Jatayu Park attracts tourists…………………………………….
కేరళ వెళితే తప్పక చూడవలసిన ప్రదేశాలలో “జటాయు నేచర్ పార్క్” ఒకటి. జటాయువు చివరి శ్వాస విడిచిన చోటనే ఈ పార్క్ నిర్మించడం విశేషం. ఇంతకూ ఈ జటాయువు ఎవరంటే రామాయణం లోని అరణ్యకాండలో వచ్చే ఒక గద్ద పాత్ర. దశరధుడు ఇతను స్నేహితులు. రావణుడు సీతను ఎత్తుకుని వెళుతున్నపుడు జటాయువు అతగాడితో పోరాడతాడు. అలా పోరాడి తన రెక్కలు పోగొట్టుకుంటాడు.
ఓడిపోతాడు. సీతను వెతుక్కుంటూ వచ్చిన రామునికి రావణుడు ఆమెను అపహరించి తీసుకెళ్లిన విషయం చెప్పి ప్రాణాలు విడుస్తాడు. శ్రీరాముడే జటాయువుకి దహన సంస్కారాలు చేస్తాడు. నాటి పోరాటంలో జటాయువు తన రెక్కలు తెగిన తర్వాత కేరళలోని కొల్లాం జిల్లా కు 38 కిమీ దూరంలోని చాడాయన మంగళం అనే ప్రదేశంలో పడిపోయాడు. సరిగ్గా అక్కడే ఈ పార్కును నిర్మించారు.
జటాయు నేచర్ పార్క్ కేరళలో ఇపుడు ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా మారింది. 2017 లో మొదటి దశ, 2018 లో రెండో దశ నిర్మాణాలను పూర్తి చేసుకున్నది. దీన్ని జటాయు ఎర్త్ సెంటర్ అని కూడా పిలుస్తారు. చుట్టూ సుందరమైన లోయలు, పర్వతాలు, ఆకుపచ్చని ప్రకృతి.. దూరంగా కనిపించే గ్రామాలు సందర్శకులను ఆకట్టుకుంటాయి.
ఈ రాక్ థీమ్ పార్క్ ను 65 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. ఇక్కడ ప్రధాన ఆకర్షణ జటాయువు శిల్పం .. 200 అడుగుల పొడవు,150 అడుగుల వెడల్పు, 70 అడుగులు ఎత్తు గల ఈ శిల్పం ప్రపంచంలోనే అతి పెద్ద పక్షి శిల్పం అని చెప్పుకోవచ్చు. శిల్పం రెక్కల వద్ద నుండి లోపలి కి వెళ్ళవచ్చు.ఆ లోపల, అయిదు అంతస్తుల భవనం.. ఒక మల్టీ డైమెన్షనల్ మినీ థియేటర్, ఒక మ్యూజియం ను కూడా నిర్మించారు.
థియేటర్లో జటాయువు .. రావణుల యుద్ధ దృశ్యాలతో కూడిన యానిమేటెడ్ ఫిల్మ్ పర్యాటకుల కోసం ప్రదర్శిస్తారు. అలాగే మ్యూజియంలో రామాయణ కాలం నాటి వన్య ప్రాణులను యానిమేటెడ్ విజువల్స్ ద్వారా చూడవచ్చు. ఆ వన్య ప్రాణులు మన పక్కనే ఉన్నాయా అనే భ్రమ కలుగుతుంది.
చిత్ర నిర్మాత, శిల్పి రాజీవ్ అంచల్ ఈ ప్రాజెక్టు ను డిజైన్ చేశారు. 7 ఏళ్ళ పాటు ఈ ప్రాజెక్టు పై ఆయన పనిచేశారు. తన సొంత కంపెనీ గురు చంద్రిక బిల్డర్స్ తరపున కేరళ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుని BOT (బిల్డ్-ఆపరేట్-ట్రాన్స్ఫర్) మోడల్ గా దీన్ని రూపొందించారు. సందర్శకులు అభిరుచులను దృష్టిలో ఉంచుకుని దీనిని పూర్తి ఎంటర్టైన్మెంట్ పార్క్ గా మార్చారు.
ఇక్కడ ఉన్న అడ్వెంచర్ జోన్ లో పెయింట్ బాల్, లేజర్ ట్యాగ్, ఆర్చరీ, రైఫిల్ షూటింగ్, రాక్ క్లైంబింగ్, బౌల్డరింగ్ వంటి సాహస క్రీడలకు సదుపాయాలు కల్పించారు. కేబుల్ కారు …. హెలికాప్టర్ రైడ్ సౌకర్యం కూడా ఇటీవలే ప్రవేశపెట్టారు.
రైతులు ఈ ఉద్యానవనంలో పండించిన సేంద్రీయ ఉత్పత్తులను ప్రత్యేక స్టాల్ ద్వారా విక్రయిస్తుంటారు. పార్క్ విద్యుత్ అవసరాల కోసం సౌర శక్తిని ఉపయోగిస్తున్నారు. పర్యాటకులను పెద్ద ఎత్తున ఆకర్షించేందుకు నిర్వాహకులు కృషిచేస్తున్నారు. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. టిక్కెట్లను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు.
ఇతర వివరాలకు https://www.jatayuearthscenter.com/ ను చూడవచ్చు. కొల్లామ్ జిల్లా కేంద్రం నుంచి ఆర్టీసీ బస్సులు ఉన్నాయి లేదా పునాలూర్ నుంచి కూడా బస్ లో చేరుకోవచ్చు.