క్యాబేజీకి అంత కథ ఉందా ?

Sharing is Caring...

ఫొటోలో కనిపించే పువ్వు ను క్యాబేజీ లేదా కాలీ ఫ్లవర్ అంటారు.. ఈ క్యాబేజీ కి 2300 ఏళ్ళ చరిత్ర ఉంది. ఇది బ్రాసికేసి కుటుంబానికి చెందిన ఒక మొక్క , దీనిని సాధారణంగా ఆవాలు, క్రూసిఫర్‌లు లేదా క్యాబేజీ కుటుంబం అని కూడా పిలుస్తారు. 

కాలీఫ్లవర్ అన్ని భాగాలు ఆకులు, కాండంతో సహా తినదగినవే. కానీ చాలామంది పువ్వును మాత్రమే కూర చేసుకుంటారు. కొందరు ఆకులు, కాండంతో పచ్చడి కూడా చేసుకుంటారు. కాలీఫ్లవర్ రుచికరమైన కూరగాయ మాత్రమే కాదు, ఇందులో విటమిన్లు..  పోషకాలు  కూడా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా, వందలాది రకాల కాలీఫ్లవర్‌లు ఉన్నాయి.

ఇది ఇండియాలో కొచ్చి 200 ఏళ్లు అవుతోంది. పేద, సంపన్న తేడా లేకుండా  కోట్ల మంది భారతీయులు కాలీ ఫ్లవర్ ను ఇష్టపడతారు.  కూరగానే కాకుండా గోబీ మంచూరియా, ఆలూ గోబీ వంటి చవులూరించే స్నాక్స్ తయారీకి దీన్ని ఉపయోగిస్తారు.  మన వంటకాల్లో ఎక్కువగా ఉపయోగించే బంగాళదుంపలు, టమోటాలు, మిర్చి వంటివి పోర్చుగీసువారి ద్వారా ఇండియా కొచ్చాయి. 

కాలీ ఫ్లవర్ ను మాత్రం బ్రిటిషువారు తీసుకొచ్చారు.  జెమ్ సన్ అనే వృక్ష శాస్త్రవేత్త 1822లో క్యాలీఫ్లవర్ విత్తనాలను భారత్ కు తెప్పించారు. అదే ఏడాది వాటిని ఇక్కడి భూముల్లో విత్తారు. అప్పటి నుంచి  నిరాటంకంగా ఈ కాలీ పంటను సాగు చేస్తున్నారు.19వ శతాబ్దం చివరినాటికి సాగు ఊపందుకుని భారత్ లోని పెద్ద పట్టణాల్లో క్యాలీఫ్లవర్ అమ్మకాలు వృద్ధి చెందాయి. 

అప్పట్లో ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో అర్ధ అణాకు దీన్ని విక్రయించేవారు. క్రమంగా దీన్ని మాంసాహార వంటకాల్లోనూ వాడటం మొదలుపెట్టారు. దీన్ని  చేపల కూరలోకి వాడతారు.
క్యాలీఫ్లవర్ అనేది క్యాలిస్, ఫేస్ అనే లాటిన్ పదాల నుంచి వచ్చింది. క్యాలిస్ అంటే క్యాబేజీ అని, ఫ్లోస్ అంటే పువ్వు అని అర్థం. 

2,300 ఏళ్ల కిందట ఆసియా, మధ్యధరా ప్రాంతంలో తొలుత క్యాలీఫ్లవర్ సాగైనట్లు చరిత్ర చెబుతోంది.  దీని మూలాలు సైప్రస్ ద్వీపంలో ఉన్నాయని అంటారు. క్రమంగా క్యాలీఫ్లవర్ ప్రపంచం మొత్తం విస్తరించింది. 

జీర్ణాశయ సమస్యలను దూరం చేసే పీచు పదార్థం ఇందులో అధికంగా ఉంది. దీని పువ్వు భాగమే కాకుండా, ఆకులు, కాండంలోనూ పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇందులో సి విటమిన్ సమృద్ధిగా ఉంటుంది. ఇది ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తుంది.

రోగ నిరోధక శక్తినీ పెంచుతుంది.  ఇందులోని కె విటమిన్.. గాయాలను త్వరగా నయం చేస్తుంది. ఫోలేట్.. ఎర్ర రక్త కణాలను పెంచుతుంది. బీ6 విటమిన్.. జీవ క్రియలు ఆరోగ్యంగా సాగేలా చూస్తుంది. పొటాషియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, బయోటిన్, ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు వంటి పోషకాలూ ఇందులో ఉన్నాయి.ఇది క్యాన్సర్, గుండె, మెదడు రుగ్మతల ముప్పును తగ్గిస్తుంది. 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!