A trip can be wonderful………………………………..
భారతదేశంలోని మొట్టమొదటి నదీ పర్యటక నౌక ‘ఎంవీ గంగా విలాస్ (Ganga Vilas)’ యాత్ర ఇవాళ వారణాసిలో మొదలైంది. వర్చువల్‌గా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ యాత్రను ప్రారంభించారు. గంగా, బ్రహ్మపుత్ర నదుల మీదుగా 3,200 కిలోమీటర్ల దూరం ప్రయాణించే ఈ లగ్జరీ నౌక.. ప్రపంచంలోనే అతిపెద్ద నదీ పర్యాటక నౌక.
భారతీయ సంప్రదాయం ఉట్టి పడేలా రూపొందించిన ఈ నౌకలో ప్రయాణికుల కోసం అత్యాధునిక సౌకర్యాలను కూడా ఏర్పాటు చేశారు. సూట్ గదులు, స్పా, జిమ్ సెంటర్ల వంటివి ఇందులో ఉన్నాయి. 51 రోజుల్లో 50 పర్యాటక స్థలాలు యాత్రీకులకు చూవుతారు.
ఉత్తరప్రదేశ్, బిహార్, పశ్చిమ బెంగాల్, అస్సాంతో పాటు బంగ్లాదేశ్ లో ని నదుల్లో ఈ నౌక ప్రయాణిస్తుంది. ప్రధాన నదులైన గంగా, బ్రహ్మపుత్రతో పాటు భాగీరధి, హుగ్లీ, బిద్యావతి, మాట్లా, బంగ్లాదేశ్ తోని మేఘన, పద్మ, జమున నదుల్లో విహరిస్తుంది. గంగా విలాస్ యాత్ర అస్సాంలోని దిబ్రుగఢ్ లో ముగుస్తుంది.
మొత్తం 51 రోజుల ఈ సుదీర్ఘ ప్రయాణంలో ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాల్లో నౌక ఆగుతుంది. వారణాసి లోని గంగా హారతి, విక్రమశిల యూనివర్శిటీ, సుందర్బన్ డెల్టా, కజీరంగా నేషనల్ పార్కు సహా పలు ప్రపంచ వారసత్వ ప్రాంతాలను ఈ యాత్రలో చూడొచ్చు.62 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పు ఉండే ఈ భారీ క్రూజ్ లో 18 సూట్లు ఉన్నాయి. 36 మంది ప్రయాణికులు ఇందులో ప్రయాణించవచ్చు.
మూడు సన్ డెక్ లు , జిమ్ సెంటరు, స్పా సదుపాయాలు ఉన్నాయి. నదీ వ్యూ కన్పించేలా ఉంటే పారదర్శక లాంజ్లో ప్రకృతి అందాలను ఆస్వాదించొచ్చు. ప్రయాణికులను ఆహ్లాదపర్చేలా నౌకలో కళా సాంస్కృతిక ప్రదర్శనలూ ఏర్పాటు చేస్తారు.
గంగా విలాస్ తొలి ప్రయాణంలో స్విట్జర్లాండ్ కు చెందిన 32 మంది ప్రయాణికులు పాల్గొంటున్నారు. మరి ఇంత ప్రత్యేకమైన ఈ గంగా విలాస్ (Ganga Vilas) టికెట్ ధర ఎంతో తెలుసా..? ఒక్కో ప్రయాణికుడికి రోజుకు దాదాపు రూ.25వేలు. అంటే ఈ యాత్ర మొత్తానికి రూ. 12.75 లక్షలకు పైగానే ఖర్చవుతుంది. అత్యంత ఖరీదైన ఈ యాత్ర ధనవంతులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. విదేశీ యాత్రికులను ఆకర్షించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇలాంటి నౌకలు మరిన్ని రావచ్చు.