అప్పట్లో ఆయనది బంపర్ మెజారిటీ !!

Sharing is Caring...

బాల్య మిత్రుడు, ప్రధాని ఇందిరా గాంధీ కుమారుడు రాజీవ్ గాంధీ అడగ్గానే సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్  అలహాబాద్ వెళ్లి ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్ వేశారు. ఇది ఇప్పటి కథ కాదు.1984లో జరిగింది.

ఇందిరాగాంధీ హత్య దరిమిలా జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున అలహాబాద్ లో పోటీ చేసేందుకు గట్టి అభ్యర్థి  లేకపోవడంతో రాజీవ్  తన మిత్రుడు అమితాబ్ ను అక్కడ నుంచి పోటీ చేయమని అడిగారు.  అంతే .. వెనుకా ముందూ ఆలోచించకుండా అమితాబ్ వెళ్లి నామినేషన్ వేశారు.

అలహాబాద్ సుప్రసిద్ధ రాజకీయ నాయకుడు హేమావతి నందన్ బహుగుణ నియోజకవర్గం. బహుగుణ ఉత్తరాది పాలిటిక్స్‌‌లో చాలా సీనియర్. యూపీకి రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. 1971లో కేంద్రంలో మంత్రిగా కూడా పనిచేశారు. 1984లో భారతీయ లోక్ దళ్ (బీఎల్‌ డీ) తరపున బహుగుణ పోటీ చేశారు. 

నామినేషన్ వేసిన తర్వాత తెలిసింది తాను ఎవరిపై పోటీ చేస్తున్నది. అయినా అధైర్యపడలేదు అమితాబ్. ప్రచార రంగంలోకి దిగి దూసుకు పోయారు . ఫలితంగా 1,87,795 ఓట్ల మెజారిటీ తో ఘన విజయం సాధించారు. ఆ రికార్డు ను ఇప్పటి వరకు ఎవరూ అధిగమించలేకపోయారు. ఆ ఎన్నికల్లో అమితాబ్ కు  297,461 ఓట్లు వచ్చాయి. ఇక బహుగుణాకు 109 666 ఓట్లు వచ్చాయి. బరిలోకి దిగిన 24 మందికి పోలైన ఓట్లలో 1 శాతం కూడా రాలేదు. 

ఇక ఈ నియోజక వర్గానికి పెద్ద చరిత్ర ఉంది.  దేశ ప్రధాన మంత్రిగా  చేసిన లాల్ బహదూర్ శాస్త్రి ఇక్కడ  నుంచే 1957,1962 సంవత్సరాలలో పోటీ చేశారు. అలాగే  వీపీ సింగ్ కూడా ఇక్కడ నుంచే కాంగ్రెస్ తరపున 1980 లో పోటీ చేసి గెలిచారు. అమితాబ్ రాజీనామా చేసిన తర్వాత 1988 లో జరిగిన ఉప ఎన్నికలో వీపీ సింగ్ ఇండిపెండెంట్ గా బరిలోకి దిగి గెలుపొందారు. 

తదనంతర రాజకీయ పరిణామాలలో దేశ 8 వ  ప్రధాని అయ్యారు. తర్వాత బహుగుణ కూడా 1971 లో ఇక్కడి నుంచే కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. కేంద్రమంత్రి అయ్యారు. రెండో సారి బీఎల్ డీ  నుంచి పోటీ చేసి అమితాబ్ చేతిలో ఓడిపోయారు. ఈ ఓటమితో ఆయన రాజకీయ జీవితం ముగిసిపోయింది.

అమితాబ్ తర్వాత కాంగ్రెస్ పార్టీ మరెప్పుడూ అక్కడ గెలవలేదు. 1952 నుంచి 2019 వరకు  ఎవరికి  కూడా అమితాబ్ కి వచ్చిన మెజారిటీ రాలేదు. అమితాబ్ రికార్డును ఎవరూ కూడా బ్రేక్ చేయలేక పోయారు. అంతటి ఘన విజయం సాధించిన అమితాబ్ మంత్రిగా కూడా చేయలేదు. ఎంపీగానే ఉన్నారు.

నియోజకవర్గ సమస్యలపై  దృష్టి పెట్టి వాటి పరిష్కారం కోసం కృషి చేశారు. అయితే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను పూర్తిగా అమలు చేయక ముందే 1987 లో అమితాబ్ ఎంపీ పదవికి అకస్మాత్తుగా రాజీనామా చేశారు. ఒక టర్మ్ కూడా కంప్లీట్ చేయలేదు మూడేళ్ళ కే రాజకీయాలకు స్వస్తి పలికాడు. అమితాబ్  అసలు ఎందుకు రాజీనామా చేసాడు ? కారణాలేమిటి ? ఎవరైనా హర్ట్ చేశారా ? ఇంకేదైనా జరిగిందా ? అనేది సస్పెన్సు గా నే ఉండిపోయింది. ఎంతమంది అడిగినా అమితాబ్ అసలు విషయం బయటికి చెప్పలేదు.

—————KNM  

ఇది కూడా చదవండి>>>>>>>>>>>>>>>>>  నటుడిగా ఆదరించారు..రాజకీయంగా తిరస్కరించారు ! 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!