Investment Decissions……………………………………………….
చిన్న వయసులోనే ఆర్ధికంగా స్థిరపడాలంటే వివిధ సాధనాల్లో ఇన్వెస్టుమెంట్ చేయడం ఒక మార్గం. అప్పుడే డబ్బుకున్న ‘కాంపౌండింగ్ విలువ’ను అందిపుచ్చుకోవచ్చు.త్వరగా సంపదను సృష్టించు కోవచ్చు.ఈ తరానికి చెందిన యువతీ యువకులు పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారు.
స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, రియల్ ఎస్టేట్ వంటి మార్గాలను ఎంచుకుంటున్నారు. ఇది మంచిదే. అయితే ఆర్ధిక పరమైన అవగాహన ఏర్పరచుకోకుండానే ఇన్వెస్టుమెంట్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీనివలన సంపద సృష్టి లక్ష్యంలో తడబాటుకు గురవుతున్నారు.
పెట్టుబడి పెట్టే విషయంలో ఆర్థిక అవగాహనను పెంచుకోకపోవడం యువత చేసే తప్పుల్లో ఒకటి గా చెప్పుకోవచ్చు. ఆర్థిక అంశాలపై స్పష్టమైన అవగాహన ఏర్పరచుకోనంత వరకు సరైన ఇన్వెస్ట్ మెంట్ నిర్ణయాలు తీసుకోవడం కష్టం. కొంతమంది ఎవరో ఇచ్చిన టిప్స్ పై ఆధారపడి మదుపు చేస్తుంటారు. కొన్ని సార్లు ఈ టిప్స్ క్లిక్ అవుతుంటాయి. మరి కొన్ని సార్లు ఫెయిల్ అవుతుంటాయి.
అందుకే పెట్టుబడికి ముందే కొంత కసరత్తు చేస్తే నష్టాలు రాకుండా జాగ్రత్త పడవచ్చు. ప్రాథమిక ఆర్థిక అంశాలపై అవగాహన పెంచుకోవడం కోసం ఇప్పుడు ఎన్నో బుక్స్ అందుబాటులో ఉన్నాయి. ఆన్లైన్లో బోలెడంత సమాచారం ఉంది. కావాలంటే కొన్ని కోర్సులను కూడా చేయవచ్చు. ప్రాథమిక అంశాలపై పట్టు సాధించిన తర్వాత పెట్టుబడులు ప్రారంభిస్తే సంపద సృష్టిలో అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం సులభతరమవుతుంది.
అయితే ఇన్వెస్టుమెంట్ విషయంలో చాలామంది స్పష్టమైన లక్ష్యం ఏర్పరుచుకోరు. అందుకు కావాల్సిన ప్రణాళిక రూపొందించుకోరు. వాటి గురించి పెద్దగా ఆలోచించకుండానే మదుపు ప్రారంభించేస్తారు. ఫలితంగా పెట్టుబడి నుంచి మధ్యలోనే నిష్క్రమించి నష్టాలను మూటగట్టుకుంటారు.
సరైన ప్రణాళిక లేకుండా తెలివైన పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవడం …. లాభాలు గడించడం ముందే చెప్పుకున్నట్టు చాలా కష్టం. స్నేహితులు లేదా ఇతర సన్నిహితులు కొన్ని సందర్భాల్లో లాభం పొందడాన్ని చూసి యువకులు మదుపు పట్ల ఆకర్షితులవుతారు. ఇది ప్రమాదకరమైన మార్గం.
పెట్టుబడి అనేది దీర్ఘకాలిక లక్ష్యంతో కూడుకున్నది. అన్నివిధాలా పరిశీలించి మంచి షేర్లలో మదుపు చేయడం .. అదను చూసి అమ్మకాలు జరపడం .. లాభాలు ఆర్జించడం అంత సులభమైన విషయం కాదు. అదే కొంత అవగాహన పెంచుకుని వివిధ సాధనాల్లో మదుపు చేస్తే లాభాలు గడించే అవకాశాలు మెరుగుపడతాయి.
కేవలం షేర్లు మాత్రమే కాకుండా మ్యూచువల్ ఫండ్స్ . గోల్డ్ , స్థిరాస్తి రంగాల్లో ఒక పద్ధతి ప్రకారం మదుపు చేస్తే లాభాలు గడించడం కొంత సులువు అవుతుంది. అందుకే ముందుగా ప్రాథమిక అంశాలపై అవగాహన పెంచుకోవడానికి కొంత సమయం వెచ్చించాలి. అప్పుడే ఇన్వెస్ట్మెంట్ లో సరైన నిర్ణయాలు తీసుకోవడం సాధ్యమవుతుంది.