నవలా చిత్రాల పరంపర ఈ సినిమాతో ఊపందుకుందా?

Sharing is Caring...

Subramanyam Dogiparthi………………...

ఆత్మీయతనంతా రంగరించి పోసిన సినిమా 1969 లో వచ్చిన ANR ,వాణిశ్రీల మొదటి జోడీ సినిమా‘ఆత్మీయులు’. ఈ ఇద్దరి జోడీ తెలుగు సినిమా రంగంలో ఒక ఊపు ఊపింది.NTR తో సక్సెసులు ఉన్నా, పేరు వాణిశ్రీకి రాలేదు . ANR తో నటించిన ప్రేమ నగర్ , దసరా బుల్లోడు , బంగారు బాబు , సెక్రటరీ వగైరా సినిమాలలో వాణిశ్రీకి కన్నాంబ , సావిత్రిలంత పేరు వచ్చింది.  

ఇక ఈ సినిమాతో నవలా చిత్రాల పరంపర ఊపందుకుంది ..అంతకుముందు డాక్టర్ చక్రవర్తి , బారిష్టర్ పార్వతీశం వంటి చిత్రాలు నవలల ఆధారంగానే నిర్మితమైనాయి. తెలుగులో యద్దనపూడి సులోచనారాణి , ఆ తర్వాత యండమూరి వీరేంద్రనాధ్ నవలలే ఎక్కువగా సినిమాలుగా వచ్చాయి. సక్సెస్ అయ్యాయి .Excellent Feel Good Movie ‘ఆత్మీయులు’. నాకెంతో ఇష్టమైన సినిమా. మా నరసరావుపేటలో సత్యనారాయణ టాకీసులో ఆడింది.

ఇప్పటికీ టి విలో వస్తే చూస్తుంటాను. మనందరి జీవితాల్లో మంచి వాళ్ళూ ఉంటారు . బడాయికి పోయి , గాలిలో మేడలు కట్టి , చిన్న చిన్న అబధ్ధాలతో ప్రారంభించి అన్ని రకాల నేరాలూ చేసేవరకు దిగజారే చెడ్డ – మంచి వారూ ఉంటారు. 

ముఖ్యంగా విజయనిర్మల , చంద్రమోహన్ , పద్మనాభం పాత్రలు ఈ కోవకు సంబంధించినవే సూరేకాంతం , ప్రభాకరరెడ్డి వంటి ఆజన్మ నేర స్వభావం కలవారూ ఉంటారు. ANR , వాణిశ్రీ , గుమ్మడి , నాగభూషణం , చంద్రకళ, భానుప్రకాష్ పాత్రల వంటి మంచి మనసున్న వారూ ఉంటారు. యద్దనపూడి కథకు .. దుక్కిపాటి వారి స్క్రీన్ ప్లే , వి మధుసూధనరావు దర్శకత్వం అద్భుతం . సినిమాలో అనవసరమయన సీన్ ఒక్కటి కూడా లేదనే చెప్పవచ్చు .

ఈ సినిమా సక్సెస్ కు మరో కారణం యస్ రాజేశ్వరరావు సంగీత దర్శకత్వం . ఈరోజుకీ సూపర్ హిట్ సాంగ్సే . ‘అన్నయ్య కలలే పండెనూ’ , ‘కళ్ళలో పెళ్లి పందిరి కనపడసాగే’ ‘ఓ చామంతీ ఏమిటే ఈ వింత’ , ‘మదిలో వీణలు మోగె , ‘అమ్మ బాబు నమ్మరాదు’ , ‘చిలిపి నవ్వుల నిను చూడగానే’ , ‘స్వాగతం ఓహో చిలిపి నవ్వుల శ్రీవారూ’ , ‘ఏం పిల్లో తత్తరబిత్తరగున్నావు’ చాలా శ్రావ్యంగా ఉంటాయి .’ చిలిపి నవ్వుల నిను చూడగానే’ పాటను బాల సుబ్రహ్మణ్యమే పాడింది. 

 1969 వ సంవత్సరానికి గాను రెండవ ఉత్తమ చిత్రంగా నంది అవార్డుని గెలుచుకుంది . 1981 లో తమిళంలో రీమేక్ అయింది . యూట్యూబులో ఉంది . తప్పక చూడవలసిన సంగీతభరిత , ఆత్మీయ కుటుంబ కధా చిత్రం. సినిమా చూసాక BP ఉన్నవారికి BP కనీసం ఓ పది పాయింట్లయినా తగ్గుతుంది . నాదీ గ్యారంటీ .

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!