Willpower is great…………………………
సంకల్పం ఉంటే దేన్నైనా సాధించవచ్చు. అందుకు అక్షర జ్ఞానం అక్కర్లేదు. అక్షరం ముక్క రాని హరేకల హజబ్బా పేద పిల్లల కోసం ఒక పాఠశాల కట్టించి చరిత్ర సృష్టించాడు. అందుకు గాను పద్మశ్రీ అవార్డు కూడా పొందాడు. పద్మశ్రీ వచ్చినా రాకపోయినా హజబ్బా చేసింది చిన్న పని కాదు. ఇలాంటి హజబ్బాలు అందరికి ఆదర్శం.
హజబ్బా మంగళూరుకు చెందిన చిన్న వ్యాపారి. మార్కెట్లో నారింజ పండ్లు అమ్ముకునే వాడు. చాలా ఏళ్ల క్రితం ఓ విదేశీ పర్యాటకుడు ఇంగ్లీషులో నారింజ పండు ధరను అడిగితే ఏం చెప్పాలో అర్థం కాక.. తెలీక హజబ్బా ఇబ్బంది పడ్డాడు.ఆ రోజున తనకు ఇంగ్లీష్ రానందుకు చాలా బాధపడ్డాడు. తన లాగా ఎవరు ఉండకూడదు అనుకున్నాడు.
న్యూ పడపు గ్రామంలో బడి ఏర్పాటు చేయాలనుకున్నాడు. పాఠశాలను నడపడం కోసం తన సంపాదన ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఖర్చు పెట్టాడు. హజబ్బా స్థానికులను ఒప్పించి మసీదు ప్రాంగణంలో చిన్న పాఠశాలను కట్టించాడు. రోజూ ఉదయాన్నే వచ్చి పాఠశాల ను ఊడ్చడం, పిల్లలకు త్రాగడానికి నీరు తెచ్చి కుండల్లో పోసి వెళ్లే వాడు. చదువుకున్న ఒక కుర్రవాడిని టీచర్ గా పెట్టుకున్నాడు.
25 కిలోమీటర్ల దూరంలో ఉన్న జిల్లా పంచాయతీ కార్యాలయానికి వెళ్లి పాఠశాలకు విద్యా సౌకర్యాలు కల్పించాలని అధికారులకు దరఖాస్తులు పెట్టేవాడు.అపుడపుడు వెళ్లి అధికారులను కలసి అభ్యర్ధించేవాడు. పై అధికారులు ఇదంతా గమనించి.. హజబ్బా ఆకాంక్షను గుర్తించి ప్రభుత్వానికి సిఫారసు చేశారు. మొత్తానికి 2008 లో హజబ్బా కృషితో న్యూపడుపు గ్రామంలో దక్షిణ కన్నడ జిల్లా పంచాయతీలో ఉన్నత ప్రాథమిక పాఠశాల ఏర్పాటు అయింది.
విద్యార్థులకు ..ఉపాధ్యాయులకు అవసరమైన అన్ని సదుపాయాలు కూడా కల్పిస్తున్నాడు. వచ్చే ఏడాది నాటికి ప్రీ యూనివర్సిటీ కళాశాల కూడా పెట్టించే యోచన చేస్తున్నాడు. హజబ్బా సేవా గుణాన్ని గుర్తించి పలు సంస్థలు.. కర్ణాటక ప్రభుత్వం ఆయన ను ఎన్నో మార్లు సత్కరించాయి. అవార్డులతో పాటు ఇచ్చే సొమ్మును కూడా పాఠశాల అభివృద్ధి కోసమే ఉపయోగించేవాడు.
ఓ సారి అవార్డుతో పాటు వచ్చిన 5 లక్షల రూపాయలను స్కూల్ కోసం కేటాయించాడు. ఇక భవిష్యత్తులో వచ్చే మొత్తాన్ని కూడా పాఠశాల అభివృద్ధికే ఖర్చుపెడతానని హజబ్బా చెబుతున్నారు. తనకు సొంత ఇల్లు కూడా లేదు. అంత గొప్ప ఆశయంతో అనుకున్నది సాధించడానికి ఎంతో కష్టపడ్డారు హజబ్బా. ప్రభుత్వం ఆయన సేవలను గుర్తించి పద్మశ్రీ పురస్కారం తో సత్కరించింది.


