IRCTC Ganga Ramayan Yatra: హైదరాబాద్ నుంచి కాశీకి ఫ్లైట్ టూర్ ఇది ..వారణాసిలో కాశీ విశ్వనాథ ఆలయం, అయోధ్యలో రామమందిరం చూడాలనుకునే భక్తుల కోసం ఐఆర్సీటీసీ టూరిజం ప్రత్యేక టూర్ ప్యాకేజీ ప్రకటించింది. ‘గంగా రామాయణ్ యాత్ర’ పేరిట హైదరాబాద్ నుంచి ఈ టూర్ ని నిర్వహిస్తోంది.
విమానంలో పర్యాటకుల్ని తీసుకెళ్లి వారణాసి, అయోధ్య, నైమిశరణ్య, ప్రయాగ్‌రాజ్, సార్‌నాథ్‌లోని ఆలయాలను చూపిస్తుంది.ఇది 5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ. ఈ టూర్ ప్యాకేజీ మే 25 న అందుబాటులో ఉంటుంది.
ఐఆర్‌సీటీసీ గంగా రామాయణ్ యాత్ర మొదటి రోజు హైదరాబాద్ లో ప్రారంభం అవుతుంది. ఉదయం 9.15 గంటలకు బయలు దేరి 11.15 గంటలకు వారణాసి చేరుకుంటారు. హోటల్ లో చెకిన్ అయిన తర్వాత కాశీ విశ్వనాథ ఆలయం, గంగా ఘాట్ సందర్శించవచ్చు. రాత్రికి వారణాసిలో బస చేయాలి.
రెండో రోజు ఉదయం సార్ నాథ్ బయల్దేరాలి. మధ్యాహ్నం తిరిగి వారణాసి చేరుకోవాలి. సాయంత్రం ఖాళీ సమయం ఉంటుంది. ఘాట్స్ సందర్శించవచ్చు లేదా షాపింగ్ చేయొచ్చు. రాత్రికి వారణాసిలో బస చేయాలి.
మూడో రోజు వారణాసిలో చెకౌట్ అయి ప్రయాగ్‌రాజ్ బయల్దేరాలి. అలోపి దేవి ఆలయం, త్రివేణి సంగమం చూడొచ్చు. సాయంత్రం అయోధ్యకు బయల్దేరాలి. రాత్రికి అయోధ్యలో బస చేయాలి. నాలుగో రోజు అయోధ్య ఆలయ సందర్శన ఉంటుంది. మధ్యాహ్నం లక్నో బయల్దేరాలి. రాత్రికి లక్నోలో బస చేయాలి.
ఐదో రోజు నైమిశరణ్య ఫుల్ డే టూర్ ఉంటుంది. సాయంత్రం తిరిగి లక్నో చేరుకోవాలి. రాత్రికి లక్నోలో బస చేయాలి.ఆరో రోజు బారా ఇమాంబారా, అంబేద్కర్ మెమోరియల్ పార్క్ సందర్శన ఉంటుంది. ఆ తర్వాత హైదరాబాద్ కి తిరుగు ప్రయాణం ప్రారంభం అవుతుంది. లక్నోలో సాయంత్రం 6 గంటలకు ఫ్లైట్ ఎక్కితే రాత్రి 8 గంటలకు హైదరాబాద్ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.
ఐఆర్‌సీటీసీ గంగా రామాయణ్ యాత్ర టూర్ ప్యాకేజీ ప్రకారం కంఫర్ట్ ప్యాకేజీ ధరలో ఒక్కరు ప్రయాణించాలనుకుంటే రూ. 36,850 చెల్లించాలి. ఇద్దరు వ్యక్తులు కలిసి ప్రయాణిస్తే ఒక్కొక్కరు రూ.29,900 అవుతుంది. ముగ్గురు వ్యక్తులు కలిసి ప్రయాణిస్తే రూ.28,200 చెల్లించాలి.
5 నుంచి 11 సంవత్సరాల వయసు ఉన్న చిన్నారులకు కూడా టికెట్ ధరలు నిర్ణయించారు. మే నుంచి జూన్ నెల వరకు ఈ ధరలే అందుబాటులో ఉంటాయి. ఈ టూర్ ప్యాకేజీలో ఫ్లైట్ టికెట్స్, బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్, ఏసీ బస్సులో సైట్‌సీయింగ్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి. ఇతర వివరాలకు ఐఆర్‌సీటీసీ వెబ్ సైట్ చూడండి.