దివాళా దిశగా పాకిస్తాన్ !

Sharing is Caring...

The looming crises…………………….

పాకిస్థాన్ (Pakistan) ఆర్థిక సంక్షోభంలో కూరుకు పోతోంది. విదేశీ మారక నిల్వలు ప్రమాదకర స్థాయిలో పడిపోతున్నాయి.ప్రస్తుత్తం అవి 5.8 బిలియన్ల డాలర్లకు తగ్గి, ఎనిమిదేళ్ల కనిష్ఠానికి చేరుకున్నాయి. మూడు వారాల దిగుమతులకే సరిపోనున్నాయని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ పాకిస్థాన్ నివేదిక చెబుతోంది.

దేశంలో గోధుమల కొరత కారణంగా అందరికి పిండి అందుబాటులో ఉండటం లేదు. సబ్సిడీలో లభించే గోధుమ పిండి కోసం వేలాది మంది ప్రజలు క్యూలలో నిలిచి గంటల కొద్దీ వేచి చూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా , సింధ్, బలూచిస్థాన్ వంటి ప్రాంతాల్లో తొక్కిసలాట జరిగినట్లు వార్తలు వచ్చాయి.

రేషన్ దుకాణాల వద్ద తోపులాటలు సర్వసాధారణమై నట్లు మీడియా కథనాలు వెలువడుతున్నాయి. దీంతో ప్రభుత్వం అప్రమత్తమై భద్రతా బలగాలను రేషన్ దుకాణాలవద్దకు పంపిస్తున్నాయి.
కాగా కొన్ని దుకాణాల వద్ద జరిగిన తోపులాటలు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తున్నాయి. ఉద్రిక్తతల కారణంగా కొందరు ప్రాణాపాయ స్థితిలోకి జారుకుంటున్నారు.

సింధ్ ప్రావిన్స్లోని ఒక దుకాణంలో పిండి తక్కువగా ఉండటంతో తొక్కిసలాట జరిగింది. దాంతో ఒక వ్యక్తి మృతి చెందాడు. తన ఆరుగురు సంతానం ఆకలి తీర్చేందుకు ప్రయత్నించిన వ్యక్తి చివరికి ప్రాణాలు కోల్పోయాడు. ఈక్రమంలో ప్రజల్లో తీవ్ర అసహనం నెలకొంటున్నది. 

సంక్షోభం నేపథ్యంలో గోధుమలు, పిండి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కేజీ పిండికి రూ. 150 ధర పలుకుతోంది.మరో వైపు ఇదే అదనుగా మిల్లు యజమానులు ధరలు పెంచుతున్నారు. కొన్నిచోట్ల 20 కేజీల పిండి ధర రూ.3,000కు చేరుకుంది. పాక్ చరిత్రలోనే ధరలు ఈ స్థాయికి పెరగడం ఇదే మొదటిసారి. 

బలూచిస్థాన్లో గోధుమల నిల్వలు నిండుకున్నాయి. ప్రస్తుత ఆహార సంక్షోభానికి గతేడాది వరదలు కూడా కారణం. పాక్ చరిత్రలోనే అవి అత్యంత దారుణమైన వరదలని ప్రపంచ వాతావరణ సంస్థ ప్రకటించింది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు.

ముఖ్యంగా వ్యవసాయంపై తీవ్ర ప్రభావం పడింది.ఈ పరిస్థితికి ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలే కారణమని ప్రస్తుత ప్రభుత్వ నేతలు విమర్శిస్తున్నారు. ఆర్థిక నిపుణులు పాక్ ఆర్థిక వ్యవస్థ దివాళాకు దగ్గరగా ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇదే పరిస్థితి కొనసాగితే .. ప్రభుత్వం ఆహార ధాన్యాలను దిగుమతులు చేసుకోలేక చేతులు ఎత్తేస్తే ఆహార సంక్షోభం నెలకొనే సూచనలున్నాయి.  ప్రజల్లో ఇప్పటికే ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి… హోమ్ మంత్రిపై చెప్పులు కూడా విసిరిన ఘటనలు చోటుచేసుకున్నాయి 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!