Rare Services ………………………………..
“మీ హాస్పిటల్ లో ఒక బెడ్ కావాలి ఇస్తారా? డాక్టర్” సైదాబాద్ లో మా ఇంటికి అతి సమీపంలోని జయానర్సింగ్ హోం లో గైనకాలజిస్ట్ డాక్టర్ ను అడిగాను. ఆమె “ఎవరికి” అని అడిగారు.”మా అమ్మగారికి కావాలి. ఆమె కేన్సర్ పేషంట్ అవసాన దశలో ఉన్నారు. బిపి సుగర్ హై ఫ్లక్చ్యువేషన్లు వస్తున్నాయి. ఇంట్లో ఆమెను చూసుకోవడం కష్టం అవుతోంది” అన్నాను. “ఓహ్ టెర్మినల్లీ ఇల్ పేషంటా. నో ప్రాబ్లం. నేను మీకు ఒక అడ్రస్ ఇస్తాను అక్కడికి వెళ్ళండి. అది కేస్సర్ పేషంట్లకు ఏర్పాటు చేసిన స్పర్శ్ హాస్పీస్” అన్నారు.
Sparsh Hospice is a charitable palliative care center treating terminally ill cancer patients. It is founded by members of Rotary Club. All services are FREE to all patients. “Death is inevitable and final. A stage is reached in a cancer patient’s life when there is no hope of controlling the disease any further.”
ఆమె మాటలకు నేను ఆశ్చర్యపోయాను. ఎందుకంటే నేను జర్నలిస్టును. హైదరాబాద్ లో ఇటువంటి హాస్పీస్ ఉన్నదని కూడా నాకు తెలియదు.
డాక్టర్ కు థాంక్స్ చెప్పి బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 లోని స్పర్శ్ హాస్పీస్ కు వెళ్ళాను. డ్యూటీ నర్సు చాలా ఆదరంగా రిసీవ్ చేసుకొంది. ఆమె సిస్టర్ అని ఆమె చెబితేకానీ నాకు తెలియలేదు. సిస్టర్ మామూలు పంజాబీ డ్రెస్ లో ఉంది. హాస్పీస్ లోని సిస్టర్లు యూనిఫాం వేసుకోరు. మామూలు సివిల్ డ్రస్ లోనే ఉంటారు. నన్ను చూస్తూనే చాలా చిన్నవయసు అన్నట్టు చూసింది. కేసు ఫైల్ మీద ఫిమేల్, 76 ఏళ్ళు అని ఉంది చూసింది. “మీ అమ్మగారి కోసమా?” అన్నది. నేను నవ్వి “అవును సిస్టర్. నేను రావడానికి ఇంకా టైం పడుతుంది” అన్నాను
ఆమె నా ధైర్యం చూసి నవ్వింది. డ్యూటీ డాక్టర్ సుశీల్ రెడ్డి కి సబ్మిట్ చేస్తాను రేపు ఫోన్ చేస్తాను అన్నది. మర్నాడు నాకు వారి నుంచే ఫోన్ “పేషంట్ ను ఎప్పుడు తీసుకువస్తారు?” అని అడిగారు. నేను ” నేనే వచ్చి మాట్లాడతాను డాక్టర్” అన్నాను.మనసులో చాలా సందేహాలు. బంజారాహిల్స్ అంటే ఒళ్ళు బలిసినోళ్ళ జాగా. అక్కడ పెట్టారంటే వీళ్ళు ఏ రేంజ్ లో వసూలు చేస్తారో అనుకుంటూ వెళ్ళాను.డాక్టర్ సుశీల్ రెడ్డి గారు ఉన్నారు.” మీ అమ్మగారి ఫైల్ చూశాను. ఎప్పుడు తీసుకువస్తారు” అన్నారు.అమ్మకూ నాకూ కేన్సర్ వచ్చిన దగ్గర నుంచీ ఆ క్షణం వరకూ వేలు కట్టాలి, లక్షలు సిద్ధం చేసుకొని డబ్బు ఎప్పుడు తీసుకువస్తారు అన్నవారే కానీ పేషంటును ఎప్పుడు తీసుకువస్తారు అన్నవారులేరు.
