బతకటానికి..జీవించడానికి తేడా వివరించే గొప్ప పుస్తకం !

Sharing is Caring...

MNR………………………………………………………

బహుశా రివ్యూలకు అందనిది ఈ పుస్తకం అనేది నా భావన. అందుకే నా అనుభూతిని మాత్రమే రాస్తున్నాను.
నాకు తెలియని మిత్రులకి నన్ను పరిచయం చేశావు. నావి కాని ఇళ్లల్లో నాకు స్థానాన్నిచ్చావు.దూరాన్ని దగ్గర చేసి, పరదేశిని నా సోదరుడుగా మార్చావు. – రవీంద్ర నాథ్ ఠాగూర్.ఈ వాక్యాలు రవీంధ్రనాథ ఠాగూర్ రాశారు. వాటిని ఆదినారాయణ గారు తెలుగులో రాసుకున్నారు ఓ చోట. ఈ పుస్తకం చదువుతున్నంత సేపూ ఈ వాక్యాలు మనల్ని వెంటాడుతునే ఉంటాయి.

ఇండియాలో మాదిరిగా కాకుండా ఇక్కడ అందరూ సమానమే. అంటూ బ్రిటన్ లో ఓ గొప్ప వ్యక్తి చెప్పిన మాటల్ని బ్రిటన్ పర్యటనల్లో ఓచోట రాస్తారు రచయిత. అలా ఎందుకు రాసారు అన్నది చాలా ఆసక్తికరం. అంతేకాదు ప్రపంచంలో ప్రతి చిన్నారి పెదవులపై పలికే Twinkle Twinkle Little Star పాట రచయిత John Taylor నివాసాన్ని సందర్శించినప్పుడు రచయిత పొందిన తన్మయత్వాన్ని మనమూ ఆస్వాదిస్తాం. ఇది పుస్తకం కాదు. ఓ మనిషి జీవితం. ఓ అరుదైన వ్యక్తి జీవన విధానం. సామాన్యమైన మనిషి సమాజానికి అందించిన నేచురల్ ఫిలాసఫీ ఈ పుస్తకం. మనిషి అసలు తన జీవితంలో పోగొట్టుకుంటోంది ఏమిటో ఈ పుస్తకంలో ప్రతి పేజీ తెలియజేస్తుంది.

ఆంధ్ర విశ్వవిద్యాలయం కళా విభాగంలో విశ్రాంత ఆచార్యులు ఫ్రొఫెసర్ ఎం. ఆదినారాయణ గారు గత ముఫ్పై ఏళ్లకు పైగా ప్రపంచ వ్యాప్తంగా చేసిన ప్రయాణాల సమాహారమే ఈ పుస్తకం. ప్రపంచ యాత్రా చరిత్రలో ఓ గొప్ప పుస్తకంగా చెప్పుకోవచ్చు. తెలుగు పాఠకులకు ఇంత గొప్ప యాత్రా చరిత్రని, సాహిత్యాన్ని అందించిన రచయితకు ప్రతి తెలుగు వాడు కృతజ్ఞతలు చెప్పాలనేది నా అభిప్రాయం. 2009 వ సంవత్సరం నుంచి రచయిత చేసిన ప్రతి యాత్రా విశేషాల్ని తేదీలు, వ్యక్తుల పేర్లు, ఎప్పుడెప్పుడు, ఎక్కడ, ఎలా కలుసుకున్నారో చాలా సవివరంగా ఈ పుస్తకంలో రాసిిన తీరు అద్భుతమనే చెప్పాలి. నేపాల్, భూటాన్, ఇరాన్, స్వీడన్, చైనా, నైజీరియా, నార్వే, ఇటలీ, ఫ్రాన్స్, మెక్సికో, తాస్మానియా, బ్రిటన్, స్కాట్ లాండ్, బ్రెజిల్ దేశాల్లో రచయిత చేసిన యాత్రానుభవాలు ఎంతో ఆసక్తిగా ప్రతి పాఠకుడు తెలుసుకుంటాడు.

