వార్ధక్యం లేని పాటల్లో అదొక ఆణిముత్యం!!

Sharing is Caring...

నర్తనశాలలో ద్రౌపదిగా, మారువేషంలో విరాట రాజు కొలువులో సైరంధ్రి గా సావిత్రి నటన ఆమె కెరీర్ లోనే ఒక మైలురాయి. ఈ సినిమాలో ఒక వీణ పాట ఉంది. ” సఖియా వివరించవే” అంటూ సాగే ఆపాట కోసం సావిత్రి అప్పట్లో వీణ నేర్చుకున్నారట.

వీణ వాయిస్తున్నపుడు కొన్నక్లోజప్ షాట్స్ తీయాల్సిన అవసరం ఉండటం తో దర్శకుడు కమలాకర కామేశ్వరరావు సావిత్రికి ఆ సలహా ఇచ్చారట.నర్తనశాల సినిమాగా రూపుదిద్దుకోవటానికి మూలకారణం విశ్వనాథ సత్యనారాయణ గారి నర్తనశాల నాటకం. అది చూసి నటి,నిర్మాత లక్ష్మీరాజ్యం సినిమా మొదలు పెట్టారు.

పాండవులందరిలోకి ద్రౌపదికి అర్జునుడంటే మహాఇష్టమట. ద్రౌపది అజ్ఞాతవాసంలో వుంది కనుక బంధాలను బహిరంగంగా చెప్పుకోలేని పరిస్థితుల్లో, మదిలో చెలరేగే భావాలను నర్మగర్భంగా  “సఖియా వివరించవే” పాట ద్వారా వ్యక్తీకరిస్తుంది.

మొదటిసారి సఖియా *వివరించవే* అన్నచోట వీణ,రెండవసారి సఖియా *వివరించవే* అన్నచోట ఫ్లూట్, మూడవసారి *వివరించవే* అన్నప్పుడు తబలా, నాల్గవసారి *వివరించవే* అన్నతర్వాత వయొలిన్,వీణ నాదాలు కల్సి చెవులకు ఇంపుగా వినిపిస్తాయి. ఈ పాట వింటుంటే మనసు మరేదో మూడ్ లోకి వెళ్తుంది. అదంతా సుసర్ల వారి మ్యూజిక్ తాలూకూ మ్యాజిక్..  

“వగలెరిగిన చెలునికి నాకథ” అని తన ఇష్టసఖికి నివేదించుకున్నట్టే వుంటుంది సైరంధ్రి వ్యక్తీకరణ. “నిన్ను చూసి కనులు చెదరి” అన్నసమయం లో అటుగా వచ్చిన కీచకుడు ద్రౌపదిని తమకంగా చూసే చూపును ఎస్వీఆర్ అద్భుతంగా ప్రదర్శించారు.

మరువ లేక-మనసు రాక-విరహాన-చెలి కాన-“వేగేనని”* ఆఖరుమాట అన్నప్పుడు కనుబొమ్మలు కొంచెం పైకెత్తి సావిత్రి ప్రదర్శించే హావభావాలు అమోఘం.వేరే నటిని ఆ పాత్రలో వూహించుకోలేం. ఒక్కో మాటకు ఒక్కోరకపు భావాన్నిముఖంలో బాగా పలికించారు సావిత్రి. సీనియర్ సముద్రాల వారి రచనా సామర్ధ్యానికి ఈ పాట ఒక మచ్చుతునక.

తెరమీద వీణపై సావిత్రి  వేళ్ళు నర్తిస్తే.. తెరవెనుక వీణపై స్వరాలను అలవోకగా పలికించారు ప్రముఖ వైణికులు చిట్టిబాబు.ఈ పాట అంటే చాలామంది చెవులు కోసుకుంటారు. అందుకే ఎవర్గ్రీన్ సాంగ్ గా మిగిలిపోయింది. 60 ఏళ్ళ క్రితం సుసర్ల వారు ట్యూన్ కట్టిన పాట ఇది.

కొంచెం రసికతను నింపిన సముద్రాల వారి కవ్వింపు సాహిత్యం,సరసతను సవరించే సుసర్ల వారి స్వర విన్యాసం, సుశీలమ్మ ‘సఖియా వివరించవే’ అన్నచోట, ‘నాకథ’ అన్నచోట విరుపులను గోముగా పలకటం,పాటలోని ప్రతి పదానికీ చూపించిన భావాన్ని చూపించకుండా సావిత్రి మార్చిమార్చి చూపించిన హావభావాలు అద్భుతంగా ఉంటాయి.

ఇక కీచకుడిగా ఎస్వీఆర్ సింగిల్ టేక్ లోనే అద్భుతమైన హావభావాలను ప్రదర్శించారు. ఎంత పెద్ద డైలాగైనా ఒక్కసారి వినగానే చెప్పేవారట.ముఖ్యంగా ఈ సినిమాలో ఆయన జీవించారు. ఇక ఎన్టీఆర్ గురించి .. బృహన్నల పాత్ర పోషణ గురించి చెప్ప నక్కర్లేదు. అందుకే సఖియా పాటకు అసలు వార్థక్యమే లేదు..ఇప్పటికి ఎప్పటికి ఎవరు గ్రీన్ సాంగ్. 

మీరు కూడా ఒకసారి ఆపాట చూసి ఆనందించండి… 

లింక్ పై క్లిక్ చేయండి
సఖియా వివరించవే

 

courtesy…. unknown writer 

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!