హిట్టో… ఫట్టో ఇట్టే చెప్పేసేవారు !

Sharing is Caring...

సూపర్ స్టార్ కృష్ణ కు సినిమా వ్యాపారం పై మంచి అవగాహన ఉంది. సినిమా చూసి అది హిట్టో .. ఫట్టో ఇట్టే చెప్పేసేవారు. ఏ కథను ఏ దర్శకుడు ఎంత బడ్జెట్ పెడితే ఎలా తీస్తాడు ? ఆ సినిమా ఎన్ని కేంద్రాల్లో ఆడుతుంది ? సుమారు ఎంత వసూలు చేయగలదో చెప్పేవారు.

సూపర్ స్టార్ అంచనాలు 90 శాతం మేరకు నిజమయ్యేవట. ఇది గమనించి చాలామంది నిర్మాతలు తమ సినిమాల ప్రివ్యూ షోకి కృష్ణ ను పిలిచే వారట . సీనియర్ నిర్మాతలు కూడా సూపర్ స్టార్ చెప్పే విషయాలు విని ఆశ్చర్యపోయేవారట.

అలాగే ఏ ఏరియా లో ఎన్ని థియేటర్లు ఉన్నాయి ? వాటి సీటింగ్ కెపాసిటీ ఎంత ? ఎన్నిరోజులు ఆడితే నిర్మాత ఒడ్డున పడ గలడో చెప్పేసే వారట.కొన్ని సందర్భాల్లో ఆయన అంచనాలు ఫెయిల్ అయిన ఉదాహరణలున్నాయి. అయినా వాటిని ఎపుడూ కవర్ చేసుకునే ప్రయత్నం చేయలేదు.

ఒక వేళ నిర్మాత నష్టపోతే వెంటనే కాల్షీట్స్ ఇచ్చి తనే ఫైనాన్స్ చేసి తీసిన సినిమాలు కూడా ఉన్నాయి. అందుకే కృష్ణ అంటే నిర్మాతలు అభిమానిస్తారు. ఎక్కడా ఏ నిర్మాత కూడా సూపర్ స్టార్ గురించి నెగటివ్ గా మాట్లాడిన దాఖలాలు లేవు. అది కృష్ణ గొప్పదనం.

అలాగే ప్రేక్షకులను ఎలా మెస్మరైజ్ చేయాలో కూడా కృష్ణ అనుభవం మీద నేర్చుకున్నారు. ఆ నాటి ప్రేక్షకులకు కొత్తదనం చూపించాలన్నలక్ష్యంతో మోసగాళ్లకు మోసగాడు వంటి వెరైటీ సినిమా తీశారు. ఒక కొత్త జోనర్ ను సృష్టించారు.

మోసగాళ్లకు మోసగాడు సినిమా కోసం దాదాపు వందమందికి పైగా యూనిట్ సభ్యులను రాజస్థాన్ కి ప్రత్యేక రైలులో తీసుకెళ్లడం సూపర్ స్టార్ కే చెల్లింది. అక్కడ వారికి ఏ లోటు రాకుండా వసతి సదుపాయాలు కల్పించడం మామూలు విషయం కాదు. ఆందుకు తగినట్టుగానే ఫలితాలు అందుకున్నారు.

సీతారామరాజు విషయంలో కూడా అలాగే చేశారు. సినిమా యూనిట్ ను నర్సీపట్నం దగ్గరి చింతపల్లి లో ఉంచారు. అక్కడే అందరికి వసతి కల్పించారు. ఆ సినిమా షూటింగ్ కూడా చింతపల్లి కి దగ్గరలో ఉన్న లోతుగడ్డ, సప్పర్ల, లంబసింగి, పోశన పాడు, అన్నవరం, కృష్ణదేవిపేట, బలిమెల ప్రాంతాల్లో జరిగింది. అవన్నీ చరిత్రలో  సీతారామ రాజు సంచరించిన ప్రాంతాలు.

ఇదే రీతిలో కురుక్షేత్రం యుద్ధ సన్నివేశాలు రిచ్ గా చిత్రీకరించేందుకు యూనిట్ సభ్యులను రాజస్థాన్ తీసుకెళ్లారు. కృష్ణ ఏదైనా మనసులో అనుకోని చెప్పగానే దాన్నిపకడ్బందీగా ప్లాన్ చేసి వెను వెంటనే  ఆదిశేషగిరిరావు, హనుమంతరావులు అమలు చేసేవారు. కృష్ణ నిర్మాతగా దూసుకుపోవడానికి ఆ ఇద్దరు సోదరులు కూడా కారణం అని చెప్పుకోవచ్చు.

ఎప్పటికప్పుడు ప్రేక్షకులకు ఒక విభిన్నమైన అనుభవం ఇవ్వడానికి కృష్ణ ప్రాధాన్యమిచ్చేవారు. 1974లో తొలి సినిమాస్కోప్ సినిమాగా అల్లూరి సీతారామరాజు, 1982లో తొలి ఈస్ట్‌మన్ కలర్ సినిమాగా ఈనాడు, 1986లో తొలి 70 ఎంఎం సినిమాగా సింహాసనం, చివరకి 1995లో తొలి డీటీఎస్‌ సినిమాగా తెలుగు వీర లేవరా- ఇవన్నీసూపర్ స్టార్ తెచ్చిన సాంకేతిక మార్పులే.

కథకు సాంకేతికత,సెట్టింగ్ లను జోడించి కొత్తగా సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి విజయం సాధించారు.  కురుక్షేత్రాన్ని కూడా ప్రముఖ తారాగణం తో, అద్భుతమైన సెట్టింగులతో .. భారీ యుద్ధ సన్నివేశాలతో రిచ్ గా తీశారు. కానీ పోటీలో అది నిలబడ లేకపోయింది.

రెండు వారాలు ఆగి విడుదల చేసినట్లయితే సూపర్ హిట్ అయ్యేది. ఈ రిచ్ ఫార్ములా తో సింహాసనం తీసి బంపర్ హిట్ కొట్టారు.  తెలుగు తెరపై సూపర్ స్టార్ చేసినన్ని ప్రయోగాలు మరోకరు చేయలేదు. అందుకే ఆయన డేరింగ్,  డాషింగ్ హీరో అయ్యారు.  

—————KNM

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!