ఇరాన్ ఒయాసిస్సుల ఒడ్డున పరచుకున్న గ్రామాల నుంచి, ఫ్రాన్స్ దేశంలోని పినరీస్ పర్వతాల వరకూ మనల్ని ప్రేమ యాత్రలో ముంచి తేల్చుతారు రచయిత. ఇరాన్ ఇసుక ఎడారిలుండే చోట భూగర్బంలో ఉండే ఆనాటి నీటి కుళాయిల వ్యవస్థ , ఐరోపాకి వెళ్లే సిల్కు రూటు గురించిన ఎన్నో ఆసక్తికర అంశాలు మన కళ్లముందు కదలాడతాయి. చైనాలో రకరకాల మాంసాహారులే కాదు శాకాహారాన్నే ఇష్టపడే ప్రాంతాలు కూడా ఉంటాయనే అంశాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. మహాకవులైన సాదీ, హఫెజ్ ల గురించి పరచయం ఏర్పడుతుంది.

రెండవ ప్రపంచ యుద్దంలో చైనా సైన్యాలకి వైద్య సేవలు అందించిన భారతీయ డాక్టర్ ద్వారకానాధ్ కొట్నీస్ గురించి తెలుసుకుంటాం. మనకి ఇంట్లో పూజ గది ఉన్నట్లుగానే, చైనాలో పెయింటింగ్స్ కోసం ఓ గది ఉంటుందనే విషయం చాలా ఆసక్తిగా ఉంటుంది. తన అభిరుచికి తగిన వ్యక్తిని ఇంటర్ నెట్ ద్వారా శోధించి, వారితో పరిచయం ఏర్పరుచుకుంటారు రచయిత. అంతేకాదు అలా పరిచయం అయిన వారిని, వారి దేశాన్ని వెతుక్కుంటూ వెళ్లే విధానం ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అలా చేసిన ఆఫిక్రా పర్యటనలో ఆఫికా ఖండంలో గొప్ప నైజీరియా గాయకుడు ఫేలా కూటీ మనకి పరిచయం అవుతాడు. నైజీరియాలో ప్రతి నెలలో చివరి శనివారం అందరికీ శెలవు. ఆ రోజుని శానిటరీ సాటర్ డే గా పిలుస్తారట. ఆరోజు అందరూ రోడ్లపై కనిపించరట. కేవలం తమ పరిసరాలను శుభ్రం చేసుకోడానికే పరిమితం అవుతారట. ఈ విషయం ఎంతా బాగుందో కదా అనిపిస్తుంది.

