుదలైన చుట్టాలున్నారు జాగ్రత్త టైమ్ కి కృష్ణ మంచి స్వింగులో ఉన్నారు. ఆయనతో క్రైమ్ సినిమా ప్లాన్ చేయకుండా ఫక్త్ ఫ్యామ్లీ ఎంటర్ టైనర్ తీసి సక్సస్ కొట్టారు బాలయ్య. ఈ చిత్రానికీ బి.వి.ప్రసాద్ డైరక్టరు. చుట్టాలున్నారు జాగ్రత్త లో కొసరాజు తనదైన పద్దతిలో జానపదం రాశారు.
సినారే రాసిన మరో జానపద బాణీలో సాగే డ్యూయట్టు నాకు ఇష్టం . వాటిని అంతే ధీటుగా ట్యూన్ చేశారు ఎమ్.ఎస్.వి. అమ్మీ ఓ లమ్మీ అంటూ సాగే ఓ గీతంలో అరిసెల పాకం కన్నా అందమైన దానా అని ప్రియురాలిని పొగుడుతాడు హీరో. చుట్టాలున్నారు జాగ్రత్త తర్వాత కృష్ణంరాజు జయప్రద కాంబినేషన్ లో ‘నిజం చెబితే నేరమా’ తీశారు బాలయ్య. జర్నలిజం బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ సినిమా మంచి చిత్రంగా గుర్తింపు పొందినా ప్రేక్షకాదరణ లో కాస్త వెనకపడిందనే చెప్పాలి.
అయితే ఆ తర్వాత చిరంజీవితో తెరకెక్కించిన ‘ఊరికిచ్చిన మాట’ మాత్రం మంచి వసూళ్లే రాబట్టింది. ఈ సినిమాకు దర్శకత్వం కూడా తనే నిర్వహించి శభాష్ అనిపించుకున్నారు బాలయ్య.ఈ రెండు చిత్రాలకూ ఎమ్ఎస్.వి నే సంగీతం అందించారు. ఊరికిచ్చిన మాటలో ఓ అద్భుతమైన సోలో ఉంటుంది.
హోరుగాలిలో…కలిసిందా ఊరికిచ్చిన మాట అంటూ సాగే ఆ గీతం …ఎమోషనల్ సాంగ్స్ చేయాలంటే విశ్వనాథన్ ను మించిన సంగీత దర్శకుడు లేడనిపిస్తుంది. తన కుమారుడు తులసీరామ్ ను హీరోగా పరిచయం చేస్తూ ఇరవై ఏళ్ల కిందట పసుపుతాడు అనే సినిమా తీశారు బాలయ్య. స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఆ చిత్రమే దాదాపు అమృతా ఫిల్మ్స్ వారి ఆఖరి చిత్రం కూడా.
రాధ హీరోయిన్ గా చేసిన ఈ సినిమా ఓ మోస్తరుగానే ఆడింది.సినిమా రూపు మారి బడ్జెట్ కంట్రోల్ లేకుండా పోయిన తర్వాత సినీ నిర్మాణానికి దూరమై నటనకే పరిమితమయ్యారు. ఆమధ్యకాలంలో శ్రీ రామరాజ్యంలో నటించారు.
పక్కాప్లానింగ్ తో సినిమాలు తీసే చాలా బ్యానర్లలాగే అమృతా ఫిలింస్ కూడా నిర్మాణ రంగం నుంచి నిష్క్రమించింది. బడ్జెట్ ముందే వేసుకుని దానికి అనుగుణమైన బిజినెస్ ప్లాన్ చేసుకుని సినిమాలు తీశారు బాలయ్య. ఆర్ధిక సమస్యలతో ఆగిపోయిన సినిమాలు లేవు. అది చాలు నాకు అంటారాయన.