“సార్ ఇక్కడ ఫీజులు అవీ ఏం కట్టాలి? ఎంతకట్టాలి?” అని అడిగాను. “మీరు ఏం కట్టనవసరంలేదు. ఇక్కడ అంతా ఫ్రీ. పేషంటుకు ఏ మందులు అయినా అవసరమైతే ఆ మందులు కూడా మేమే ఇస్తాము” అన్నారు. నేను తేరుకోవడానికి చాలా సేపు పట్టింది. భూమి మీద ఆసుపత్రులు అనే కబేళాలే కాకుండా ఇటువంటి పుణ్యస్థలాలు కూడా ఉన్నాయా? అని అనిపించింది. అమ్మను తీసుకు వెళ్ళాను. నర్సులు, ఆయాలు, డాక్టర్లు వచ్చి వెళుతున్నారు.అమ్మ మూడు రోజులు బాగానే ఉంది. నాలుగో రోజు అనుమానం వచ్చింది. “ఏంట్రా నన్ను వృద్ధాశ్రమంలో చేర్చావా? నువ్వు వెళ్ళిపోతావా?” అని అడిగింది.
అమ్మకు తాను వచ్చింది కూడా ఆసుపత్రే అని తెలియదు. అలా తెలియకుండా ఉండడమే హాస్పీస్ ప్రత్యేకత. “కాదు ఇది ఆసుపత్రి” అన్నాను. “మరి మన డాక్టర్ గారు రావడంలేదే?” అని అడిగింది.”ఇక్కడ డాక్టర్ మారారు. రెడ్డిగారు. ఫణిశ్రీగారు అని కొత్తడాక్టర్లను పెట్టాను. అమెరికా డాక్టర్లు” అన్నాను. గైరియాట్రిక్ అనే వైద్యవిభాగంలో స్పెషలైజేషన్ చేసిన డాక్టర్లు వాళ్ళు. ఇది ఎక్కువగా అమెరికాలో ఉంది. అంటే వీరు వృద్ధాప్యం వచ్చిన వారికి ప్రత్యేక వైద్యులు. మనకు చైల్డ్ స్పెషలిస్టులు ఎలా ఉన్నారో అలా అన్నమాట.
డాక్టర్ ఫణిశ్రీ అంటే మా అమ్మకు చాలా ఇష్టం. “చక్కగా చిలకలా ఉంటుంది. నాతో నవ్వుతూ నా కూతురులా మాట్లాడుతుంది. రోజూ వస్తోంది. ఆమె డాక్టరా?” అని ఆశ్చర్యపోయింది. హాస్పీస్ లో డాక్టర్లు వైట్ కోటు కూడా వేసుకోరు.”అవును. చాలా పెద్ద డాక్టర్ అమెరికాలో చదువుకొని వచ్చింది” అన్నాను.”ఎంత సాధారణంగా ఉందిరా?” అని ఆమె ఆశ్చర్యపోయింది.రోజూ ఆయాలు, నర్సులు, డాక్టర్లతో అమ్మ సంతోషంగా ఉంది. దాదాపు నెల గడవబోతోంది అనగా ఒకరోజు డాక్టర్ “ఈ రోజు గడవడం కష్టమే” అన్నారు.సాయంత్రం వచ్చి చూసి తీసుకుపోవచ్చు అన్నారు.
రాత్రికి ఇంటికి ఎత్తుకు వచ్చాను. మర్నాడు ఉదయం మళ్ళీ ఎత్తుకువెళ్ళాము.సరిగ్గా పదిరోజుల క్రితం నాకు స్పర్శ్ హాస్పీస్ నుంచీ ఎస్ ఎం ఎస్ వచ్చింది. అక్టోబర్ 14న హాస్పీస్ పాలియేటివ్ కేర్ ఉత్సవం జరుపుతున్నాము రండి అని ఆహ్వానం.తమ ఆత్మీయులతో కలసి చివరి క్షణాలు పంచుకున్న వారంతా అక్కడికి వచ్చారు.అక్కడే ఉన్న ప్రస్తుతం పేషంట్లు కూడా వచ్చారు.వారిలో నాకు ఒక కొత్త కుర్ర స్నేహితురాలు దొరికింది. చాలా చిన్నవయసు అమ్మాయి. నాతో నవ్వుతూ మాట్లాడింది.