అంతేకాదు దేవతలు దీవించిన దేశం నార్వే అంటూ వర్ణిస్తూనే, సిటీల్లో ‘ No home, Two Hungry Children ‘ అనే బోర్డులు పట్టుకున్న బిక్షగాళ్లూ ఉంటారని రాశారు.ఇటలీ దేశ విశేషాలు, వింతలు, అందాలతో పాటుగా ప్రముఖ శిల్పి మైకేలాంజి గురించి రచయిత చేసిన ప్రస్తావన అద్భుతం. ఆనాడు రెండు రొట్టె ముక్కలు, ఒక వెన్న ముక్కతో మాత్రమే జీవించిన మైకేలాంజిలో చెక్కిన శిల్పాలు ఈనాడు రోమ్ నగరానికి మిలియన్ల ఆదాయాన్ని తెచ్చి పెడుతున్నాయి. అన్న రాతలు గుండెల్లోకి నేరుగా దూసుకుపోతాయి.
అయిదు వందల సంవత్సరాల కళాకృషిని, గంటల్లోనూ, రోజుల్లోనూ చూడడం ఎవరికీ సాధ్యం కాదంటూ రోమ్ నగర విశేషాలను వర్ణిస్తారు. అంతేకాదు సాంస్కృతిక, పునరుజ్జీవనం జరిగిన ఈ రోమ్ నగరాన్ని దర్శించడం వల్ల నాకు మరింత కొత్త శక్తి, ఆలోచనలు కూడా వచ్చాయన్న రచయిత మాటలు నిజమనిపించక మానవు.మన ఊర్లో, మన వీధుల్లో తిరిగినంత సులభంగా ప్రపంచం అంతా తిరుగుతూ, విభిన్నమైన తన అనుభవాలతో ప్రతి పాఠకుడిలో భ్రమణకాంక్షను రేకెత్తిస్తారు రచయిత. మనసుకి నచ్చిన ప్రదేశాలకి వెళ్లి అక్కడి ప్రజలతో కలసిపోతూ రచయిత చేసిన ప్రయాణాలు ప్రతి ఒక్కరి మనసుని తాకుతాయి.
నూటా పద్దెనిమిది దీవుల్ని కలిపి నిర్మించిన వెనిస్ నగరాన్ని రచయిత వర్ణించిన తీరుకు హ్యాట్సాఫ్ చెప్పక తప్పదు. ఈ క్రమంలో ప్రతి పాఠకుడికి మార్క్ పోలో చరిత్రను మరోసారి చదవాలనే ఉత్సుకత కలుగుతుంది. వెనిస్ నగరానికి ప్రత్యేక ఆకర్షణగా ఉండే శాన్ మార్క్ చర్చి గురించిన విశేషాలు చదువుతున్నంత సేపూ మన మనసు ఆ చర్చి పరిసరాల్లోనే భ్రమించక మానదు. ఫ్రాన్స్ లో ఉండే పినరీస్ పర్వత శ్రేణులు, పచ్చని రంగు పులుముకున్నకనుచూపు మేర కనిపించే పచ్చికబైళ్లు, లోయలు, సముద్రాలు, సుదూర బస్సు ప్రయాణాలు, పక్షుల కిలకిలా రావాలు, విభిన్న మనుషుల్లో ఉండే స్నేహ మాధుర్యం ఇలా ఒకటా రెండా ఈ పుస్తకం నిండా అనేక వింతలు, విశేషాలే. ఈ పుస్తకాన్ని చదువుతున్నంత సేపూ మనసు ఆయా ప్రదేశాల్లో భ్రమిస్తూనే ఉంటుంది.

నిరంతర ప్రయాణాలతో అలసిన తన పాదాలు సప్త సముద్రాల తీరాల అలల ఒడిలో అలసట తీర్చుకున్నాయి అని ఓ చోట రాసిన రాతలు… మన మనసుకి చేరుతాయి. ఇన్ని దేశాలు తిరిగా, ప్రపంచం అంతా నాదేనని, అందరూ నావాళ్ళేననీ బలంగా చెప్పిన మాటలు ప్రపంచ మానవులంతా ఒక్కటే అనే గొప్ప స్ఫూర్తిని రగిలిస్తుంది. ఉత్తర అమెరికా ఖండంలో ఉండే మెక్సికో దేశం గురించిన అనేక విషయాలు ఈ పుస్తకం ద్వారా చాలామందికి లోతుగా తెలుస్తుంది. మన భారతదేశ జాతీయ జెండాకు, మెక్సికో దేశ జెండాకు పోలిక ఉందనే ఆంశాన్ని ఓ సంఘటనలో రచయిత చెప్పిన తీరు చాలా గర్వంగా అనిపిస్తుంది. అందమైన నగరాలు, విలాసవంతమైన జీవన విధానాల మధ్య సాగే కళా సాంస్కృతిక వైభవాలు కూడా మనం ఆస్వాదించవచ్చు. అంతేకాదు. మన భారతీయుడైన M.N. రాయ్ ఆ దేశంలో కమ్యూనిష్టు పార్టీని స్థాపించిన విషయాలు కూడా చాలా గొప్పగా చొప్పించారు.

