Will elections decide the fate of seniors? …………………………
ఐదు రాష్ట్రాల ఎన్నికలు ప్రధాని నరేంద్రమోదీ సారధ్యం లోని బీజేపీ కి , సోనియా సారధ్యంలోని ఇండియా కూటమికి పరీక్షగా మారనున్నాయి. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికలు ఎన్నో రకాలుగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. వాటి ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దేశ రాజకీయ భవిష్యత్తును నిర్దేశించడంలో వచ్చే నవంబర్ కీలకంగా మారనుంది.
త్వరలో అసెంబ్లీలకు జరగనున్న ఎన్నికలు వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికలకు రంగం సిద్ధం చేయనున్నాయి. అందుకే వీటి ఫలితాలను తమకు అనువుగా మార్చుకోవాలని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, ఇండియా కూటమి పట్టుదలగా ఉన్నాయి.
అందుకోసం సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి.జరగ బోయే అసెంబ్లీ ఎన్నికలు ఆ తర్వాత వచ్చే లోక్‌సభ ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయాలని ఏమీ లేదు. ప్రజలు అసెంబ్లీ ఎన్నికలను ఒక రీతిగా .. అసెంబ్లీ ఎన్నికలను మరోరీతిగా చూస్తారు. ఉదాహరణకు 2018లో ఇలాగే రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీలకు ఎన్నికలు జరిగాయి. మూడింట్లోనూ కాంగ్రెస్సే నెగ్గింది.
కానీ 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆ మూడు రాష్ట్రాల్లోని 65 లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్ నెగ్గింది కేవలం మూడంటే మూడు. అలా ఓటర్ల అభిప్రాయం మారే అవకాశాలు లేకపోలేదు. అయితే ఈసారి మాత్రం జాతీయ స్థాయిలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఐదు రాష్ట్రాల ఎన్నికలు ఖచ్చితంగా 2024 లోక్‌సభ ఎన్నికలకు మూడ్ సెట్ చేస్తాయని భావిస్తున్నారు.
ఈక్రమంలోనే పార్టీలు సామాజిక, ఆర్థిక, సంక్షేమ పథకాలపై కసరత్తు చేసి ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. బీజేపీ నరేంద్ర మోదీ ఛరిష్మాను ఓట్లుగా మార్చుకునేలా ప్రచారం నిర్వహిస్తోంది.జీ20 సదస్సు ఘనవిజయం, మహిళా బిల్లు, ఎల్పీజీ సిలిండర్ ధర తగ్గింపు అంశాలను జనంలోకి తీసుకెళ్తున్నది.
తాజా అసెంబ్లీ ఎన్నికలు మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్, రాజస్తాన్‌లో వసుంధర రాజె, ఛత్తీస్‌గఢ్‌లో రమణ్‌సింగ్‌తో పాటు రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లత్ , మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్ తదితరుల భవితవ్యాన్ని తేల్చనున్నాయి. అలాగే తెలంగాణ సీఎం కేసీఆర్, మిజోరం సీఎం జోరాంతంగా ముక్కోణపు పోటీ ఎదుర్కొంటున్నారు.