సిద్దిపేట నుంచీ ఒక మిత్రుడు తన చిన్నారి కుమారుడిని తలచుకోవడానికి వచ్చాను అని అన్నాడు. ఒక వృద్ధ దంపతులు తమ కుమారుడిని తలచుకోవడానికి వచ్చాము అన్నారు. మహబూబ్ నగర్ నుంచీ ఒక లేడీ డాక్టర్ తన ఆత్మీయులను తలచుకోవడానికి వచ్చామని చెప్పారు. ఒక భర్త తన భార్యను తలచుకోవడానికి వచ్చాను అన్నారు. ఈలోగా చాలా విచిత్రం గా సభ ప్రారంభం అయింది.
రోహిణితల్లి ముందుగా వచ్చి హాస్పీస్ లో సేవ చేస్తున్న సిబ్బంది.. కార్యనిర్వాహకుల చేత దీపాలు వెలిగింపచేశారు. తరువాత ఆత్మీయులను తలచుకుని ఒక్కొక్కరిని వచ్చి దీపాలు వెలిగించి శ్రద్ధాంజలి ఘటించారు.ఒక కుమారుడుని కోల్పోయిన తండ్రి తానుపడిన బాధలు గుర్తుతెచ్చుకుంటూ తన కుమారుడిని సదా గుర్తు చేసుకోవడానికి అద్భుతమైన సేవ ప్రారంభించానని చెప్పారు. తాను ఉండే ఏరియాలో శరీరాన్ని చలువ పేటికలో ఉంచడానికి ఒక రాత్రికి వేల రూపాయలు వసూలు చేస్తున్నారని.. తాను ఉన్న ఏరియాలో వారికి అంతిమ సేవ చేయడం కోసం శరీరాన్ని ఉంచే చలువ పేటిక తయారు చేయించానని చెప్పారు.
ట్రస్ట్ చేస్తున్న సేవలను వివరిస్తూ సిఇఓ రామ్మోహన్ రావు వివరించారు. ఒక ఆత్మీయుని కోల్పోయిన దంపతులు మాట్లాడుతూ పేషంట్లకు హరిత మైదానాలు, సుందర దృశ్యాలు కనిపించేలా నిర్మించడం కేరళలో చూశానని అటువంటి నిర్మాణాలు ఇక్కడ కూడా చేపట్టడం తమకు సంతోషంగా ఉందని అన్నారు. కొత్త కుర్ర స్నేహితురాలు మాట్లాడుతూ తనకు ఇంట్లో కన్నా ఇక్కడే చాలా బాగుందని చెప్పింది.నేను కూడా అమ్మను తలచుకొని దీపంవెలిగించి రెండు మాటలు మాట్లాడతానని మొదలుపెట్టి చాలాసేపు మాట్లాడాను
అమ్మ అక్కడ ఉండగానే మహబూబ్ నగర్ నుంచీ ఒక పేషంటు వచ్చాడు. అతని అంత్యక్రియలకు కూడా స్పర్శ్ హాస్పీసే డబ్బులు ఇవ్వడం నేను గమనించాను. అదే చెప్పాను. ఇటువంటి ఆసుపత్రి నేను ఎక్కడా చూడలేదు. జీవిత చరమాంకంలోని వ్యక్తులకు ఒక వైద్యశాస్త్రరీత్యా సేవచేస్తూ, ప్రశాంతమనస్సును అందిస్తున్న సిబ్బందిని చూసి అసూయగా ఉందని చెప్పాను.
పాలియేటివ్ కేర్ అంటే ఏమిటో ఇప్పటికి చాలామందికి తెలియదు. మహాభారతంలో భీష్ముడు అంపశయ్య మీద ఉన్న 58 రోజులే పాలియేటివ్ కేర్. చరమాంకంలోని కేన్సర్ పేషంట్లకు ఉచితంగా సేవలు చేస్తున్న స్పర్శ్ హాస్పీస్ వివరాలు అవసరమైనవారికి అందించండి. అవసానాలయాలలో మరణం కోసం వేచి చూస్తూ కేన్సర్ పేషంట్లు ఉన్నారు.
వివరాలకు:
స్పర్శ్ హాస్పీస్
బంజారాహిల్స్
040 2338 4039
94904 48222
——————————-
——— ఏలూరిపాటి వెంకట రాజ సుబ్రహ్మణ్యం