జీవితం ఎంతోమంది మిత్రుల్ని అందిస్తుంది. అందుకోవడానికి మనం ఎంత వరకూ సిద్ధంగా ఉన్నామన్నది మన చేతుల్లోనే ఉందనే మర్మం మనకు ఈ పుస్తకంలో ప్రతి సంఘటన గుర్తు చేస్తుంది. చదివే ప్రతి పాఠకుడిని ఈ పుస్తకం చాలా కాలం వెంటాడుతుంది. ఆయన కలసిన, చెప్పిన ప్రతి వ్యక్తి మనకు తెలియకుండానే పరిచయం అవుతారు.
తాస్మానియా దేశపు అందాలు, అక్కడ ఉండే అందమైన బీచ్ లే కాదు. ఆ దేశం ఎలా అభివృద్ది చెందింది. అక్కడి స్థానికులపై ఏళ్ల తరబడి బ్రిటిష్ వాళ్లు ఏవిధంగా అణగదొక్కారన్న అంశాలు మన దేశ స్వతంత్ర్య పోరాటాన్ని గుర్తుకు తెస్తుంది.

చివరగా ఈ పుస్తకంలో బ్రెజిల్ దేశంలో తాను చేసిన పర్యటన వివరాల్ని పొందుపరచారు. అందులోనూ ముఖ్యంగా కురితిబా అనే నగరానికి సంబంధించిన వివరాలు, ఆ నగరంలో ఉండే పర్యాటక ప్రదేశాలు, పచ్చని పార్కులు, చల్లనైన వాతవారణం, ఏడాదిలో రెండు నెలలు మాత్రమే కనిపించే సూర్యుడు, ఆ సమయంలో అక్కడ ప్రజల గమ్మత్తైన జీవన విధానం ప్రతి ఒక్కరినీ ఒక్కసారైనా బ్రెజిల్ దేశంలో తిరగాలనిపించక మానదు. అంతేకాదు బ్రెజిల్ దేశస్తులకు కుక్కలపై ఉండే ప్రత్యేకమైన ప్రేమను కూడా తెలుసుకుంటాం. అంతేకాదు ప్రపంచ యాత్రికులందరికీ ఎంతగానో ఉపయోగపడే ఎస్పరాంతో భాష గురించి కూడా తెలుసుకుంటాం.
ఈ పుస్తకం ద్వారా కేవలం ప్రయాణాలే కాదు. ప్రయాణాలు ఎలా చెయ్యాలో అనేది చాలా స్పష్టంగా తెలుసుకుంటాం. తన లండన్ మిత్రుడు రామానాయడు ఓ చోట రచయిత ఆదినారాయణ గారి గురించి చెబుతాడు – నువ్వు ఏదో సరదా కోసం వచ్చి తిరిగే విలాస యాత్రికుడివి కాదనీ, మనసుకి నచ్చిన ప్రదేశాల గురించి అధ్యయనం చేయడానికి వచ్చిన పండితుడువని. ఆ మాటలు అక్షర సత్యాలుగా ప్రతి ఒక్కరికీ అనిపిస్తాయి.
మనం ధైర్యంగా ముందుకు పోతూ ఉంటే మనకి సాయం చేసే వారు ప్రపంచం అంతా ఉన్నారు అని పూర్తిగా నమ్మకం కుదిరింది నాకు అని రాసుకున్నారు ప్రొఫెసర్ ఆదినారాయణ. ఈ మాటలు అందరికీ ఎంతోకొంత ఉపయోగపడక మానవు.

Read also >>>>>   గాంధీ కోటు,బూటు నుంచి ‘కొల్లాయి’లోకి ఎందుకొచ్చారో .

Sharing is Caring...
Support Tharjani

One Response

  1. యూ.వి.రత్నం October 16, 2020
error: Content is protected !!