Bharadwaja Rangavajhala ………………………..
ఈ అమ్మాయి పేరు శారద.తెలుగు సినిమాల్లో కామెడీ వేషాలతో మొదలెట్టి మళయాళంలో యమసీరియస్సు పాత్రలేసి …ఆనక మళ్లీ తెలుగు ప్రేక్షకులనీ ఏడిపించి … ఏడుపుకొట్టు శారద అనే టైటిలు కూడా సంపాదించేసుకుని ….మనుషులు మారాలి సినిమా రేడియో లో వస్తుంటే విని ఏడ్చేసిన వాళ్లూ ఉన్నారు.
నేనే కళ్లారా చూశాను. అంతగా ఏడిపించి ..ఇక లాభం లేదని ఎన్టీఆర్ చండశాసనుడు తో మొదలెట్టి
తర్వాత వచ్చిన పరుచూరి రాతన పడ్డ సినిమాల్లో యు హౌమచ్ అనే హీరోయిక్ రోల్స్ కూడా చేసేసి అదరగొట్టేసింది .
ఇదంతా ఓ గొడవైతే …దీనికి పారలల్ గా మరో గొడవుంది …అదేంటంటే ….శారద గారి కళ్లంటే … బాపుగారికి చాలా పెద్ద బోల్డు ఇష్టం అట.నాకు తెల్దు…అందుకనేమో …వెంట వెంటనే కలియుగ రావణాసురుడు, రాజాధిరాజు సినిమాల్లో అవకాశాలిచ్చేశారు.
కలియుగ రావణాసురుడులో అయితే ….శారదగారి కళ్లను చూపిస్తూ …తొలిపొద్దులో తామర కళ్ళూ..మలిసందెలో కలువ కళ్ళూ..ఏటిపాయలో చేప కళ్ళూ..తోటమలుపులో లేడి కళ్ళూ అన్నారు. సిగ్గును చీరగా కప్పుకుని,చిలిపిగా ఓరగా తప్పుకుని,చిరు చిరు నవ్వులు,చుర చుర చూపులు,
కలియబోసి ముగ్గులేసి,రారమ్మని పోపొమ్మని ఇలా బోల్డు భావుకత ఉంటుందా పాటలో.
ఫైనల్ గా ఎన్నేళ్లు చూసినా.. ఎన్నాళ్లు వేచినా లోతులందని కళ్లని కూడా కితాబులిప్పించారు పాపం నారాయణరెడ్డి గారి కలం మీదుగా … రమణ గారు. ఆ తర్వాత మళ్లీ …పాత కథ కంటిన్యూషన్ లోకి వస్తే ….అంతః పురంలో ప్రకాశ్ రాజ్ భార్యగా ఫాక్షనిస్ట్ లకు భయం పుట్టేలా నటించేశారావిడ. ఏంటి నువ్వు నరికేది అని.
అందరి దర్శకులతోను.. హీరోలతో నటించిన ఖ్యాతి కూడా శారదదే. శారదా సూపర్ స్టార్ కృష్ణ తో పదుల సంఖ్యలో హీరోయిన్గా చేసింది. అయితే సెకండ్ ఇన్నింగ్స్ లో కృష్ణ పక్కన అగ్ని కెరటాలు, అగ్ని పర్వతం వంటి మూవీల్లో తల్లిగా చేసింది. 1993 తర్వాత, ఆమె ఎంపిక చేసుకుని కొన్ని సినిమాలు మాత్రమే చేసింది.
అరవై ఏళ్ళ సుదీర్ఘ సినీ ప్రయాణంలో తెలుగు, తమిళ, మళయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఎన్నో సినిమాలు చేసింది. మూడుసార్లు జాతీయ ఉత్తమ నటిగా, రెండు సార్లు ఫిలిం ఫేర్ అవార్డుల విజేతగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా ఎన్టీఆర్ జాతీయ అవార్డు స్వీకర్తగా… చరిత్ర సృష్టించింది.
ఓ సారేమయ్యిందంటే …బెజవాడ లో ప్రతిధ్వని సినిమా సక్సస్ మీట్ కు వచ్చిన శారదగారిని పలకరించిన ఓ జర్నలిస్టు మిత్రుడు షేక్ హ్యాండ్ ఇవ్వబోయాడు …ఆవిడ నవ్వుతూ రెండు చేతులూ జోడించి …దణ్ణం పెట్టి… నా వరకు ఇలా కానిచ్చేయనివ్వండి అన్నారు నవ్వుతూనే.
ఆ తర్వాత తెనాలి నుంచీ పార్లమెంటుకు వెళ్లారు …అంతాబానే ఉందిగానీ .. శారదకు ఇతర భాషల్లో వచ్చినంత గుర్తింపు తెలుగులో రాలేదనే మాట నిజమనాలంటేనే కాస్త ఇబ్బందిగా ఉంటుంది. కవర్ ఫొటో ప్రతిధ్వని టైము లోది కాదని మనవి …చాలా కాలం క్రితం అంటే ఆవిడ తెరంగేట్రం చేసిన కొత్తలో జరిగిన సినిమా లో తీసినదన్నమాట.