Super Plan of Chinese Engineers………………………………………………
మామూలుగా నది దాటడానికి వీలుగా ఆ ఒడ్డును ..ఈ ఒడ్డును కలుపుతూ వంతెనలు నిర్మిస్తారు. చైనా వాళ్ళు నది మధ్యలోనే వంతెన కట్టి దాన్నిహైవేగా మార్చేసి సంచలనం సృష్టించారు.ఇదేమీ పెద్ద కష్టం కాదని చైనా ఇంజనీర్లు అలాంటి వంతెన కట్టి చూపించారు.
గత తొమ్మిదేళ్లుగా ఈ హైవే మీదుగా వేలాది వాహనాలు దూసుకుపోతున్నాయి.ఈహైవే మధ్య చైనాలోని హుబీ ప్రావిన్స్‌లోని గుజావో జిల్లాలో ఉంది. ఈ ఓవర్-వాటర్ హైవే ను పూర్తిగా నీటిపై నిర్మించారు. ఈ హైవే పై ప్రయాణం అద్భుతంగా ఉంటుందని పర్యాటకులు చెబుతున్నారు.
జియాంగ్జీ నది మధ్యలో హైవే పై ప్రయాణిస్తుంటే దారికి ఇరువైపులా ప్రకృతి సిద్ధంగా ఉన్న కొండలు,కోనలు కనువిందు చేస్తాయి. నది మధ్యలో వాహనాలతో దూసుకెళ్తున్నఅనుభూతి పొందుతారు.
గు జావో ఓవర్‌వాటర్ హైవే అని పిలిచేఈ రహదారి పొడవు 10.86 కిలోమీటర్లు (6.74 మైళ్ళు). జి 42 సమీపంలో హుబే ప్రావిన్స్‌లోని జింగ్‌షాంగ్ కౌంటీ … ఝాజున్ వంతెనను ఈ హైవే కలుపుతుంది. తూర్పు చైనాలోని షాంఘైని నైరుతి చైనాలోని చెంగ్డూకి కలిపే హై-స్పీడ్ మార్గం ఇది.
అడవులను నరికివేయకుండా పర్యావరణాన్ని కాపాడుతూ సుందరమైన పర్వతాల మధ్యలో ప్రవహించే నదిపై సుమారు 4.4 కిలోమీటర్ల (2.73 మైళ్ళు) పొడవున ఈ రహదారిని ఇంజనీర్లు నిర్మించారు. లోయ మధ్యలో ప్రవహించే నదిపైన నిర్మితమైన ఈ హైవే నిర్మాణ పనులు 2013లో ప్రారంభమయ్యాయి.
2015లో ఈ హైవే పై వాహనాలను అనుమతించారు. ఈ ప్రాజెక్ట్ కోసం చైనా సుమారు 70 మిలియన్ డాలర్లు వెచ్చించిందని సమాచారం. గత తొమ్మిదేళ్లలో ఈ ‘రివర్ హైవే’ను ఎంతో మంది పర్యాటకులు సందర్శించారు. నది మధ్యలో ప్రయాణిస్తూ అద్భుతమైన అనుభూతిని తమ సొంతం చేసుకున్నారు.