‘తుంగనాధుడి’ ని చూసారా ?

Sharing is Caring...

పంచ కేదార్ దేవాలయాల్లో తుంగనాథ ఆలయం ఒకటి. ఇది ప్రపంచంలోనే ఎత్తైన శివాలయం. కేవలం వేసవి కాలంలోనే ఈ ఆలయం తెరిచివుంటుంది.  చలికాలంలో దేవాలయం మంచుతో మూసుకుపోతుంది. ఈ కారణంగానే శివుని ఉత్సవ విగ్రహాన్ని దగ్గర్లో ఉన్న మఠానికి తరలించి అక్కడ నిత్య పూజలు చేస్తారు.
మరల వేసవి రాగానే దేవాలయం తెరుస్తారు. కేదారేశ్వరుడి ఆలయం కంటే ఈ ఆలయం ఎత్తులో ఉంది.
వృషభ రూపంలోని శివుని బాహువులు పడిన ప్రదేశమే  తుంగనాథ క్షేత్రంగా విరాజిల్లుతోంది. తుంగం అంటే పర్వతం అని అర్ధం. హిమాలయ  సమున్నత పర్వత శ్రేణులకు అధిపతి శివుడు.  కాబట్టి ఇక్కడ ఆయనను తుంగనాథుడు అనే పేరుతో పిలుస్తారు.
దేవతలు నివసించే హిమాలయ రాష్ట్రంగా ప్రసిద్ధి గాంచిన ఉత్తరాఖండ్ లోని తుంగ నాథ ఆలయం రుద్రప్రయాగ నుంచి 50  కిమీ దూరంలో ఉంటుంది . ఇక్కడకు కాలినడకన మాత్రమే వెళ్ళగలం. నడవలేని వారు డోలీలలో వెళ్ళవచ్చు.సముద్ర మట్టానికి ఈ ఆలయం 1273 అడుగుల ఎత్తులో ఉంటుంది.మందాకిని అలకనంద నదుల నడుమ కొలువైన ఈ ఆలయానికి వెయ్యేళ్ళ చరిత్ర ఉంది. అతి ప్రాచీనమైన ఆలయ గోడలపై అద్భుతమైన పురాతన శిల్పాలను  చూడవచ్చు.

ఈ హిమాలయ ప్రాంతం మహిమాన్విత ఆలయాలకు నిలయంగా విలసిల్లుతోంది. సంసార బంధాలనుంచి విముక్తి చెందాలనుకునే వారికి ఈ ఆలయాలు తుది గమ్యం అనుకోవచ్చు.  ఇక్కడ పర్వత శ్రేణుల్లో చంద్ర శిల అనే ఎత్తైన కొండ ఉంది. ఈ పర్వతం సముద్ర మట్టానికి 4000 మీటర్ల ఎత్తులో ఉంది. అక్కడనుంచి  నలువైపులా హిమాలయాలు దర్శనమిస్తాయి. అద్భుతమైన దృశ్యాలు కనువిందు చేస్తాయి.  కొందరు సాధువులు ఎవరికంటా పడకుండా శీతాకాలం లోనే ఈ ఆలయాన్ని దర్శిస్తారని కూడా అంటారు.

ఈ చంద్ర శిలను కూడా ట్రెక్కింగ్ ద్వారా వెళ్లి చూడాల్సిందే. ఇక మిగతా పంచకేదార ఆలయాలతో పోలిస్తే తుంగనాథ ఆలయాన్ని చేరుకోవడం సులభమే.  58 వ నెంబర్ జాతీయ రహదారి పక్కనే చొప్తా అనే గ్రామం నుంచి నాలుగు కిలోమీటర్లు నడిస్తే ఈ ఆలయానికి చేరుకోవచ్చు. ఇదొక పెద్ద హిల్ స్టేషన్ … ఇక్కడ రాత్రి వేళల్లో ఓపెన్ క్యాంప్ సదుపాయాలు అందుబాటులో ఉంటాయి . యాత్రికులు రాత్రి అక్కడే ఉండి ప్రకృతి సౌందర్యాలను తిలకించవచ్చు. అవకాశం ఉంటే  జీవితంలో ఒకసారైనా ఈ ప్రాంతానికి వెళ్లి సమీప క్షేత్రాలను చూసి రావాలి. 

——- Theja

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!