A new kind of campaign………………………………………………………….
ఇండియా మమతా బెనర్జీని ప్రధానిగా కోరుకుంటుందా ? ఆ సంగతి ఏమో కానీ మమతా బెనర్జీ మాత్రం జాతీయ స్థాయిలో బీజేపీని ఢీకొట్టేందుకు తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు.2024 లోక సభ ఎన్నికల్లో మమత బెనర్జీని ప్రధాన మంత్రి అభ్యర్థిగా రేసులో నిలిపేందుకు తృణమూల్ పార్టీ కొత్త ప్రచారానికి తెరలేపింది.
‘దేశం మమతను కోరుకుంటోంది (ఇండియా వాంట్స్ మమతాదీ)’ అనే నినాదాన్ని ఎంచుకుంది. ఈ నినాదాన్ని జనంలోకి తీసుకెళ్లేందుకు .. విస్తత ప్రచారం కల్పించేందుకు ఇండియా వాంట్స్ మమతాదీ(ఐడబ్ల్యూఎం) పేరిట ఓ వెబ్ సైట్ ను కూడా ప్రారంభించింది. పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ భావజాలాన్ని నమ్మేవారికి ఐడబ్ల్యూఎం ఓ వేదిక అని ప్రచారం చేస్తున్నారు.
2024 ఎన్నికల్లో బీజేపీని ఢీకొట్టేందుకు ప్రాంతీయ పార్టీలతో జత కట్టి థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుకు మమత చాలాకాలంగా ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే.2021 అసెంబ్లీ ఎన్నికలకు సమయంలో కూడా ‘బంగ్లా నిజేర్ మేయే కే చాయే’ (బెంగాల్‌కు తన సొంత కూతురే కావాలి) అనే నినాదం తో ముందుకొచ్చింది.
అప్పట్లో ఆ నినాదం బాగా క్లిక్ అయింది. నాటి ఎన్నికల్లో 294 అసెంబ్లీ స్థానాలకు గాను 213 స్థానాలను కైవసం చేసుకున్న తృణమూల్ ఇతర రాష్ట్రాలలో కూడా అడుగు పెట్టింది. అయితే ఫలితాలు మాత్రం సాధించలేదు. తాజాగా 2024 పార్లమెంటు ఎన్నికల్లో బిజెపిని గద్దె దించుతామని బహిరంగ సవాలు విసురుతోంది.
పశ్చిమ బెంగాల్లో ‘సుపరిపాలన’ ద్వారా ఆదరణ పొందుతున్న దీదీ 2024లో మొదటి బెంగాలీ ప్రధాని అవుతారని కూడా వెబ్సైట్ లో రాసుకొచ్చారు. ఈ తరహా ప్రచారం చేయమని దీదీ కి సలహా ఎవరు ఇచ్చారో తెలీదు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కొంత కాలం క్రితం వరకు దీదీ ఫ్రంట్ కోసం పనిచేశారు.
దీదీ కూడా పలు రాష్ట్రాల సీఎంలు .. రాజకీయ నేతలతో మంతనాలు చేశారు. తర్వాత ఒక దశలో యూపీఏ ఫ్రంట్ వైపు మొగ్గు చూపారు. మళ్ళీ ఎందుకో మనసు మార్చుకుని థర్డ్ ఫ్రంట్ అంటున్నారు. కొత్త తరహా ప్రచారం చేపట్టారు.