Sex Trafficking vs Terrorist Groups …………………………….
ఉగ్రవాద గ్రూపులు మిలిటెంట్లకు అమ్మాయిలను ఎరగా వేస్తున్నాయి. మిలిటెంట్లపై పట్టు పెంచుకునేందుకు ఈ విధానాన్ని అనుసరిస్తున్నారు. ఈ విధానం ఈ నాటిది కాదు. చాలా ఏళ్లగా సాగుతున్నది. ఆఫ్ఘన్ స్థాన్ ను స్వాధీనం చేసుకున్న తాలిబన్లు కూడా అదే బాటలో పయనిస్తున్నారు. ఆకర్షణీయమైన జీతాలతో పాటు తాత్కాలిక భార్యలు లేదా సెక్స్ బానిసలను ఆఫర్ చేస్తూ మిలిటెంట్లను తమ గ్రూప్ ల్లో చేర్చుకోవడానికి అనుసరించే ఒక వ్యూహం ఇది.
ఆయుధాలు, డ్రగ్స్, నల్లమందు వ్యాపారాలు నిర్వహిస్తున్న ఈ ఉగ్రవాద గ్రూపులు అమ్మాయిల అక్రమ రవాణా కార్య కలాపాలు కూడా చేస్తున్నాయి. బలవంతంగా లేదా కిడ్నాప్ చేసి తెచ్చిన అమ్మాయిలను ఇతరులకు అమ్మేస్తున్నారు. తద్వారా వచ్చే సొమ్మును తమ కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నారు. ఈ సెక్స్ ట్రాఫికింగ్ ఉగ్రవాదుల ఆర్ధిక శక్తిని పెంచుతుంది.
తద్వారా తాలిబన్లు రాజకీయ అధికారాన్నికాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. తాలిబన్లు 15 నుండి 45 సంవత్సరాల వయస్సులో ఉన్న వివాహిత లేదా వితంతువుల జాబితాలను కూడా తయారు చేసినట్టు ఆ మధ్య వార్తలు వెలువడ్డాయి. మహిళలను సెక్స్ బానిసలుగా మారిస్తే పదేపదే పలుమార్లు వారిని అమ్మవచ్చు.ఒక చోట నుంచి మరొక చోటుకు తరలించ వచ్చు.
గతంలో కూడా తమ విధ్వంస రచనను కొనసాగించేందుకు ఐఎస్, బోకో హరమ్ సంస్థలు ఇదేవిధంగా చేశాయి. బ్రిటన్‌కు చెందిన హెన్రీ జాక్సన్ మరో రీసెర్చర్ నికితామాలిక్ వంటి వారు ఉగ్ర వాద సంస్థల వికృత విన్యాసాలను తెలియజేస్తూ నివేదిక లు వెలువరించారు. నైజీరియాలోని బోకోహరం, సిరియాలో ఐఎస్ విశృంఖల ధోరణి తో మహిళలను బానిసలుగా మార్చేశాయి.
2009లో బోకోహరం ఇస్లామిస్ట్ మిలిటెంట్ గ్రూపులు నైజీరియాలోని వేలాది మహిళలు,బాలికలను అపహరించి నరక కూపంలోకి నెట్టేశాయి. అదే రీతిలో 2014 ఏప్రిల్‌లో ఓ స్కూల్ నుంచి కిడ్నాప్ చేసిన 200 మందికి పైగా బాలికలను కుక్‌లు, సెక్స్ బానిసలు గా మార్చేశారు. చివరికి ఆత్మాహుతి బాంబర్లుగా బోకోహరం మార్చివేసిందని వార్తా కథనాలు ప్రచారంలోకి వచ్చాయి.
ఈ ఉగ్రవాద సంస్థలు కొత్త తరం మిలిటెంట్లను తయారుచేసేందుకు అమాయక బాలికలు, మహిళలను బలవంతంగా బానిసలు గా మార్చిన ఉదాహరణలు చాలానే ఉన్నాయి. 2014లోనే సిరియాలోని సింజార్‌కు సమీపంలోని ఓ గ్రామాన్ని చుట్టుముట్టిన ఐఎస్ ఉగ్రవాదులు పెద్దసంఖ్యలో యాజిదీ మహిళలను అపహరించారు.
ఐఎస్ మిలిటెంట్ల వికృత చేష్టలతో ఆ మహిళలు నరకం చవిచూసారు. అప్పట్లోనే 5000 మంది యాజిదీలను ఊచకోత కోశారు. 7000 మంది మహిళలు, బాలికలను బలవంతంగా సెక్స్ బానిసలుగా చేశారని ఐరాస పరిశోధకులు అంచనా వేశారు. అప్పట్లో అమెరికా జోక్యంతో కొంతమంది మహిళలు .. పిల్లలు బయటపడ్డారు.
ఉగ్ర వాద సంస్థలు ఆర్ధికంగా బలోపేతం కావడం కోసమే సెక్స్ ట్రాఫికింగ్ మార్గాన్నిఎంచుకున్నాయని అంటారు. కొన్నిసందర్భాల్లో పెద్ద మొత్తాలను డిమాండ్ చూస్తూ కిడ్నాపింగ్‌లకు దిగుతున్నాయనే ఆరోపణలు లేకపోలేదు. 2016లో కిడ్నాప్‌ల ద్వారా ఐఎస్ 3 కోట్ల డాలర్లను ఆర్జించినట్టు అంచనా.
———KNM