అన్నిపార్టీల టార్గెట్ కేసీఆరే !

Sharing is Caring...

Govardhan Gande ………………………………………………….

తెలంగాణ లో ముందుగానే రాజకీయ హడావుడి మొదలైంది. అన్నిపార్టీలు 2023 ఎన్నికలపై దృష్టి పెట్టి పలు కార్యక్రమాలు చేపడుతున్నాయి. ఎన్నికల్లో పైచేయి సాధించాలని కసరత్తులు చేస్తున్నాయి. దీంతో విమర్శలు, ప్రతి విమర్శలు, దూషణలు, భూషణలతో వాతావరణం మెల్లగా వేడెక్కుతున్నది. ఈ క్రమంలో ఎన్నికల్లో ఎవరు పై చేయి సాధిస్తారో ? అనేది చాలా ఆసక్తికరమైన ప్రశ్న. జవాబు లభించడం మాత్రం చాలా కష్టం. ఒక విషయం మాత్రం సుస్పష్టం. అందరి టార్గెట్ కేసీఆర్ అవుతారు. అందులో ఎలాంటి సందేహం లేదు.

తెలంగాణ ఇచ్చామని ఒక పార్టీ , తెచ్చామని మరొక పార్టీ , తమ సహకారం లేకుంటే ప్రత్యేక రాష్ట్రం వచ్చేదే కాదని ఇంకొక పార్టీ, ఒక్క నీటి చుక్కను కూడా పొరుగు రాష్టానికి వదులుకోబోమని ఓ కొత్త పార్టీ, రెండు కళ్ళ సిద్ధాంతంతో ఒంటి కన్ను మిగుల్చుకున్న మరో పార్టీ,.. తెలంగాణ ఏర్పాటుకు మద్దతు నిచ్చిన ఒక వామ పక్షం, ఇప్పటికీ తెలంగాణ ఏర్పాటు సరైంది కాదని వాదించే మరో వామ పక్ష పార్టీ, ఈ ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి.

ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ అపుడే ఎన్నికల నగారాను మోగించింది. తెలంగాణను తానే ఇచ్చానని చెప్పుకునే ఈ పార్టీ సన్నద్ధతను ప్రకటించినట్లుగా కొత్త సారథిని నియమించుకున్నది. తెలంగాణను “ఇచ్చి” కూడా రెండు ఎన్నికల్లో అధికారం పొందలేక పోయామే అనే దుగ్ధ ఆ పార్టీ నేతల మాటల్లో నిత్యం మనకు కనిపిస్తున్నది. కేసీఆర్ సారథ్యంలోని టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎలాగైనా కూల్చి వేయాలని పంతంతో కుతకుత లాడుతున్నది ఆ పార్టీ.

తెలంగాణా లో ఈ మారు ఎలాగైనా అధికారం సాధించాలని బలంగా కోరుకుంటున్న బీజేపీ ఎన్నికలు ఎపుడొస్తాయా చాలా ఆసక్తితో ఎదురు చూస్తున్నది.ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే మోడీ కేబినెట్ లోకి కిషన్ రెడ్డి ని తీసుకున్నారు. తెలంగాణలో “రాజన్నరాజ్యం” తీసుకువస్తానని “వైఎస్ఆర్ తెలంగాణ” పార్టీ ని వైఎస్ షర్మిల ప్రారంభించారు. మహిళలకు 50 శాతం సీట్లు కేటాయిస్తామని, బీసీల ప్రాతినిధ్యం పెంచుతామని .. ప్రజల పక్షాన నిలుస్తామని అంటోన్న షర్మిల వందరోజుల్లో పాదయాత్ర కూడా చేస్తామని ప్రకటించారు.

తెలుగు దేశం పార్టీ రెండుకళ్ల సిద్ధాంతంతో అటు ఆంధ్రాలో.. ఇటు తెలంగాణా లో జరిగిన ఎన్నికల్లో దారుణ పరాభవాలను ఎదుర్కొని చతికలపడింది. ఆ పార్టీలోఎలాంటి కదలికా లేదు. ఆ పార్టీ తెలంగాణ సారథే తన రాజకీయ భవిష్యత్తు కోసం అధికార పార్టీతో మంతనాలు సాగిస్తున్నారు. తనకు ఇతర పనులేమీ లేని సమయంలో దర్శనమిచ్చి నాలుగు డైలాగులు చెప్పి,ఓ పత్రికా ప్రకటన విడుదల చేసి మాయమయ్యే పార్ట్ టైం పొలిటీషియన్ జనసేన అధిపతి బీజేపీతో కలసి నడవాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఈ సారి తెలంగాణా ఎన్నికల్లో ఆయన వైఖరి ఏమిటనేది తేలలేదు.

ఇక హైద్రాబాద్ పార్టీ ఎంఐఎం పాత బస్తీలో తన సొంత ఎజెండాతో ఎన్నికలకు ఎపుడైనా సిద్ధంగానే ఉంటుoదన్న సంగతి కూడా తెలిసిందే. సీపీఐ,సీపీఎం లు నిరసనలు,ఆందోళనలతో ప్రజల్లోనే ఉంటున్నాయి. ప్రొఫెసర్ కోదండరాం సారధ్యంలోని టీజేఎస్ పార్టీ తన వ్యూహాల్లో తాను ఉన్నది. ఇక ఎన్నికలప్పుడు మాత్రమే వార్తల్లో ఉండే పార్టీల సంగతి తెలిసిందే.

కాగా అధికార టీఆర్ఎస్ పార్టీ హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో పట్టు బిగించే యత్నాల్లో ఉంది. ఈ ఉప ఎన్నిక కేసీఆర్ కు ప్రతిష్టాత్మకమైనది కావడంతో అక్కడ పోరు హోరాహోరీ గా సాగవచ్చు. పీసీసీ సారధి రేవంత్ కి ఈ ఉప ఎన్నిక తొలి సవాల్ కానుంది. ఇతర పార్టీలు పోటీచేస్తాయో లేదో చూడాలి. ఉప ఎన్నికలో గెలిచి తద్వారా తమకు ఎవరూ ఎదురు లేరని, 2023 లో కూడా తమదే ఆధికారం అని చాటి చెప్పాలనే వ్యూహాల్లో టీఆర్ ఎస్ నిమగ్నమైంది.

అదలా ఉంటే బీజేపీ నేత బండి సంజయ్ పాదయాత్ర ఇవాళ్టి నుంచి మొదలవుతున్నది. త్వరలో రేవంత్ .. షర్మిల లు కూడా పాదయాత్రలు మొదలు పెట్టనున్నారు. అందరూ రంగంలోకి దిగితే రంజైన విమర్శలు … రసవత్తరమైన ప్రతి విమర్శలతో రాజకీయ వాతావరణం వేడెక్కడం ఖాయం.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!